ప్రెస్‌వూ చత్వారం చుక్కల మందుకు అనుమతి నిలిపివేత
ABN , Publish Date - Sep 12 , 2024 | 05:18 AM
‘చత్వారానికి దివ్యౌషధమ’ని ఎన్‌టాడ్ కంపెనీ ప్రచారం చేసుకున్న ‘ప్రెస్‌వూ’ చుక్కల మందుకు ఇచ్చిన అనుమతిని ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) తాత్కాలికంగా రద్దు చేసింది. 40-55 ఏళ్ల వయస్కుల్లో కొద్దిపాటి నుంచి ఓ మోస్తరు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 11: ‘చత్వారానికి దివ్యౌషధమ’ని ఎన్‌టాడ్ కంపెనీ ప్రచారం చేసుకున్న ‘ప్రెస్‌వూ’ చుక్కల మందుకు ఇచ్చిన అనుమతిని ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) తాత్కాలికంగా రద్దు చేసింది. 40-55 ఏళ్ల వయస్కుల్లో కొద్దిపాటి నుంచి ఓ మోస్తరు చత్వారం(ప్రెస్బియోపియా)తో బాధపడుతున్నవారు ఈ మందును కంట్లో ఒక్క చుక్క వేసుకుంటే 15 నిమిషాల్లో పనిచేయడం ప్రారంభిస్తుందని ముంబైకి చెందిన ఆ ఫార్మా సంస్థ ప్రకటించింది. చత్వారంతో బాధపడుతున్నవారికి కళ్లజోడు అవసరాన్ని తగ్గిస్తుందని చెప్పుకుంది. ఇలాంటి మందు దేశంలో ఇంతవరకు లేదని, ఇదే మొదటిదని కూడా ప్రకటించింది. ఈ ప్రచారాన్ని తీవ్రంగా పరిగణించిన డీసీజీఐ.. ‘ప్రెస్‌వూ’ చుక్కల మందు తయారీ, అమ్మకాలకు గత నెల 20న ఇచ్చిన అనుమతిని సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది. చత్వారానికి చికిత్సలో ఉపయోగించేందుకు ఈ మందుకు అనుమతి ఇచ్చామే కానీ 15 నిమిషాల్లోనే పనిచేస్తుందని, కళ్లజోడు అవసరాన్ని తగ్గిస్తుందని కాదని స్పష్టం చేసింది. ఆ కంపెనీ ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.