రక్త నమూనాలు తీసుకొచ్చిన డ్రోన్..!
ABN , Publish Date - Oct 30 , 2024 | 06:02 AM
వైద్యరంగంలో కూడా డ్రోన్ సేవల వినియోగం పెరిగింది. ఈ డ్రోన్ టెక్నాలజీని మరింత విస్తృతంగా వాడుకోవాలని కేంద్రం నిర్ణయించింది.
9 నిమిషాల్లో 12 కి.మీ. ఎగిరెళ్లి నలుగురి శాంపిల్స్ స్వీకరణ
మంగళగిరి ఎయిమ్స్‌లో డ్రోన్ సేవలు ప్రారంభం
ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ
మంగళగిరి, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): వైద్యరంగంలో కూడా డ్రోన్ సేవల వినియోగం పెరిగింది. ఈ డ్రోన్ టెక్నాలజీని మరింత విస్తృతంగా వాడుకోవాలని కేంద్రం నిర్ణయించింది. మంగళవారం ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి ప్రధాని మోదీ.. దేశవ్యాప్తంగా 11 ఎయిమ్స్ ఆస్పత్రుల్లో డ్రోన్ సేవలను ప్రారంభించారు. దీంతో మంగళగిరి ఎయిమ్స్‌లో కూడా డ్రోన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తొలిసారి ఇక్కడ మొదలైన డ్రోన్ సేవలను ఆస్పత్రి అధికారులు పరిశీలించారు. ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరంలోని నూతక్కి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ)లో చికిత్స పొందుతున్న గర్భిణీ వల్లంశెట్టి నాగదివ్యతో పాటు మరో ముగ్గురి నుంచి సేకరించిన రక్త నమూనాలను తెచ్చేందుకు డ్రోన్‌ను పంపించారు. ఇది 9 నిమిషాల్లోనే నూతక్కి చేరుకుని నమూనాలను రెండు నిమిషాల్లో స్వీకరించి.. తిరిగి 9 నిమిషాల్లో ఎయిమ్స్‌కి చేరుకుంది. ఈ సందర్భంగా ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మదుబానందకర్ మాట్లాడుతూ... ఆరోగ్యరంగంలో డ్రోన్ టెక్నాలజీని వినూత్నంగా ఉపయోగించే ఉద్దేశంతో ఈ సేవలు ప్రారంభించామని చెప్పారు.