Share News

Hero Vijay new party : తమిళగ వెట్రి కళగం

ABN , Publish Date - Feb 03 , 2024 | 04:39 AM

తమిళనాట సినీరంగ నేపథ్యమున్న మరో రాజకీయ పార్టీకి బీజం పడింది. ఎంతోకాలంగా అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న ప్రముఖ యువ హీరో విజయ్‌..

Hero Vijay new party : తమిళగ వెట్రి కళగం

హీరో విజయ్‌ కొత్త పార్టీ.. రాజకీయాల్లోకి రాక

పార్లమెంటు ఎన్నికలకు దూరం.. అసెంబ్లీ లక్ష్యం

2026లో అధికారం తమదేనని ధీమా

చెన్నై, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): తమిళనాట సినీరంగ నేపథ్యమున్న మరో రాజకీయ పార్టీకి బీజం పడింది. ఎంతోకాలంగా అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న ప్రముఖ యువ హీరో విజయ్‌.. రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. తమిళగ వెట్రి కళగం(తమిళనాడు విజయం పార్టీ) పేరుతో పార్టీ ప్రారంభిస్తున్నానని తెలిపారు. అయితే, తన పార్టీ 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనే తలపడుతుందని, ఆ ఎన్నికలే తమ లక్ష్యమని పేర్కొన్నారు. త్వరలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికలకు దూరంగా ఉంటామని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. తన అభిమానుల సంఘాలు ‘విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’(విజయ్‌ ప్రజా సంస్థ) పేరుతో కొన్నేళ్లుగా పలు సామాజిక సేవా కార్యక్రమాలను స్వచ్ఛందంగా చేపడుతున్నారని తెలిపారు. అయితే, సామాజిక, ఆర్థికపరమైన రాజకీయ సంస్కరణలు తెచ్చేందుకు స్వచ్ఛంద సంస్థకు సాధ్యం కాదన్నారు. అందుకే తమిళగ వెట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘంలో పార్టీ పేరు నమోదు చేయించనున్నట్టు తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోమని, ఏ కూటమికీ మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పారు. 2026లో జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ తప్పకుండా పోటీ చేసి అధికారంలోకి వస్తుందని విజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. ‘‘పారదర్శకమైన జాతి, మత భేదాలకు తావులేని, అవినీతి రహిత సమాజ స్థాపన కోసం, రాజకీయ మార్పు కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఆ లోటును తీర్చేందుకే రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్నాం’’ అని విజయ్‌ పేర్కొన్నారు. విజయ్‌ రాజకీయాల్లోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు సంబరాలు జరుపుకొన్నారు.

Updated Date - Feb 03 , 2024 | 05:41 AM