Share News

దేశంలో స్టార్టప్‌ విప్లవం

ABN , Publish Date - Mar 21 , 2024 | 06:13 AM

కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చాక దేశంలో స్టార్ట్‌పల సంఖ్య గణనీయంగా పెరిగిందని.. 2014లో వందలోపు ఉన్న స్టార్ట్‌పలు ప్రస్తుతం 1.25 లక్షలకు చేరుకున్నాయని, వాటితో దాదాపు 12 లక్షల మంది యువత ప్రత్యక్షంగా

దేశంలో స్టార్టప్‌ విప్లవం

2014లో వందలోపే.. ప్రస్తుతం 1.25 లక్షల స్టార్ట్‌పలు.. మళ్లీ వచ్చేది మేమే

కొందరిని పదేపదే లాంచ్‌ చేయాల్సి వస్తోంది

‘స్టార్టప్‌ మహాకుంభ్‌’లో రాహుల్‌ను ఉద్దేశిస్తూ మోదీ

న్యూఢిల్లీ, మార్చి 20: కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చాక దేశంలో స్టార్ట్‌పల సంఖ్య గణనీయంగా పెరిగిందని.. 2014లో వందలోపు ఉన్న స్టార్ట్‌పలు ప్రస్తుతం 1.25 లక్షలకు చేరుకున్నాయని, వాటితో దాదాపు 12 లక్షల మంది యువత ప్రత్యక్షంగా అనుబంధాన్ని కలిగి ఉన్నారని ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచంలోనే భారత్‌ మూడో అతిపెద్ద స్టార్ట్‌పల దేశమని, మన వద్ద వందకుపైగా యూనికార్న్‌లున్నాయని వెల్లడించారు. భారతీయ స్టార్ట్‌పలు 12 వేలకుపైగా పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకున్నాయని, ఈ సంఖ్య మరింత పెరగాలని మోదీ సూచించారు. వేగంగా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో మూడు రోజులుగా జరుగుతున్న ‘స్టార్టప్‌ మహాకుంభ్‌’ను మోదీ బుధవారం సందర్శించి ప్రసంగించారు.ఐటీ రంగంలో ఒక స్టార్టప్‌ విజయం సాధించకపోతే మరో స్టార్ట్‌పను తీసుకొస్తారని.. కానీ, రాజకీయాల్లో మాత్రం కొందరిని పదేపదే ప్రయోగించాల్సి వస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీని ఉద్దేశించి ప్రధానిమోదీ చెణుకులు విసిరారు. ‘స్టార్ట్‌పలను లాంచ్‌ చేసే వారి సంఖ్య ఎక్కువే. రాజకీయాల్లో ఇటువంటి వారి సంఖ్య మరింత ఎక్కువ. స్టార్ట్‌పల రంగం ప్రయోగాత్మకంగా ఉంటుంది. ఒకటి విఫలమైతే మరో కొత్తదాని కోసం పరిశోధిస్తారు. కానీ, రాజకీయాల్లో అలా లేదు. కొందరిని పదే పదే లాంచ్‌ చేయాల్సి వస్తోంది’ అంటూ రాహుల్‌ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఎన్నికల తర్వాత వరుసగా మూడోసారి ప్రభుత్వంలోకి వచ్చి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతామని మోదీ ధీమా వ్యక్తం చేశారు. సాధారణంగా ఎన్నికలు ముగిసిన తర్వాతే వ్యాపార, వాణిజ్య సంస్థలు భారీ కార్యక్రమాలు పెట్టుకుంటాయని, కానీ, పెద్ద ఎత్తున జరుగుతున్న స్టార్టప్‌ మహాకుంభ్‌ కార్యక్రమం మళ్లీ తమ ప్రభుత్వమే వస్తుందనటానికి ఓ సంకేతమన్నారు.

ఆలోచనా ధోరణి మారింది

ఒకప్పుడు విద్య అంటే ఉద్యోగం కోసమేనని, ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే జీవితంలో స్థిరపడ్డామనే అభిప్రాయాలు ఉండేవని.. ఇప్పుడు ఆ ఆలోచనా ధోరణి మారిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారతీయ యువత ఉద్యోగాలు అడగటం లేదని, ఉద్యోగాలను సృష్టిస్తోందన్నారు. ఇదంతా దేశాన్ని ఊపేస్తోన్న స్టార్టప్‌ విప్లవం వల్లే సాధ్యమైందని చెప్పారు. గతంలో ఏదైనా కొత్త ఆలోచనతో ఉన్న వారికి దానిని ఆచరణలో పెట్టాలంటే నిధులు ఎవరు సమకూరుస్తారన్న బెంగ ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలిపారు. యువత తమ సామర్థ్యాన్ని చాటుకుంటోందని ప్రశంసించారు. అంతరిక్షం వంటి పలు రంగాల్లో భారతీయ స్టార్ట్‌పలు గొప్ప ఫలితాలను సాధిస్తున్నాయన్నారు.

బాండ్ల వివరాలు బయటకొస్తే.. రాహుల్‌ మొహం చూపించలేరు!

ఎలక్టోరల్‌ బాండ్ల పూర్తి సమాచారం వెల్లడైనప్పుడు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ప్రతిపక్ష ఇండియా కూటమి మొహం చూపించలేరని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. ఈ బాండ్ల ద్వారా రూ.6,200 కోట్లు ఎందుకు తీసుకున్నారో రాహుల్‌ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘న్యూస్‌ 18’ నిర్వహించిన సదస్సులో అమిత్‌ షా మాట్లాడారు. రాహుల్‌ గాంధీ నాయకత్వంలోని ఇండియా కూటమి గతంలో మాదిరిగానే ‘కట్‌ మనీ’ (కమీషన్లు) దండుకోవాలనుకుంటోందని, అందుకే ఎలక్టోరల్‌ బాండ్లను వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. ఈ బాండ్ల పూర్తి వివరాలు బయటపెట్టాలన్న సుప్రీం కోర్టు తీర్పు వల్ల రాజకీయ పార్టీలకు విరాళాల్లో మళ్లీ నల్లధనం ప్రవేశించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బాండ్ల వల్ల నల్లధనం అంతమయ్యే దశకు వచ్చిందన్నారు. ‘‘గతంలో రాజకీయ విరాళాలు నగదు రూపంలో వచ్చేవి. ఎవరైనా రూ.1500 విరాళం ఇస్తే, రూ.100 మాత్రమే పార్టీ ఖజానాకు వెళ్లేవి. మిగతా రూ.1400 సొంత జేబుల్లోకి వెళ్లేవి. దాన్ని స్విస్‌ బ్యాంకుకు తరలించేవారు’’ అని అమిత్‌ షా అన్నారు.

Updated Date - Mar 21 , 2024 | 06:13 AM