Kolkata Doctor Case: కోల్‌కతా వైద్యురాలి కేసులో సీబీఐకి సుప్రీంకోర్ట్ కీలక ఆదేశాలు
ABN , Publish Date - Sep 09 , 2024 | 11:51 AM
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ-హాస్పిటల్ ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం కేసులో ఇవాళ (సోమవారం) సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును వచ్చేవారం సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
న్యూఢిల్లీ: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ-హాస్పిటల్ ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం కేసులో ఇవాళ (సోమవారం) సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును వచ్చేవారం సమర్పించాలని కోర్టు ఆదేశించింది. నివేదిక సమర్పించేందుకు వారం సమయం ఇస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసు విచారణను వచ్చే మంగళవారానికి కోర్టు వాయిదా వేసింది. అత్యాచార ఘటన జరిగిన సమయం, వివరాలతో పాటు సీసీటీవీ ఫుటేజ్ సీబీఐకి ఇచ్చారా లేదా అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశ్చింది.
సీబీఐ ఫోరెన్సిక్ నివేదికను అందజేసిన తర్వాత కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ‘‘శాంపిల్స్ ఎవరు సేకరించారు’’ అనేది ఈ కేసులో ముఖ్యమైన ప్రశ్న అని, అందుకే ఎవరు సేకరించారనే విషయం నిర్ధారణ అయిన తర్వాత వచ్చే మంగళవారం తాజా రిపోర్ట్ దాఖలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం కోరింది.
శరీరంపై గాయాలు ఉన్నాయి
ఘటన తర్వాత బాధితురాలి శరీరంపై గాయాలు ఉన్నాయని సుప్రీంకోర్టుకు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పరీక్ష జరిపిన ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఎయిమ్స్‌కి పంపి పరిశీలించాలని సీబీఐ నిర్ణయించిందని చెప్పారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజిని తాము పరిశీలిస్తున్నామని ఈ సందర్భంగా సీబీఐ పేర్కొంది. మరోవైపు సీఐఎస్ఎఫ్ సిబ్బందికి బెంగాల్ ప్రభుత్వం సహకరించడం లేదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆర్జీ కర్ ఆసుపత్రి వద్ద మూడు మహిళా సీఐఎస్ఎఫ్ కంపెనీలు ఉంటే ఒక కంపెనీకి మాత్రమే వసతులు కల్పించారని ప్రస్తావించింది. కాగా వసతులు కల్పించామని బెంగాల్ ప్రభుత్వం చెప్పింది. మూడు వారాల తర్వాత సీఐఎస్ఎఫ్‌కి సదుపాయాలు కల్పించారని కేంద్రం పేర్కొంది. మరోవైపు బెంగాల్‌లో వైద్యుల భద్రతకు తీసుకున్న చర్యలపై బెంగాల్ ప్రభుత్వం స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేసింది.
ఉదయం 9.30 గంటలకు గుర్తింపు..
తమ వద్ద ఉన్న ఫోరెన్సిక్ నిర్ధారణ రిపోర్ట్ ఉందని, దీని ప్రకారం 9:30 గంటలకు వైద్యురాలి మృతదేహం వెలుగులోకి వచ్చిందని కోర్టుకు తుషార్ మెహతా వెల్లడించారు. వైద్యురాలి జీన్స్, లో దుస్తులు తొలగించి ఉన్నాయని, అవి సమీపంలో ఉన్నాయని, వైద్యురాలు అర్ధనగ్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇక శరీరంపై గాయం గుర్తులు కూడా ఉన్నాయని తుషార్ మెహతా పేర్కొన్నారు.