Share News

Supreme Court: వాటిని అనుసరించలేం.. సరోగసీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Feb 06 , 2024 | 10:07 PM

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం నాడు సరోగసీపై కీలక వ్యాఖ్యలు చేసింది. మన భారతదేశంలో వివాహ వ్యవస్థను సంరక్షించాలని పేర్కొంటూ.. పాశ్చాత్య దేశాల నమూనాని అనుసరించలేమని తేల్చి చెప్పింది. వివాహం చేసుకోకుండా పిల్లల్ని కనాలన్న సంస్కృతిని ఏమాత్రం ప్రోత్సాహించకూడదని పేర్కొంది.

Supreme Court: వాటిని అనుసరించలేం.. సరోగసీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం నాడు సరోగసీపై కీలక వ్యాఖ్యలు చేసింది. మన భారతదేశంలో వివాహ వ్యవస్థను సంరక్షించాలని పేర్కొంటూ.. పాశ్చాత్య దేశాల నమూనాని అనుసరించలేమని తేల్చి చెప్పింది. వివాహం చేసుకోకుండా పిల్లల్ని కనాలన్న సంస్కృతిని ఏమాత్రం ప్రోత్సాహించకూడదని పేర్కొంది. సరోగసీ ద్వారా తల్లి కావాలన్న 44 ఏళ్ల అవివాహిత మహిళ అభ్యర్థనను తిరస్కరిస్తూ.. జస్టిస్ బీవీ నగర్తన, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది.

సరోగసీ రెగ్యులేషన్ చట్టం ప్రకారం.. వితంతువులు లేదా విడాకులు తీసుకున్న మహిళలు మాత్రమే సరోగసీ మార్గాన్ని పొందవచ్చు. అది కూడా వారి వయసు 35 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. అంతే తప్ప.. పెళ్లికాని ఒంటరి మహిళలు సరోగసీ ద్వారా తల్లి కావడానికి వీలు లేదు. అయితే.. ఓ మల్టీనేషనల్ కంపెనీలో పని చేస్తున్న ఓ అవివాహిత మహిళ (44).. సరోగసీ (నియంత్రణ) చట్టంలోని సెక్షన్ 2 చెల్లుబాటును సవాలు చేస్తూ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తాను సరోగసీ విధానం ద్వారా తల్లి కావాలని కోరుకుంటున్నానని ఆ పిటిషన్‌లో ఆమె పేర్కొంది. అయితే.. ఈ పిటిషన్‌ని సుప్రీంకోర్టు తిరస్కరించింది.


‘‘వివాహ వ్యవస్థలో తల్లిగా మారడం మన భారత్‌లో ఆచారం. ఆ వ్యవస్థకు వెలుపల (పెళ్లి చేసుకోకుండా) తల్లిగా ఉండటం ఆచారం కాదు. మేము దీనిపై ఆందోళన చెందుతున్నాం. పిల్లల సంక్షేమం కోణం నుంచి ఇలా మాట్లాడుతున్నాం. మన దేశంలో వివాహ వ్యవస్థ మనుగడలో ఉండాలా? వద్దా? అంటే.. మనం పాశ్చాత్య దేశాల తరహాలో జీవన విధానం కొనసాగించడం లేదు. మనం వివాహ వ్యవస్థను రక్షించాలి. ఒకవేళ మీరు మమ్మల్ని సంప్రదాయవాదులు అని పిలిస్తే.. దాన్ని అంగీకరిస్తాం’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. అంతేకాదు.. 44 ఏళ్ల వయసులో అద్దె బిడ్డను పెంచడం కూడా కష్టతరం అవుతుందని ధర్మాసనం సూచించింది.

‘‘44 ఏళ్ల వయస్సులో అద్దె బిడ్డను చూసుకోవడం, పెంచడం చాలా కష్టం. మీరు జీవితంలో ప్రతిదీ కలిగి ఉండలేరు. ఇక్కడ క్లయింట్ ఒంటరిగా ఉండటానికి ఇష్డపడుతున్నారు. మేము సమాజం, వివాహ సంస్థ గురించి ఆందోళన చెందుతున్నాం’’ అని బెంచ్ పేర్కొంది. చాలా మంది పిల్లలకు తమ తల్లితండ్రుల గురించి కూడా తెలియని పాశ్చాత్య దేశాల మాదిరిగా మనం లేమని.. పిల్లలు తమ పేరెంట్స్ గురించి తెలియకుండా ఇక్కడ తిరగడం మాకు ఇష్టం లేదని ధర్మాసనం తెలిపింది. సైన్స్ బాగా అభివృద్ధి చెందింది, కానీ సామాజిక నిబంధనలు కాదని.. ఒక రకంగా అందుకు మంచి కారణాల వల్లేనని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది.

Updated Date - Feb 06 , 2024 | 10:21 PM