Chhattisgarh government : సన్నీ లియోనికి నెలకు రూ.1000 ప్రభుత్వ సాయం!
ABN , Publish Date - Dec 24 , 2024 | 06:11 AM
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఓ సంక్షేమ పథకంలో సినీ నటి సన్నీ లియోని పేరు ఉండటం చర్చనీయాంశమైంది. ఆర్థికంగా వెనుకబడిన వివాహిత మహిళల కోసం మహతారీ వందన్ యోజన పేరుతో
ఛత్తీస్‌గఢ్‌లో నకిలీ బ్యాంకు ఖాతాతో డబ్బులు కాజేసిన ప్రబుద్ధుడు
రాయ్‌పుర్, డిసెంబరు 23: ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఓ సంక్షేమ పథకంలో సినీ నటి సన్నీ లియోని పేరు ఉండటం చర్చనీయాంశమైంది. ఆర్థికంగా వెనుకబడిన వివాహిత మహిళల కోసం మహతారీ వందన్ యోజన పేరుతో ఓ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. అర్హులైన లబ్ధిదారులకు ప్రతినెలా రూ.1000లను వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. ఇటీవల సాధారణ తనిఖీల్లో భాగంగా లబ్ధిదారుల జాబితాను పరిశీలిస్తుండగా సన్నీ లియెని పేరు ఉండడం, ఆ బ్యాంకు ఖాతాకు ప్రతినెలా వెయ్యి జమవుతున్నట్లు అధికారులు గమనించారు. బస్తర్ జిల్లా తాలార్ గ్రామానికి చెందిన వీరేంద్ర జోషి అనే ప్రబుద్ధుడు సన్నీ లియోని పేరుతో నకిలీ ఖాతా తెరిచి... ప్రతి నెలా రూ.1000 కాజేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై బస్తర్ జిల్లా కలెక్టర్ హరీశ్ దర్యాప్తుకు ఆదేశించారు. వీరేంద్ర జోషిపై కేసు నమోదు చేసినట్లు, లబ్ధిదారుల వెరిఫికేషన్‌కు బాధ్యులైన అధికారినీ విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఛత్తీస్‌గఢ్ బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు దీపక్ బైజ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ పథకంలో అనేక అవకతవకలు జరిగాయని, సగం మంది అనర్హులే ఉన్నారని ఆరోపించారు.