కొంపముంచిన 100 గ్రాములు పతకం దూరం!
ABN , Publish Date - Aug 08 , 2024 | 05:54 AM
పారిస్ ఒలింపిక్స్‌లో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ ‘ఫైనల్ బౌట్’ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన భారత అభిమానుల గుండెపగిలింది. ఆమెకు స్వర్ణపతకం.. లేకపోతే రజతం ఖాయమని సంబరపడుతున్న వేళ షాక్ తగిలింది. వినేశ్‌పై ఫైనల్ బౌట్ ముంగిట అనర్హత వేటు పడింది. యాభై కిలోల విభాగంలో బరిలోకి దిగిన ఆమె, 50 కిలోలకు మించి 100 గ్రాముల
ఫైనల్ బౌట్‌కు ముందు వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు
నిర్ణీత బరువు 50 కిలోలకన్నా 100 గ్రాములు ఎక్కువున్నట్లు నిర్ధారణ
నిబంధనల ప్రకారమే పోటీ నుంచి తప్పించారన్న వరల్డ్ రెజ్లింగ్ చీఫ్
స్పందించిన మోదీ.. ఐవోసీ ఎదుట నిరసన తెలపాలని పీటీ ఉషకు సూచన
వినేశ్.. చాంపియన్లలో చాంపియన్‌వి.. దేశమంతా నీవెంటే: ప్రధాని ట్వీట్
సాంకేతిక కారణాలతో పోటీ నుంచి తప్పించడం దురదృష్టకరం: రాహుల్
12 గంటల్లో బరువు తగ్గించడానికి చేయాల్సిందంతా చేశాం: జట్టు వైద్యుడు
వినేశ్ అనర్హతకు గురవడం బాధించింది: బ్రిజ్‌భూషణ్ కుమారుడు కరణ్
పూర్తి విచారణ జరగాలి.. పార్లమెంటు ఉభయసభల్లో విపక్షాల పట్టు
క్రీడామంత్రి వివరణపై అసంతృప్తి.. వాకౌట్.. న్యాయం చేయాలంటూ నిరసన
కోచ్‌లు, న్యూట్రిషనిస్ట్, సహాయ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమా?
మంగళవారం ప్రీక్వార్టర్స్‌కు ముందు 49.9 కిలోలున్న ఫొగట్
అదే రోజు 3 బౌట్లు అయ్యాక ఆమెకు స్వల్పంగా ఆహారం, నీళ్లు..
కొన్నిగంటల్లోనే 52.8 కిలోలకు చేరిక.. తగ్గేందుకు రాత్రంతా కసరత్తులు
స్కిప్పింగ్, జాగింగ్, జుత్తు, జెర్సీ కొంతమేర కత్తిరింపు..
ఆఖరికి శరీరంలోంచి కొంతమేర రక్తం తీసివేత.. అయినా తప్పని నిరాశ
నిర్ణీత బరువుకన్నా 50 గ్రాములు, 100 గ్రాముల బరువు అధికంగా ఉన్నా కూడా రెజ్లర్లను గతంలో కొన్ని టోర్నీల్లో అనుమతించారు. ఒలింపిక్స్‌లో నిబంధనలు వేరు. పారిస్ ఒలింపిక్స్‌లో వినేశ్‌కు ఇలా జరిగిందని అభిమానులు నిరాశ చెందొద్దు. ఏదో ఒకరోజు ఆమె కచ్చితంగా పతకం సాధిస్తుంది. తదుపరి ఒలింపిక్స్ కోసం ఆమెను సన్నద్ధం చేస్తా.
- వినేశ్ ఫొగట్ పెదనాన్న, దిగ్గజ రెజ్లర్ మహావీర్ ఫొగట్
న్యూఢిల్లీ, ఆగస్టు 7: పారిస్ ఒలింపిక్స్‌లో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ ‘ఫైనల్ బౌట్’ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన భారత అభిమానుల గుండెపగిలింది. ఆమెకు స్వర్ణపతకం.. లేకపోతే రజతం ఖాయమని సంబరపడుతున్న వేళ షాక్ తగిలింది. వినేశ్‌పై ఫైనల్ బౌట్ ముంగిట అనర్హత వేటు పడింది. యాభై కిలోల విభాగంలో బరిలోకి దిగిన ఆమె, 50 కిలోలకు మించి 100 గ్రాముల బరువున్నట్లు గుర్తించారు. ఆ వెంటనే.. ఒలింపిక్ కమిటీ ఓ ప్రకటన చేసింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిబంధనల మేరకు వినేశ్‌పై అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా ఆమె ఫైనల్ బౌట్‌లోకి దిగే అవకాశమే లేకుండా పోయింది. వినేశ్‌పై అనర్హత వేటు విషయం తెలిసిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధ్యక్షురాలు పీటీ ఉషతో ఫోన్లో మాట్లాడారు. వినేశ్ విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) ముందు భారత్ నిరసనను వ్యక్తం చేయాలని సూచించారు. అయితే వినేశ్ అనర్హతపై పున:సమీక్షించాలంటూ ఐవోసీని ఐవోఏ కోరినా ఫలితం లేకపోయింది. నిబంధనలు అందరికీ ఒకేలా ఉంటాయని, వినేశ్ విషయంలో ఏమీ చేయలేమంటూ వరల్డ్ రెజ్లింగ్ చీఫ్ నెనాడ్ లలోవిక్ స్పష్టం చేశారు. అనంతరం.. వినేశ్‌ను పోటీల నుంచి తప్పించారన్న వార్తను పంచుకోవడం అత్యంత బాధాకరం అని భారత ఒలింపిక్ సంఘం ప్రకటన విడుదల చేసింది. తర్వాత దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ తదితర రంగాల్లోని ప్రముఖులు ఫొగట్‌కు సంఘీభావం ప్రకటించారు. ‘వినేశ్.. చాంపియన్లకే చాంపియన్‌వి నువ్వు. దేశానికి నువ్వు గర్వకారణం. ప్రతి ఒక్కరికి స్ఫూర్తి. ఈ సమయంలో మేమంతా నీ వెంటే ఉన్నాం’ అని ప్రధాని మోదీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. సాంకేతిక కారణాలతో వినేశ్‌ను తప్పించడం దురదృష్టకరం అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. దేశమంతా ఆమె వెంటనే ఉందని, మున్ముందు ఆమె మరింత కసితో బరిలోకి దిగి సత్తా చాటుతారని ఎక్స్‌లో రాహుల్ పేర్కొన్నారు. కాగా షెడ్యూల్ ప్రకారం బుధవారం రాత్రి జరిగిన ఫైనల్లో అమెరికా రెజ్లర్ సారా హిల్డెబ్రాంట్‌తో వినేశ్ పసిడి కోసం పోరాడాల్సి ఉంది. వినేశ్‌పై వేటుపడటంతో సెమీఫైనల్లో ఆమె చేతిలో ఓటమిపాలైన క్యూబా బాక్సర్ గుజ్మన్ లోపెజ్ వినేశ్ స్థానంలో ఫైనల్లో తలపడింది.
కొన్ని గంటల్లోనే 2.8 కిలోలు బరువు పెరుగుదల
వినేశ్ ఫోగట్ 50 కిలోల విభాగంలో బరిలోకి దిగింది. నిబంధనల ప్రకారం బౌట్‌లు మొదలయ్యే రోజు రెజ్లర్ల బరువు కొలుస్తారు. నిర్ణీత బరువు, అంతకన్నా తక్కువ ఉంటేనే బరిలోకి అనుమతిస్తారు. మంగళవారం వినేశ్.. తన విజయ పరంపర కొనసాగిస్తూ మూడు బౌట్లు ఆడింది. తొలి పోటీకి ముందు ఆమె బరువు 49 కిలోల 900 గ్రాములుగా ఉంది. ఆ వెంటనే ఆమె ప్రీక్వార్టర్స్, క్వార్టర్స్, సెమీఫైనల్ ఆడింది. సెమీస్ బౌట్ ముగిశాక.. వినేశ్ బలహీనంగా కనిపించడంతో ఆమె మితంగా ఆహారం, నీళ్లు తీసుకుందని తెలిసింది. తర్వాత కొన్ని గంటల్లోనే ఆమె బరువు చెక్ చేసుకుంటే 52 కిలోల 800 గ్రాములుగా వచ్చింది. దీంతో ఆమె బరువు తగ్గించుకునేందుకు తీవ్రంగా శ్రమించింది. రాత్రంతా స్కిప్పింగ్, జాగింగ్ చేసింది. శరీరంలోంచి కొంత రక్తాన్ని కూడా తీసేయించుకుంది. చివరికి జట్టు కూడా కత్తిరించుకుంది. రెజ్లింగ్ పోటీల్లో వేసుకునే డ్రెస్‌ను కూడా చిన్నగా వేసుకుంది. అయినా ఫలితం లేకపోయింది. ఫైనల్ బౌట్ కోసం బుధవారం ఉదయం ఒలింపిక్ నిర్వాహకులు బరువు తూచగా ఫొగట్ 50 కిలోల 100 గ్రాములు ఉన్నట్లు తేలింది. స్వర్ణ పతక వేటలో ఉన్న వినేశ్‌లాంటి అథ్లెట్ విషయంలో ఎప్పటికప్పుడు బరువు సరిచూడాల్సిన కోచ్‌లు, న్యూట్రిషనిస్ట్, సహాయ సిబ్బంది నిర్లక్ష్యం ఉందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వినేశ్ అనూహ్యంగా బరువు పెరిగిన విషయం తెలియగానే.. తగ్గించేందుకు అన్నివిధాలుగా ప్రయత్నించామని భారత బృందంతో వెళ్లిన వైద్యాధికారి దిన్షా పర్దివాలా వెల్లడించారు.
కుట్ర కోణముందా?
వినేశ్ ఫొగట్‌పై కుట్రకోణం ఏమైనా ఉందా? ఆమెను పోటీల నుంచి తప్పించేందుకు ఎవరో కావాలని చేశారా? ఇదే అనుమానాన్ని మాజీబాక్సర్, ఒలింపిక్ పతక విజేత విజేందర్ వ్యక్తం చేశారు. పారిస్ క్రీడల్లో భారత రెజ్లర్లకు వ్యతిరేకంగా పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈఆరోపణలను భారత అథ్లెటిక్స్ సమాఖ్య ఖండించింది. ఇది కేవలం సాంకేతికకు సంబంధించిన అంశం అని, దీన్ని రాజకీయం చేయొద్దని అథ్లెటిక్ సమాఖ్య కోరింది.
రాజకీయ రగడ...
రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అనర్హత అంశం రాజకీయ రగడకు దారితీసింది. ఈ అంశంపై పార్లమెంటు ఉభయసభల్లో చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. వినేశ్ అనర్హత ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో లోక్‌సభలో క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ప్రకటన చేశారు. వినేశ్ అనర్హతపై అంతర్జాతీయ ఒలింపిక్ సంఘాన్ని భారత ఒలింపిక్ సంఘం గట్టిగా ప్రశ్నించిందని.. తన అసంతృప్తిని వ్యక్తం చేసిందని, ఐవోఏ చీఫ్ పీటీ ఉషతో ప్రధాని మోదీ స్వయంగా మాట్లాడారంటూ వివరించారు. ఈ వివరణతో సంతృప్తి చెందని విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ఇదే విషయంలో రాజ్యసభ నుంచి కూడా విపక్షాలు వాకౌట్ చేశాయి. అనంతం విపక్షాల ఎంపీలంతా వినేశ్‌కు న్యాయం చేయాలని కోరుతూ పార్లమెంటు ముందు నిరసన చేపట్టారు.
ఏం చేయాలో చేస్తాం:కరణ్ భూషణ్
వినేశ్ అనర్హతకు గురవడం బాధించిందని బ్రిజ్‌భూషణ్ కుమారుడు, ఎంపీ, యూపీ రెజ్లింగ్ అసోసియేషన్ చీఫ్ కరణ్ భూషణ్ పేర్కొన్నారు. ఈ అంశమ్మీద భారత రెజ్లింగ్ సమాఖ్య కచ్చితంగా అప్పీలు చేస్తుందని చెప్పారు. వినేశ్ విషయంలో అసలేం జరిగింది? ఇకముందు ఏం చేయాలన్నదానిపై తెలుసుకొని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
12 గంటల్లో చేయాల్సిందంతా చేశాం కానీ..
వినేశ్ బరువును నిర్దేశిత పరిమితిలోపు ఉంచేందుకు భారత బృందం అన్ని చర్యలు తీసుకుంది. కోచ్ అన్ని చర్యలు తీసుకున్నారు. వ్యాయామం చేయించాం. నీరు పరిమిత స్థాయిలో ఇచ్చాం. చెమటకోసం వ్యాయామాలు, ఆవిరి స్నానంలాంటి వన్నీ చేయించాం. చివరకు జట్టు కూడా కత్తిరించాం. అయినప్పటికీ బరువు తూచే సమయానికి 100 గ్రాములు అధికంగా ఉన్నట్టు వెల్లడైంది. ఇది దురదృష్టకరం. బరువు తగ్గించడానికి చాలా సమయం పడుతుంది. మా చేతిలో 12 గంటల సమయమే ఉంది. మరికొంత ఉండుంటే ఆ బరువును కూడా తగ్గించేవాళ్లం
- భారత ఒలింపిక్ సంఘం జారీ చేసిన ప్రకటనలో జట్టు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్షా పార్దీవాలా
ఆమె ఎప్పుడూ 53 కిలోల విభాగంలోనే..
వినేశ్ విషయంలో కుట్ర ఏమీ లేదు. అధిక బరువు ఉన్నట్లు తేలింది అంటే ఎక్కువ బరువు ఉన్నట్టే. ఇది సాంకేతికతకు సంబంధించిన అంశం. ఆమె ఎప్పుడూ 53 కిలోల విభాగంలో పోటీ పడేవారు. తాజాగా 50 కిలోల విభాగంలోకి మారింది. బరువు మారిన పరిస్థితుల్లో ఈ సమస్యకు ఎప్పుడూ అవకాశం ఉంటుంది. అధిక బరువు విషయంలో సడలింపు ఏమీ లేదు
- భారత అథ్లెటిక్ సమాఖ్య అధ్యక్షుడు ఆదిల్ సుమరీవాలా