Share News

ఆ రాష్ట్రాల పేర్లూ..

ABN , Publish Date - Nov 22 , 2024 | 06:54 AM

సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల నిమిత్తం అదానీ ఒక్క ఆంధ్రప్రదేశ్‌ ‘ముఖ్యుడి’కే కాదు.. ఛత్తీ్‌సగఢ్‌, ఒడిశా, తమిళనాడు, జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వ పెద్దలు/అధికారులకూ

ఆ రాష్ట్రాల పేర్లూ..

అదానీ లంచాల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌, జమ్ముకశ్మీర్‌ పేర్లు

గౌతమ్‌ అదానీని ‘మిస్టర్‌ ఎ’గా.. ‘ద బిగ్‌ మ్యాన్‌’గాపేర్కొంటూ ఎన్‌క్రిప్టెడ్‌ సందేశాలతో సమాచార సరఫరా

నేరారోపణ పత్రాల్లో పేర్కొన్న అమెరికా ప్రాసిక్యూటర్లు

న్యూఢిల్లీ, నవంబరు 21: సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల నిమిత్తం అదానీ ఒక్క ఆంధ్రప్రదేశ్‌ ‘ముఖ్యుడి’కే కాదు.. ఛత్తీ్‌సగఢ్‌, ఒడిశా, తమిళనాడు, జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వ పెద్దలు/అధికారులకూ లంచాలు ఇచ్చినట్టు అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఈ నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంతో 12 గిగావాట్ల సౌర విద్యుత్‌ ఒప్పందం కుదుర్చుకోవడానికి గౌతం అదానీ, మరో ఏడుగురు కలిసి.. 265 మిలియన్‌ డాలర్లు లంచంగా ఇచ్చినట్టు వారు వెల్లడించారు. ఈ లంచాలు ఇచ్చిన సమయమైన 2022 ఏప్రిల్‌ నాటికి ఈ సొమ్ము మన కరెన్సీలో రూ.2,029 కోట్లు అని వివరించారు. ఆ రూ.2029 కోట్లలోనూ.. 7 గిగావాట్ల ఒప్పందం నిమిత్తం ఒక్కో మెగావాట్‌కూ రూ.25 లక్షల చొప్పున మొత్తం 7000 మెగావాట్లకుగాను ఏపీ ‘ముఖ్యుడి’కి రూ.1750 కోట్లు ఇచ్చినట్టు వెల్లడించారు. అలాగే.. 2021 జూలై-2022 నడుమ 5 గిగావాట్ల ఒప్పందాలకు సంబంధించిన మిగతా సొమ్మును (రూ.279 కోట్లు) మూడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వాల పెద్దలు/నేతలకు ఇచ్చినట్టు తెలిపారు. ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు తమిళనాట డీఎంకే, ఒడిశాలో నవీన్‌పట్నాయక్‌ బిజూ జనతాదళ్‌, ఛత్తీ్‌సగఢ్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా.. జమ్ము కశ్మీర్‌ కేంద్ర పాలనలో ఉంది. వీటిలో ఒడిశా డిస్కమ్‌లు 500 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. కాగా.. ఈ లంచాల వ్యవహారంలో అదానీ తదితరులు సంకేత నామాల ద్వారా వ్యవహరించుకున్నారని.. సంకేత నిక్షిప్త (ఎన్‌క్రిప్టెడ్‌) సందేశాల ద్వారా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్నారని యూఎస్‌ ప్రాసిక్యూటర్స్‌ పేర్కొన్నారు. ఉదాహరణకు.. పరస్పరం రాసుకున్న లేఖల్లో వారు గౌతమ్‌ అదానీని ‘న్యూమరో వన్‌’ అని.. ‘ద బిగ్‌ మ్యాన్‌’ అని.. వినీత్‌ ఎస్‌.జైన్‌ను ‘వి’, ‘స్నేక్‌’, ‘న్యూమరో యునో మైనస్‌ వన్‌’ అనే పేర్లతోటి.. వ్యవహరించినట్టు తెలిపారు.

Updated Date - Nov 22 , 2024 | 06:54 AM