Share News

Priyanka Gandhi : వయనాడ్‌లో ప్రియాంకకు పట్టం

ABN , Publish Date - Nov 24 , 2024 | 04:32 AM

అన్న రాహుల్‌ గాంధీని వరుసగా రెండుసార్లు గెలిపించిన వయనాడ్‌ ప్రజలు.. ఇప్పుడు ఉప ఎన్నికలో చెల్లెలు ప్రియాంకా గాంధీకి భారీ విజయం

Priyanka Gandhi : వయనాడ్‌లో ప్రియాంకకు పట్టం

అన్న రాహుల్‌ గాంధీ రికార్డును దాటి 4.1 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం

న్యూఢిల్లీ, నవంబరు 23: అన్న రాహుల్‌ గాంధీని వరుసగా రెండుసార్లు గెలిపించిన వయనాడ్‌ ప్రజలు.. ఇప్పుడు ఉప ఎన్నికలో చెల్లెలు ప్రియాంకా గాంధీకి భారీ విజయం చేకూర్చారు. రాహుల్‌ రికార్డును దాటి 4.1 లక్షల ఓట్ల మెజారిటీతో ఆమెకు పట్టం కట్టారు. రెండు దశాబ్దాల క్రితం గాంధీ-నెహ్రూ కుటుంబం వారసురాలిగా రాజకీయాలకు పరిచయమైన ప్రియాంక.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. తల్లి సోనియాగాంధీ రాజ్యసభ సభ్యురాలు. రాహుల్‌ వయనాడ్‌, రాయ్‌బరేలీ నుంచి గెలిచి.. వయనాడ్‌ స్థానానికి రాజీనామా చేశారు. అక్కడ నుంచి ప్రియాంక గెలుపుతో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు ఎంపీలు ఎన్నికైనట్టు అయింది. ప్రేమాభిమానాలు కురిపించి.. తనకు విజయం అదించిన వయనాడ్‌ ప్రజలకు ప్రియాంక కృతజ్ఞతలు తెలిపారు. సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం 2004లో ప్రియాంక తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2019 జనవరిలో ఆమె ఉత్తరప్రదేశ్‌ తూర్పు విభాగానికి కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆ మరుసటి ఏడాది మొత్తం యూపీకి కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2022లో ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ప్రచార బాధ్యతలను తీసుకుని.. రాష్ట్రమంతటా పర్యటించి ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి చెందినా ప్రియాంక ప్రచారం మాత్రం మెప్పించింది. తర్వాత 2022 చివర్లో జరిగిన హిమాచల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కీలక పాత్ర పోషించి.. గెలుపునందించారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు సోనియా ప్రత్యక్ష ఎన్నికల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. దీంతో రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ‘స్టార్‌ క్యాంపెయినర్‌’గా విస్తృత ప్రచారం చేసేందుకే అప్పట్లో ఆమె పోటీకి దూరంగా ఉండిపోయారు.

Updated Date - Nov 24 , 2024 | 04:32 AM