Jharkhand Election Results: గిరిజన యోధుడు
ABN , Publish Date - Nov 24 , 2024 | 04:12 AM
గిరిజన పోరాటాల వీరుడిగా ఝార్ఖండ్ గడ్డపై హేమంత్ సోరెన్ చెరగని ముద్ర వేశారు. రాష్ట్రంలో సీఎం పీఠాన్ని అధిరోహించిన చిన్న వయస్కుడిగా గుర్తింపు
ఆటుపోట్లు తట్టుకుని నిలబడ్డ హేమంత్
38వ ఏట తొలిసారి సీఎంగా బాధ్యతలు
ఏడాది కాలానికే ముగిసిన పదవి
2019లో రెండోసారి ముఖ్యమంత్రి పీఠం
5 నెలలు జైలు.. ఆపై బెయిలు
రాంచి, నవంబరు 23: గిరిజన పోరాటాల వీరుడిగా ఝార్ఖండ్ గడ్డపై హేమంత్ సోరెన్ చెరగని ముద్ర వేశారు. రాష్ట్రంలో సీఎం పీఠాన్ని అధిరోహించిన చిన్న వయస్కుడిగా గుర్తింపు పొందిన ఈ జేఎంఎం నేత.. రాజకీయ కెరీర్‌లో పలు ఆటుపోట్లు ఎదుర్కొని నిలబడ్డారు. కేంద్ర ప్రభుత్వంతో ఓ పక్క యుద్ధం చేస్తూనే.. మరో పక్క పార్టీలో అంతర్గత పోరును కూడా తట్టుకుని మూడోసారి విజేతగా నిలిచారు. నిరంతర పోరాటాలే ఆయన్ని మరోసారి సీఎం పీఠంపై కూర్చోబెట్టాయి. 1975 ఆగస్టు 10న హజారీబాగ్ సమీపంలోని నేమ్రా గ్రామంలో హేమంత్ జన్మించారు. తండ్రి, ఝార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత శిబు సోరెన్ ప్రభావం ఆయనపై ఉండేది. పాట్నా హైస్కూల్‌లో ఇంటర్మీడియెట్ చదివిన హేమంత్.. రాంచీలోని బిట్స్‌లో చేరి మధ్యలోనే చదువుకు స్వస్తి పలికారు. శిబు సోరెన్ రాజకీయ వారసుడిగా హేమంత్ అన్న దుర్గ రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. 2009లో దుర్గ అకాల మరణంతో హేమంత్ రాజకీయ అరంగేట్రం చేశారు.
2013లో తొలిసారి సీఎం పదవి
నిజానికి హేమంత్ కెరీర్ అంత సాఫీగా సాగలేదు. 2009లో రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి పదవి చేపట్టారు. ఆ పదవికి 2010లో రాజీనామా చేసి బీజేపీ నేతృత్వంలోని అర్జున్ ముండా ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ కూటమి విచ్ఛిన్నంతో 2012లో ప్రభుత్వం కూలిపోయి వెంటనే రాష్ట్రపతి పాలన వచ్చింది. ఆ తర్వాత 2013లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి 38 ఏళ్లకే తొలిసారి సీఎం పీఠాన్ని అధిరోహించారు. ఆ సమయంలో ఆయనకు కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతునిచ్చాయి. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో హేమంత్ తొలి విడత సీఎం పదవి కొద్ది కాలానికే ముగిసిపోయింది. ప్రతిపక్ష నేతగా ఆయన అసెంబ్లీలో కూర్చోవలసి వచ్చింది. అయితే బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం 2016లో తీసుకొచ్చిన చట్టసవరణలు ఆయనకు రాజకీయంగా కలసి వచ్చేలా చేశాయి. గిరిజన భూములు రక్షించే ఉద్దేశంతో చోటానాగ్‌పూర్ టెనన్సీ యాక్ట్, సంతాల్ పరగణా టెనన్సీ యాక్ట్‌లను సవరించడానికి ప్రభుత్వం ప్రయత్నించడంతో గిరిజనుల హక్కులు కాపాడటానికి హేమంత్ పెద్దఎత్తున ఉద్యమం చేశారు. ఇది ఆయనకు తిరుగులేని పొలిటికల్ మైలేజీ తీసుకొచ్చింది. మళ్లీ రాష్ట్రంలో అధికారం చేపట్టడానికి ఉపయోగపడింది.
కాంగ్రెస్, ఆర్జేడీ సహకారంతో..
జేఎంఎం మిత్ర పక్షాలు కాంగ్రెస్, ఆర్జేడీ సహకారంతో 2019లో హేమంత్ మరోసారి సీఎం పీఠాన్ని అధిరోహించారు. 81 స్థానాలున్న అసెంబ్లీలో ఆయన నేతృత్వంలో జేఎంఎం 30 సీట్లు గెలుచుకుంది. దీంతో ఆయన స్థానం సుస్థిరమైంది. అయితే మైనింగ్ లీజు విషయంలో 2022లో ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు పడుతుందనగా త్రుటిలో తప్పించుకున్నారు. 2023లో వచ్చిన ఆరోపణలతో ఆయన కెరీర్ మరోసారి ఒడుదుడుకులకు లోనైంది. మనీ లాండరింగ్‌కు సంబంధించిన ఓ కేసులో ఈడాది జనవరి 31న ఆయన అరెస్టు అయ్యారు. అంతకుముందే సీఎం పదవికి కూడా రాజీనామా చేశారు. ఐదు నెలల కారాగారవాసం తర్వాత ఝార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇన్ని సవాళ్లను ఎదుర్కొన్నా కూడా హేమంత్‌కు రాష్ట్రంలోని గిరిజన జనాభా మద్దతుగా నిలిచారు.
సైక్లింగ్, క్రికెట్ అంటే ఇష్టం..
ఇంజనీర్ కావాలనుకున్న హేమంత్.. అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 19వ శతాబ్దానికి చెందిన గిరిజన యోధుడు బిర్సా ముండా అంటే ఆయనకు ఎనలేని భక్తి, అభిమానం. ఇక క్రీడలంటే హేమంత్‌కు ప్రత్యేకమైన ఇష్టం. సైక్లింగ్‌పై మక్కువ చూపే ఆయన అప్పుడప్పుడు క్రికెట్ ఆడటానికి కూడా ఇష్టపడతారు. పంజాబ్‌కు చెందిన కల్పనను హేమంత్ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. దుమ్కా, బర్హయిత్ నియోజకవర్గాల్లో చేసిన అభివృద్ధి పనులకుగాను హేమంత్‌కు 2019లో చాంపియన్ ఆఫ్ చేంజ్ అవార్డు దక్కింది.