Share News

25 నుంచి పార్లమెంటు

ABN , Publish Date - Nov 20 , 2024 | 04:36 AM

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 25న ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 20 వరకు జరుగనున్నాయి.

25 నుంచి పార్లమెంటు

డిసెంబరు 20 దాకా సమావేశాలు

‘ఒక దేశం-ఒకే ఎన్నిక’, వక్ఫ్‌ బిల్లులే కీలకం

న్యూఢిల్లీ, నవంబరు 19: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 25న ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 20 వరకు జరుగనున్నాయి. వక్ఫ్‌ సవరణ బిల్లు, ‘ఒక దేశం-ఒకే ఎన్నిక’ బిల్లులను ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. వీటిని కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండీ కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నెల 23న మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్‌డీఏ, ఇండీ కూటమి ప్రతిష్ఠాత్మకంగా తలపడుతున్నాయి. మహారాష్ట్రలో ఎన్‌డీఏ పక్షాల ఆధ్వర్యంలో మహాయుతి ప్రభుత్వం నడుస్తుండగా.. జార్ఖండ్‌లో జేఎంఎం, కాంగ్రెస్‌ ప్రధాన పక్షాలుగా ఇండీ కూటమి అధికారంలో ఉంది. జార్ఖండ్‌లో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ భావిస్తుండగా.. మహారాష్ట్రలో తమ గెలుపు ఖాయమని కాంగ్రెస్‌, ఎన్‌సీపీ, ఉద్ధవ్‌ శివసేన ధీమాతో ఉన్నాయి. ఎవరు గెలుస్తారో 23న తేలనున్న నేపథ్యంలో శీతాకాల సమావేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది. 24వ తేదీ ఆదివారం 11 గంటలకు పార్లమెంటు భవనంలో అఖిల పక్ష సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్‌ రిజిజు మంగళవారం ‘ఎక్స్‌’లో వెల్లడించారు. స్వతంత్ర భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా ఈ నెల 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. సంవిధాన్‌ సదన్‌లోని సెంట్రల్‌ హాలులో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 04:37 AM