Tamilnadu: తమిళనాడులో ఉచిత బస్సు ప్రయాణం.. స్టడీలో తేలిన ఆసక్తికర విషయాలు
ABN , Publish Date - Feb 21 , 2024 | 03:11 PM
చెన్నైకి చెందిన సిటిజన్ కన్స్యూమర్ అండ్ సివిక్ యాక్షన్ గ్రూప్ (CAG) ఈ పథకం ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు ‘టువర్డ్స్ జెండర్ ఇన్‌క్లూసివ్ ట్రాన్స్‌పోర్ట్’ పేరుతో ఒక అధ్యయనం నిర్వహించింది. ఈ స్టడీలో భాగంగా.. తమిళనాడులోని చెన్నై (Chennai), కోయంబత్తూర్, సేలం, తిరునెల్వేలి, తిరువణ్ణామలై, తిరువారూరు వంటి నగరాల్లో మొత్తం 3వేల మంది మహిళల్ని CAG ఇంటర్వ్యూ చేసింది.
ఈమధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ప్రత్యేకంగా ఉచిత బస్సు ప్రయాణ పథకాలను (Fare-Free Bus Scheme) ప్రవేశపెడుతున్న విషయం అందరూ చూస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ (Congress) ఎన్నికల అస్త్రాల్లో ఈ పథకం కీలక పాత్ర పోషించింది. అటు కర్ణాటకలో (Karnataka), ఇటు తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ పథకం దోహదపడిందని చెప్పుకోవచ్చు. అయితే.. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల కన్నా ముందే తమిళనాడులో (Tamil Nadu) ఈ స్కీమ్‌ని తీసుకొచ్చారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించి దాదాపు మూడు సంవత్సరాలు కావొస్తోంది.
ఈ నేపథ్యంలోనే.. చెన్నైకి చెందిన సిటిజన్ కన్స్యూమర్ అండ్ సివిక్ యాక్షన్ గ్రూప్ (CAG) ఈ పథకం ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు ‘టువర్డ్స్ జెండర్ ఇన్‌క్లూసివ్ ట్రాన్స్‌పోర్ట్’ పేరుతో ఒక అధ్యయనం నిర్వహించింది. ఈ స్టడీలో భాగంగా.. తమిళనాడులోని చెన్నై (Chennai), కోయంబత్తూర్, సేలం, తిరునెల్వేలి, తిరువణ్ణామలై, తిరువారూరు వంటి నగరాల్లో మొత్తం 3వేల మంది మహిళల్ని CAG ఇంటర్వ్యూ చేసింది. ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టినప్పటి నుండి ఈ ఆరు నగరాల్లో.. బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఈ అధ్యయనం పేర్కొంది. ఫలితంగా.. ఇతర రవాణా మార్గాలైన పారాట్రాన్సిట్, ప్రైవేట్ వాహనాల వినియోగం తగ్గిందని తెలిపింది.
ఈ పథకం వల్ల.. సగటున మహిళలు నెలకు సుమారు రూ.800 ఆదా చేస్తున్నారని CAG అధ్యయనం వెల్లడించింది. ఇలా ఆదా అవుతున్న డబ్బులు.. కుటుంబ అవసరాలు, విద్య, ఆరోగ్య సంరక్షణకు వెళ్తోందని.. ఇది కుటుంబంతో పాటు సమాజానికి మెరుగైన ఫలితాలను అందిస్తోందని పేర్కొంది. ఈ అధ్యయాన్ని MTC మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆల్బీ జాన్ వర్గీస్ స్వాగతిస్తూ.. ఈ పథకం మహిళలకు ఎంతో ఉపయోగపడుతోందని, ఎందుకంటే వారిలో చాలా మందికి వ్యక్తిగత వాహనాలు లేవని తెలిపారు. మరిన్ని బస్సుల ఆవశ్యకతను తాము గుర్తించామని.. ప్రస్తుతం చెన్నై, రాష్ట్రంలోని ఇతర నగరాలకు వాటిని సేకరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.