యూఏఈలో నేడు అతిపెద్ద ఆలయ ఉద్ఘాటన
ABN , Publish Date - Feb 14 , 2024 | 04:25 AM
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో నిర్మించిన అతిపెద్ద హిందూ దేవాలయం ప్రారంభానికి సిద్ధమైంది. 27 ఎకరాల విస్తీర్ణంలో భారతీయత, శిల్పకళ ఉట్టిపడేలా నిర్మితమైన ఈ ఆలయ ఉద్ఘాటన బుధవారం జరగనుంది. ప్రధాని మోదీ విశిష్ట అతిథిగా పాల్గొని, దేవతావిగ్రహాలను ప్రతిష్ఠిస్తారు.
అబుధాబి చేరుకున్న ప్రధాని మోదీ
యూపీఐ-ఏఏఎన్‌ఐల సమన్వయం
అబుధాబి, ఫిబ్రవరి 13: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో నిర్మించిన అతిపెద్ద హిందూ దేవాలయం ప్రారంభానికి సిద్ధమైంది. 27 ఎకరాల విస్తీర్ణంలో భారతీయత, శిల్పకళ ఉట్టిపడేలా నిర్మితమైన ఈ ఆలయ ఉద్ఘాటన బుధవారం జరగనుంది. ప్రధాని మోదీ విశిష్ట అతిథిగా పాల్గొని, దేవతావిగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మంగళవారం అబుధాబి చేరుకున్నారు. అక్కడ యూఏఈ గార్డ్స్ గౌరవ వందనాన్ని మోదీ స్వీకరించారు. అనంతరం ఇరువురు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలు జరిగినట్లు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా.. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం, పెట్టుబడులు, వాణిజ్యంపై ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వివరించింది. యూపీఐ, యూఏఈ పేమెంట్ గేట్‌వే ఏఏఎన్‌ఐ మధ్య అనుసంధానానికి ఇరుదేశాలు అంగీకరించినట్లు పేర్కొంది. అదేవిధంగా భారత దేశీయ డెబిట్/క్రెడిట్‌కార్డుల సంస్థ రూపే, యూఏఈకి చెందిన జైవాన్‌ల అనుసంధానానికీ అంగీకారం కుదిరినట్లు వివరించింది. డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వారసత్వం-మ్యూజియాల విషయంలో ఇరుదేశాల మధ్య ఒప్పందాలు కుదిరినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్‌లో తన యూఏఈ పర్యటన విశేషాలను పంచుకున్నారు. ‘‘నా సోదరుడు మహమ్మద్-బిన్-జాయెద్ నుంచి సాదర స్వాగతం అందుకున్నాను. యూఏఈకి వస్తే.. సొంత ఇంటికి వచ్చాననే భావన నాలో కలుగుతుంది. యూఏఈ మద్దతు లేకుంటే.. స్వామినారాయణ్ ఆలయం నిర్మితమయ్యేది సాధ్యం కాని పని. ఈ సహకారం అందించిన జాయెద్‌కు ధన్యవాదాలు’’ అని ఆయన పేర్కొన్నారు. అనంతరం ‘అహ్లాన్ మోదీ’ పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రవాస భారతీయులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సుమారు 65 వేల మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మోదీ దక్షిణ భారత భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళాల్లో మాట్లాడటం విశేషం.
ఆలయం విశేషాలివే..!
యూఏఈలో 27 ఎకరాల సువిశాల స్థలంలో నిర్మించిన స్వామినారాయణ్ ఆలయంలో భారతీయ శిల్పకళాసౌందర్యం.. హిందూ ధర్మం ఉట్టిపడుతుంది. ఇది పశ్చిమాసియాలోనే అతిపెద్ద హిందూ ఆలయం. ఈ ఆలయం ఎత్తు 32.92 మీటర్లు, పొడవు 79.86 మీటర్లు, వెడల్పు 54.86 మీటర్లు. ఈ ఆలయానికి ఏడు గోపురాలున్నాయి. యూఏఈలోని ఏడు ఎమిరేట్స్‌కు ఈ గోపురాలు ప్రతీకగా బోచసన్వాసి శ్రీఅక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థ(బీఏపీఎస్) వివరించింది. ఈ ఆలయ నిర్మాణంలో రాజస్థాన్ నుంచి తెప్పించిన పాలరాతిని వినియోగించారు.