Chhattisgarh : ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరు ఆదివాసీలకు ప్రజాకోర్టులో ఉరి
ABN , Publish Date - Dec 24 , 2024 | 06:26 AM
ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రంలో ఇన్‌ఫార్మర్ల పేరుతో ఆదివాసీలను మావోయిస్టులు ఉరి వేస్తున్నారు. తాజాగా బీజాపూర్ జిల్లా గంగలూరు అడవుల్లో సోమవారం ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు
చర్ల, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రంలో ఇన్‌ఫార్మర్ల పేరుతో ఆదివాసీలను మావోయిస్టులు ఉరి వేస్తున్నారు. తాజాగా బీజాపూర్ జిల్లా గంగలూరు అడవుల్లో సోమవారం ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు ప్రజాకోర్టులో ఉరివేసి హత్య చేశారు. కొద్ది రోజుల క్రితం బీజాపూర్ జిల్లా గంగలూరు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు ఇన్‌ఫార్మర్లుగా ఆరోపిస్తూ సోమవారం వారిని ఉరివేసి హత్య చేశారు. మృతదేహాల వద్ద వారు పోలీస్ ఇన్‌ఫార్మర్లుగా పేర్కొంటూ లేఖను వదిలారు. అలాగే ఇన్‌ఫార్మర్ నెపంతోనే గంగలూరు ప్రాతంలోని రెడ్డి గ్రామానికి చెందిన ముఖేష్ హేమ్ల అనే యువకుడిని మావోయిస్టులు సోమవారం హత్య చేశారు. గత కొంత కాలంగా ఆదివాసీలను ఉరివేయడం మావోయిస్టుకు పరిపాటిగా మారింది. గత ఏడాది కాలంగా ఉరివేసి సుమారు 10 నుంచి 15 మంది ఆదివాసీలను మావోయిస్టులు హత్య చేసినట్లు తెలుస్తోంది. స్థానికుల్లో భయం కలగాలనే ఉద్దేశంతోనే ఇన్‌ఫార్మర్లను స్థానికుల సమక్షంలో ఉరి వేసి మావోయిస్టులు హత్య చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆర్‌కే స్మారక స్థూపం కూల్చివేత
ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా కోమటిపల్లి అడవుల్లో సోమవారం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే స్మారక స్థూపాన్ని డీఆర్‌జీ, ఎస్టీఎఫ్, కోబ్రా బలగాలు కూల్చివేశాయి. ఆర్‌కే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పని చేశారు. 2021 అక్టోబరు 14న తీవ్ర అనారోగ్యంతో ఆయన మృతి చెందారు. మరోవైపు, సీనియర్ మావోయిస్టు నేత ప్రభాకర్ రావు అలియాస్ బల్మూరి నారాయణ రావు (57)ను ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రం కంకేర్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభాకర్ రావు స్వస్థలం జగిత్యాల జిల్లా బీర్‌పూర్ గ్రామం. దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడైన ప్రభాకర్ రావును అంతగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఈయనపై రూ.25 లక్షల రివార్డు ఉంది. ఈయన ఇంటర్ వరకు ధర్మపురిలో చదివారు. 1984లో మావోయిస్టుల్లో చేరారు.