Bangalore: ‘డర్టీ’ పిక్చర్ గుట్టు రట్టయింది.. ప్రజ్వల్ డ్రైవర్ వల్లే!
ABN , Publish Date - May 01 , 2024 | 05:05 AM
‘‘నీకన్నా వయసులో పెద్దదాన్ని.. నన్నేం చేయకు. మీ నాన్నకు, తాతకు నాచేత్తో అన్నం వడ్డించాను. అమ్మలాంటిదాన్ని..
15 ఏళ్లు డ్రైవర్‌గా పనిచేసిన కార్తీక్ తన భూమిని రేవణ్ణ లాక్కోవడంతో
ఉద్యోగం మానేశానని వెల్లడి దేవరాజెకు వీడియోలు ఇచ్చింది అతడే
కాంగ్రెస్‌కు ఇచ్చిందీ కార్తీకేనన్న దేవరాజె ప్రజ్వల్‌పై సస్పెన్షన్ వేటు వేసిన జేడీఎస్
తప్పు చేసినవారికి శిక్ష తప్పదు: షా సమగ్ర నివేదిక ఇవ్వాలని కర్ణాటక
డీజీపీకి మహిళా కమిషన్ ఆదేశాలు 24 గంటల్లో విచారణకు రావాలంటూ రేవణ్ణ, ప్రజ్వల్‌కు సిట్ నోటీసు
బెంగళూరు/బళ్లారి, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): ‘‘నీకన్నా వయసులో పెద్దదాన్ని.. నన్నేం చేయకు. మీ నాన్నకు, తాతకు నాచేత్తో అన్నం వడ్డించాను. అమ్మలాంటిదాన్ని.. వీడియోలు తీయకు’’ అని వేడుకుంటున్నా వినకుండా.. భయంతో ముడుచుకుపోయి కూర్చున్న ఓ వయసు పైబడిన మహిళను ప్రజ్వల్ ఈడ్చుకెళ్లి, లైంగిక దాడికి పాల్పడ్డమే కాక, వీడియో తీశాడంటూ మంగళవారం ‘ఎక్స్’లో పలువురు చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ.. కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్న ఈ‘డర్టీ పిక్చర్’ గుట్టు ఎలా రట్టు అయింది? ప్రజ్వల్ తన ఫోన్‌లో తీసుకున్న వీడియోలు ఎలా బయటపడ్డాయి? అనే ప్రశ్నలకు సమాధానం దొరికింది.
ప్రజ్వల్ కుటుంబానికి పదిహేనేళ్లపాటు డ్రైవర్‌గా ఉన్న కార్తీక్ ద్వారా ఈ వీడియోలు బీజేపీ నేత దేవరాజెగౌడ వద్దకు చేరాయి. ఈ విషయాన్ని ఇద్దరూ ఒప్పుకొంటున్నారు. కానీ.. ఆ తర్వాత ఈ వీడియోలు కాంగ్రెస్ నేతకు, మీడియాకు, సోషల్ మీడియాకు ఎలా చేరాయనే విషయంలో మాత్రం ఇద్దరూ పరస్పరం నిందించుకుంటున్నారు. తాను దేవరాజెగౌడకు తప్ప ఎవరికీ ఈ వీడియోలు ఇవ్వలేదని కార్తీక్ చెబుతుంటే.. అతడే కాంగ్రెస్ నేతలకు ఇచ్చాడని దేవరాజెగౌడ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కార్తీక్ మంగళవారం ఒక వీడియో విడుదల చేశారు. ‘‘నేను ప్రజ్వల్ రేవణ్న కుటుంబం వద్ద పదిహేనేళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నా.
అయితే.. నాపేరిట ఉన్న కొద్దిపాటి భూమిని రేవణ్న కుటుంబం లాక్కుని.. నన్ను మానసికంగా, నా భార్యను శారీరకంగా వేధించారు. దీంతో ఏడాది క్రితమే వారివద్ద పని మానేశా. ఆ తర్వాత వారి మీద కేసు పెట్టడానికి ఎంతగానో ప్రయత్నించాను. ఆ సమయంలోనే నేను బీజేపీ నేత దేవరాజె గౌడను కలిశాను. నాకు సాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నా వద్ద ఉన్న వీడియోలు తీసుకున్నారు. ఆయనకు తప్ప నేను మరెవ్వరికీ ఆ వీడియోలు ఇవ్వలేదు. కాంగ్రెస్ నేతలకు ఎవరిచ్చారో నాకు తెలియదు.
ఈ విషయంలో ఆయన తనను తాను కాపాడుకోవడానికి నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు.’’ అని చెబుతూ సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా విడుదల చేశారు. దేవరాజెగౌడను నమ్మితే ఆయన తనను మోసం చేశారని వాపోతున్నారు. మరోవైపు దేవరాజెగౌడ్ ఏమో.. ఈ వీడియోలు బయటపడితే తమ కూటమికి దెబ్బ కాబట్టి, ఆ పని తానెందుకు చేస్తానని ప్రశ్నిస్తున్నారు. డ్రైవర్ కార్తీక్ నుంచి తీసుకుని కాంగ్రెస్ నేత శ్రేయస్ పటేల్ ఈ వీడియోలను బయటపెట్టారని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే.. దేవరాజెగౌడహసన్ లోక్‌సభ సీటును ఆశించారని.. ఆ సీటు తనకు రాకపోవడంతో ప్రజ్వల్‌ను దెబ్బతీయడానికి ఈ వీడియోలను బయటపెట్టారన్న వాదనా వినిపిస్తోంది.
ప్రజ్వల్‌పై వేటు పడింది..
ప్రజ్వల్ వ్యవహారం ఎన్నికల్లో తమను దెబ్బతీసే ప్రమాదం ఉండడంతో.. జేడీఎస్ పార్టీ ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ప్రజ్వల్‌ను సస్పెండ్ చేస్తూ పార్టీ కోర్ కమిటీ తీర్మానించింది. మరోవైపు.. జేడీఎ్‌సతో పొత్తు నేపథ్యంలో ప్రజ్వల్ రాసలీలల వ్యవహారంపై బీజేపీ వైఖరి స్పష్టం చేయాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ, పలువురు కర్ణాటక నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గువాహటిలో మాట్లాడుతూ ప్రజ్వల్ విషయమే కాదు, మహిళల గౌరవానికి భంగం కలిగించే అంశం ఏదైనా క్షమించేది లేదని తేల్చిచెప్పారు.
ప్రజ్వల్ తప్పుచేసి ఉంటే చట్ట ప్రకారం శిక్ష తప్పదని స్పష్టం చేశారు. కాగా, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాసలీలల వ్యవహారంపై విచారణను వేగవంతమైంది. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణతో పాటు ఆయన తండ్రి, ఎమ్మెల్యే రేవణ్ణకు సిట్ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లోగా నేరుగా సిట్ ముందుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. హాజరుకాని పక్షంలో తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నోటీసుల్లో స్పష్టం చేసినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, ప్రజ్వల్ రాసలీలలకు సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర డీజీపీని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది.