Ratan Tata: రతన్ టాటా లేరన్న వార్తను నమ్మలేకపోతున్నా: ఆనంద్ మహీంద్రా
ABN , Publish Date - Oct 10 , 2024 | 09:17 AM
ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా అస్తమయంపై మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా విచారం వ్యక్తం చేశారు.
ఇంటర్నేట్ డెస్క్: భారతీయ వ్యాపార దిగ్గజం రతన్ టాటా (Ratan Tata)` ఇకలేరన్న వార్త యావత్ భారతాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ అనేక మంది సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. భారతీయ విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న రతన్‌టాటాకు నివాళులు అర్పిస్తున్నారు. రతన్ టాటా ఇక లేరన్న వాస్తవాన్ని తాను ఆమోదించలేకపోతున్నానని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా విచారం వ్యక్తం చేశారు. ఆయన అడుగు జాడల్లో నడుస్తానని అన్నారు.
Ratan Tata: రతన్ టాటా నిర్మించిన ఒకే ఒక సినిమా.. కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్!
‘‘రతన్ టాటా ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారన్న వాస్తవాన్ని అంగీకరించలేకపోతున్నాను . ప్రస్తుతం భారత ఆర్థిక రంగం ఈ స్థితిలో ఉండటంలో రతన్ టాటా పాత్ర గొప్పది. భారత ఆర్థిక రంగం కీలక దశకు చేరుకున్న ఈ తరుణంలో ఆయన మార్గదర్శకత్వం దేశానికి ఉపయోగపడి ఉండేది’’ అని ఎక్స్ వేదికగా ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. ఇక అందరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. సిరిసంపదలను ప్రజల మేలు కోసమే వెచ్చించాలని నమ్మిన వ్యక్తి టాటా అని ఆయన కొనియాడారు. భారత వ్యాపార, ఆర్థిక రంగాలకు ఆయన చేసిన సేవను దేశం ఎన్నడూ మర్చిపోదని అన్నారు. రతన్ టాటా ఎప్పటికీ ప్రజల మదిలోనే ఉంటారని వ్యాఖ్యానించారు. గొప్ప వ్యక్తులు ఎప్పటికీ ప్రజల మధ్యనే ఉంటారని అన్నారు.
రతన్ టాటా మృతిపట్ల కేసీఆర్ సంతాపం
కాగా, రతన్ టాటా మరణంపై గౌతమ్ అదానీ కూడా స్పందించారు. భారత అభివృద్ధి పథాన్ని పునర్నిర్వచించిన దార్శనికుడు రతన్ టాటా అని కొనియాడారు. రతన్ టాటా కేవలం ఒక వ్యాపారవేత్త మాత్రమే కాదని, భారతీయ విలువలు, సమగ్రతకు రూపమని అన్నారు. ప్రజాహితం కాంక్షించే వ్యక్తిగా , దయాగుణ శీలిగా రతన్ టాటా ఎప్పటికీ ప్రజల మనసుల్లో నిలిచుండిపోతారన్నారు. రతన్ టాటా మరణంతో కాలం స్తంభించినట్టు ఉందని ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ హర్ష గోయెంకా అన్నారు. రతన్ టాటా అత్యంత గౌరవనీయమైన వ్యాపారవేత్త అని, వ్యాపారవిలువలకు సమగ్రతను స్వరూపమని ప్రశంసించారు.
గొప్ప మానవతావాదిని కోల్పోయాం: చంద్రబాబు
1991లో టాటా సంస్థల పగ్గాలను రతన్ టాటా స్వీకరించారు. 2012 వరకూ టాటా గ్రూప్‌కు చైర్మన్‌గా వ్యవహరించారు. 2008లో ఆయనను దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ వరించింది.
రతన్ టాటా అత్యంతక్రియలను పూర్తి స్థాయి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే తెలిపారు. ఇక నేడు సంతాప దినంగా కూడా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ముంబైలోని నేషనల్ సెంటర్ ఫర్ పర్‌ఫార్మింగ్ ఆర్ట్స్‌లో నేడు రతన్ టాటా భౌతికకాయాన్ని సాయంత్రం 4 గంటల వరకూ ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. వర్లీలో ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హోం మంత్రి అమిత్ షా కూడా హాజరు కానున్నారు.