అవమానకరంగా ఉన్న కులాల పేర్లు మార్చాలి
ABN , Publish Date - Nov 20 , 2024 | 04:31 AM
అవమానం కలిగించే విధంగా ఉన్న కులాల పేర్లను మార్చాలన్న వినతిపై సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సుప్రీంకోర్టులో పిటిషన్..కేంద్రానికి కోర్టు నోటీసులు
న్యూఢిల్లీ, నవంబరు 19: అవమానం కలిగించే విధంగా ఉన్న కులాల పేర్లను మార్చాలన్న వినతిపై సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కించపరిచే విధంగా ఉన్న కులాల పేర్లను ధ్రువీకరణ పత్రాల్లో పేర్కొనకూడదని, ఆ పదాలను ఉపయోగించడాన్ని కూడా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నేరంగా పరిగణించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. అఖిల భారతీయ గిహారా సమాజ్ పరిషద్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎస్సీ ఉప కులాలైన చురా, చమార్, భందీ, కంజార్ వంటి పేర్లు కించపరిచేవిగా ఉన్నాయని, వాటిని తొలగించాలని పిటిషన్‌లో కోరారు. అవమానపరచాలన్న ఉద్దేశంతో కులం పేరును ప్రస్తావించినా అది నేరం కిందే వస్తుందని ఒకవైపు చట్టాల్లో చెబుతుండగా, మరో అదే కులం పేరుతో ఽఽప్రభుత్వమే ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం ఏమిటని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశ్నించారు.