Prime Minister Modi : సందేశ్‌ఖాలీతో టీఎంసీ ఖాళీ!
ABN , Publish Date - Mar 07 , 2024 | 05:30 AM
నారీశక్తితో బెంగాల్లోని మమతా బెనర్జీ సారథ్యంలోని పాలక టీఎంసీ పతనం ఖాయమని ప్రధాని మోదీ అన్నారు. నదీతీర ద్వీపం సందేశ్‌ఖాలీలో ఆ పార్టీ నేతల అఘాయిత్యాలు రాష్ట్రంలో, దేశంలో మహిళలను ఆగ్రహోదగ్రులను చేసిందని..
ఈ తుఫాన్ బెంగాల్ అంతటా ఆవరిస్తుంది
నారీశక్తితో ఆ పార్టీ పతనం ఖాయం: ప్రధాని
రాష్ట్రంలో పేద మహిళలపై అఘాయిత్యాలు
నేరగాళ్లకే మమత సర్కారు రక్షణ
అందుకే హైకోర్టు, సుప్రీంలో ఎదురుదెబ్బలు
అయినా దోషులను అరెస్టు చేయని వైనం
బారాసాత్ ర్యాలీలో ప్రధాని మోదీ ధ్వజం
కోల్‌కతాలో నదీగర్భ మెట్రోకు శ్రీకారం
బారాసాత్, మార్చి 6: నారీశక్తితో బెంగాల్లోని మమతా బెనర్జీ సారథ్యంలోని పాలక టీఎంసీ పతనం ఖాయమని ప్రధాని మోదీ అన్నారు. నదీతీర ద్వీపం సందేశ్‌ఖాలీలో ఆ పార్టీ నేతల అఘాయిత్యాలు రాష్ట్రంలో, దేశంలో మహిళలను ఆగ్రహోదగ్రులను చేసిందని.. బెంగాల్‌వ్యాప్తంగా ఆవరించిన ఈ తుఫాన్ ధాటికి టీఎంసీ అంతరిస్తుందని స్పష్టం చేశారు. బుధవారం ఆయన కోల్‌కతాలో హుగ్లీ నదీగర్భంలో నిర్మించిన మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బారాసాత్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మమత సర్కారు తీరుపై విరుచుకుపడ్డారు. సందేశ్‌ఖాలీలో మహిళలపై అఘాయిత్యాలు సిగ్గుచేటన్నారు. అక్కడి మహిళలపై టీఎంసీ నేత షాజహాన్ షేక్, ఆయన అనుచరుల లైంగిక వేధింపులు, భూకబ్జాలను ప్రస్తావిస్తూ.. బాధిత మహిళల పక్షాన నిలవకుండా నేరగాళ్లకే మమత సర్కారు దన్నుగా ఉంద ని ధ్వజమెత్తారు. ‘టీఎంసీ నేతలు పేద దళిత, గిరిజన మహిళలు, సోదరీమణులపై అత్యాచారాలు సాగిస్తున్నారు. ఇది చూసి బెంగాల్, భారత మహిళలు రగిలిపోతున్నారు. ఈ తుఫాను బెంగాల్ మొత్తం ఆవరించి టీఎంసీని భూస్థాపితం చేస్తుంది’ అని హెచ్చరించారు. ‘ఒకప్పుడు మహిళల సాధికారతకు బెంగాల్ దిక్సూచిగా నిలిచింది.. ఇప్పుడు టీఎంసీ పాలనలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా యి. సందేశ్‌ఖాలీలో జరిగిన ఘటనలు సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. కానీ మహిళల దుఃఖం టీఎంసీ ప్రభుత్వానికి పట్టదు. పైగా నేరగాళ్లను కాపాడుతోంది. కోర్టులు జోక్యం చేసుకున్నా.. నిందితుల అరెస్టును అడ్డుకుంటోంది.
అందుకే మొద ట కలకత్తా హైకోర్టులో, తర్వాత సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బలు తగిలాయి’ అని చెప్పారు. మహిళల రక్షణకు కేంద్రం హెల్ప్‌లైన్ ప్రారంభించిందని.. అత్యాచార నేరాలకు మరణశిక్ష విధించే సెక్షన్లు తీసుకొచ్చిందని గుర్తుచేశారు. ఈ హెల్ప్‌లైన్ బెంగాల్లో అమలు కాకుండా మమత సర్కారు అడ్డుకుందన్నారు. ప్రజలు విపక్ష ‘ఇండియా’ కూటమిని తిరస్కరించి బీజేపీకి ఓటువేయాలని పిలుపిచ్చారు. తనకు కుటుంబం లేదని ఆర్‌జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను మోదీ మరోసారి ప్రస్తావించారు. 140 కోట్ల మంది భారతీయులు తన కుటుంబమేన్నారు. ‘ఎన్‌డీఏ వరుసగా మూడోసారి కూడా అధికారంలోకి రావడం ఖాయమని గ్రహించి.. నాపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. కుటుంబ రాజకీయాలు, బంధుప్రీతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాననే దూషిస్తున్నారు’ అని తెలిపారు. బెంగాల్ అభివృద్ధికి కేంద్రం చిత్తశుద్ధితో పనిచేస్తోందని.. కోల్‌కతా మె ట్రో ప్రారంభోత్సవమే దీనికి నిదర్శనమని తెలిపారు.
బాధిత మహిళలతో భేటీ
బారాసాత్ పరిధిలోని సందేశ్‌ఖాలీలో షాజహాన్, ఆయన అనుచరుల దురాగతాలకు బలైన ఐదుగురు బాధిత మహిళలతో మోదీ భేటీ అయ్యారు. వారిని దుర్గామాతలుగా అభివర్ణించారు. వారికి న్యాయం జరిగేలా చేస్తామని, రక్షణ కల్పిస్తామని హామీఇచ్చారు. కాగా.. సందేశ్‌ఖాలీ నుంచి ప్రధాని సభకు వందల సంఖ్యలో మహిళలు బస్సుల్లో తరలివచ్చారు. అయితే భద్రతా ప్రొటోకాల్ పేరుతో పోలీసులు వారిని పలుచోట్ల అడ్డుకున్నారు. దీనిపై బీజేపీ నేతలతో కలిసి బాధితులు ఆందోళనకు దిగారు. పోలీసుల ఆటంకాలతో ఆలస్యంగా సభాస్థలికి చేరుకున్నారు. ఈ కారణంగా సభ ముగిశాక పై ఐదుగురు బాధిత మహిళలతో మోదీ భేటీ అయ్యారు. ఆయన పాదాలకు వారు నమస్కరించారు. ‘మా బాధలను ఓ తండ్రిలా ఆయ న ఓపిగ్గా విన్నారు. మాపై అఘాయిత్యాలకు పాల్పడినవారి పేర్లు ఆయనకు చెప్పాం. ఆందోళన చెందవద్దని.. నేరగాళ్లపై మా పోరాటాన్ని గౌరవిస్తున్నానని చెప్పారు. రాష్ట్ర యంత్రాంగంపై మాకు విశ్వాసం లేదని.. కేంద్రం త్వరగా మాకు న్యాయం చేయాలని అభ్యర్థించాం’ అని ఓ మహిళ మీడియాకు తెలిపారు.
దేశంలోనే తొలి నదీగర్భ మెట్రో
దేశంలోనే తొలి నదీగర్భ సొరంగ మెట్రోరైలు మార్గాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. కోల్‌కతాలో హుగ్లీ నది అడుగున నిర్మించిన మెట్రో రైలు మార్గాన్ని బుధవారం ప్రారంభించిన ఆయన.. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి ఎస్‌ప్లనడే నుంచి హౌరా వరకు.. తిరిగి అక్కడి నుంచి ఎస్‌ప్లనడేకు మెట్రో రైలులో ప్రయాణించారు. సీఎం మమత ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. తూర్పు-పశ్చిమ కారిడార్‌లో భాగంగా 4.8 కిలోమీటర్ల పొడవున ఈ రైలు సొరంగ మార్గాన్ని రూ.4,960 కోట్లతో నిర్మించినట్టు అధికారులు తెలిపారు. ఈ మెట్రో కారిడార్ పనులను 2009లో ప్రారంభించారు. ఈ రైలు మార్గం మొత్తం పొడవు 16.6 కిలోమీటర్లు. అందులో సుమారు 10.8 కిలోమీటర్లు భూగర్భంలోనే ఉంటుంది. దేశంలోనే అత్యంత లోతైన మెట్రోస్టేషన్ కూడా దీనిలోనే ఉంది. భూమికి సుమారు 32 మీటర్ల అడుగున హౌరా మెట్రో స్టేషన్‌ను నిర్మించారు. తొలి 2 కిలోమీటర్ల దూరానికి రూ.5 చార్జీగా నిర్ణయించారు. గరిష్ఠ చార్జీ రూ.50. కాగా.. ఎస్‌ప్లనడే మెట్రో స్టేషన్ నుంచి బెంగాల్‌లోని మరికొన్ని రైల్వే ప్రాజెక్టులను, దేశంలోని వివిధ నగరాల్లోని మెట్రో ప్రాజెక్టులను కూడా ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులన్నిటి విలువ సుమారు రూ.15,400 కోట్లు..