Share News

ఆ ఆరోపణలు పూర్తిగా నిరాధారం

ABN , Publish Date - Nov 22 , 2024 | 06:57 AM

సౌర విద్యుత్తు కాంట్రాక్టులు దక్కించుకునేందుకు పెద్ద మొత్తంలో లంచం ఇవ్వజూపారంటూ తమ సంస్థపై అమెరికా ప్రాసిక్యూటర్లు చేసిన ఆరోపణలను అదానీ

ఆ ఆరోపణలు పూర్తిగా నిరాధారం

మేం చట్టాలకు లోబడి నడుచుకుంటాం

అభియోగాలపై అదానీ గ్రూపు ప్రకటన

న్యూఢిల్లీ, నవంబరు 21: సౌర విద్యుత్తు కాంట్రాక్టులు దక్కించుకునేందుకు పెద్ద మొత్తంలో లంచం ఇవ్వజూపారంటూ తమ సంస్థపై అమెరికా ప్రాసిక్యూటర్లు చేసిన ఆరోపణలను అదానీ గ్రూపు తోసిపుచ్చింది. సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులు దక్కించుకోవడంలో భాగంగా అదానీ గ్రూపు దాదాపు రూ.2,238 కోట్ల లంచాన్ని భారత అధికారులకు ఇవ్వజూపిందన్న ఆరోపణలతో పాటు దాని గురించి పెట్టుబడిదారులకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. సంస్థ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ సహా మరో ఏడుగురిపై కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై అదానీ గ్రూపు స్పందించింది. అమెరికా న్యాయ శాఖ, సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ కమిషన్‌ అదానీ గ్రీన్‌ డైరెక్టర్లపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని సంస్థ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో కొట్టిపారేశారు. తమ సంస్థ చట్టాలకు లోబడి నడుచుకుంటుందని స్పష్టం చేశారు. అవి కేవలం నేరారోపణలు మాత్రమేనని గుర్తుచేశారు. దోషులుగా రుజువయ్యే వరకు నిందితులను నిర్దోషులుగానే భావించాల్సి ఉంటుందని తెలిపారు. పాలనా వ్యవహారాల్లో, పారదర్శకత విషయంలో అదానీ గ్రూపు ఎప్పుడూ అత్యున్నత ప్రమాణాలను పాటిస్తుందన్నారు. తమ సంస్థ కార్యకలాపాలు నిర్వహించే ప్రతిచోటా వీటిని పాటిస్తూ వస్తున్నామని తెలిపారు. చట్టాలను గౌరవిస్తూ, వాటికి లోబడి నడుచుకుంటున్నందున.. వాటాదారులు, భాగస్వాములు, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై న్యాయపరంగా ముందుకెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. కాగా, అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ జారీ చేసిన 600 మిలియన్‌ డాలర్ల (రూ.5067 కోట్ల) బాండ్లను రద్దు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. అదానీ గ్రూపుపై అభియోగాలు రావడానికి కొద్ది గంటల ముందే ఈ బాండ్లు మూడు రెట్లు అధికంగా సబ్‌స్ర్కైబ్‌ కావడం గమనార్హం. సంస్థపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అనుబంధ కంపెనీలు ప్రతిపాదిత బాండ్లను ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు అదానీ గ్రీన్‌ ఎనర్జీ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఫైలింగ్‌లో తెలిపింది.

Updated Date - Nov 22 , 2024 | 06:57 AM