Share News

Rajya Sabha Polls: రాజ్యసభకు సోనియా నామినేషన్

ABN , Publish Date - Feb 14 , 2024 | 02:15 PM

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు బుధవారంనాడు నామినేషన్ వేశారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియాగాంధీ త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజ్యసభకు నామినేషన్ వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Rajya Sabha Polls: రాజ్యసభకు సోనియా నామినేషన్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) రాజస్థాన్‌ (Rajasthan) నుంచి రాజ్యసభ (Rajya Sabha)కు బుధవారంనాడు నామినేషన్ వేశారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియాగాంధీ త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజ్యసభకు నామినేషన్ వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గాంధీలకు కంచుకోటగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి నుంచి సోనియాగాంధీ స్థానంలో ప్రియాంక గాంధీ వాద్రా తొలిసారి లోక్‌సభకు పోటీ చేయనున్నట్టు సమాచారం.


సోనియాగాంధీ రాజ్యసభకు నామినేషన్ వేసిన సందర్భంగా ఆమె వెంట రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, పీసీసీ చీఫ్ గోవింద్ సింగ్ డోటస్ర, అసెంబ్లీలో విపక్ష నేత టికారాం జులీ తదితరులు హాజరయ్యారు. నామినేషన్ వేయడానికి ముందు పార్టీ ఎమ్మెల్యేలతో అసెంబ్లీలోని విపక్ష లాబీలో సోనియాగాంధీ సమావేశమయ్యారు. రాజ్యసభ ఎన్నికలు, తన అభ్యర్థిత్వానికి మద్దతుపై ఈ సమావేశంలో ఆమె చర్చించారు. రాజస్థాన్‌ నుంచి 3 రాజ్యసభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక సీటు సులభంగా గెలుచుకోగలిగే స్థితిలో ఉంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరేళ్ల రాజ్యసభ పదవీకాలం ఏప్రిల్‌లో ముగియనుండటంతో సోనియాగాంధీ ఆ స్థానంలో పోటీ చేస్తున్నారు. ఆమె ఇప్పటి వరకూ ఐదు సార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించగా, రాజ్యసభకు గెలిస్తే ఇదే మొదటిసారి అవుతుంది. 77వ పడిలో పడిన సోనియాగాంధీ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపలేదు.

Updated Date - Feb 14 , 2024 | 02:15 PM