Share News

Chandrababu : మళ్లీ చక్రం తిప్పనున్న బాబు!

ABN , Publish Date - Jun 06 , 2024 | 05:40 AM

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ కూటమిని ఘన విజయ పథంలో నడిపిన టీడీపీ అధినేత చంద్రబాబు పేరు ఇప్పుడు మరోసారి జాతీయ యవనికపై మార్మోగుతోంది. గతంలో 1996లో యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌గా కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటు, ప్రధానమంత్రులుగా హెచ్‌డీ దేవెగౌడ, ఐకే

Chandrababu : మళ్లీ చక్రం తిప్పనున్న బాబు!

ఎన్డీయేలో ఇంకోసారి ముఖ్య భూమిక.. జాతీయ మీడియా విశ్లేషణలు

న్యూఢిల్లీ, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ కూటమిని ఘన విజయ పథంలో నడిపిన టీడీపీ అధినేత చంద్రబాబు పేరు ఇప్పుడు మరోసారి జాతీయ యవనికపై మార్మోగుతోంది. గతంలో 1996లో యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌గా కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటు, ప్రధానమంత్రులుగా హెచ్‌డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌ నియామకాల్లో కీలక భూమిక పోషించిన ఆయన.. వాజపేయి హయాంలోనూ ఎన్డీయే కన్వీనర్‌గా చక్రం తిప్పిన వైనాన్ని జాతీయ మీడియా విశేషంగా ప్రస్తావిస్తోంది. 2014లోనూ ఎన్డీయేలో ఉన్నా.. ప్రత్యేక హోదాపై విభేదించి బయటకు వెళ్లిపోయిన వైనాన్ని గుర్తుచేస్తోంది. తిరిగి మొన్న ఎన్నికల ముంగిట రాష్ట్రంలో జనసేనతో కలిసి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం.. 25 లోక్‌సభ స్థానాలకు గాను 21 చోట్ల కూటమి విజయం సాధించడం.. ఒడిసా తప్ప మిగతా దేశంలో బీజేపీ మెజారిటీ దారుణంగా పడిపోవడం.. 303 స్థానాల నుంచి 240 స్థానాలకు తగ్గిపోవడం.. సొంతంగా టీడీపీ 16 స్థానాలు సాధించిన నేపథ్యంలో చంద్రబాబు మద్దతు కీలకం కావడంతో బీజేపీ అగ్ర నేతలు ఆయనకు అధిక ప్రాధాన్యమివ్వక తప్పదని జాతీయ మీడియా అంటోంది. బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో జరిగిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని.. కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వ ఏర్పాటు, దాని సుస్థిరతకు ఆయన కీలకమని చెబుతోంది. సంకీర్ణ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన.. ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తారనే అంశంపై రాజకీయ విశ్లేషకులు జాతీయ చానళ్లలో పలురకాలు విశ్లేషణలు చేస్తున్నారు. ఎన్‌డీటీవీ, సీఎన్‌ఎన్‌-న్యూ్‌స 18, రిపబ్లిక్‌ వంటి జాతీయ మీడియా సంస్థలు ఆయనపై బుధవారం ప్రత్యేక బులిటెన్లు ప్రసారం చేయడం విశేషం. కొత్త ప్రభుత్వంలో టీడీపీకి లోక్‌సభ స్పీకర్‌ పదవితో పాటు ఐదు మంత్రిపదవులు ఇవ్వాలని చంద్రబాబు కోరినట్లు ఎన్‌డీటీవీ పేర్కొంది. ప్రతి ముగ్గురు ఎంపీల్లో ఒకరికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని అడిగినట్లు తెలిపింది. ఎన్డీయేలో బీజేపీ తర్వాత 16 సీట్లతో అతిపెద్ద పార్టీ టీడీపీయే కావడంతో బీజేపీ పెద్దలు కూడా జాతీయ స్థాయిలో చంద్రబాబుకు సముచిత ప్రాధాన్యం కల్పించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Updated Date - Jun 06 , 2024 | 05:40 AM