Youth Empowerment : యువ మిత్ర!
ABN , Publish Date - Jul 24 , 2024 | 06:00 AM
ఉరుముతున్న నిరుద్యోగ భూతం! పన్నులు కడుతున్నా మాకేమీ లేదంటూ వేతన జీవుల్లో తీవ్ర అసంతృప్తి! సంక్షోభంలో చిక్కుకున్న ఎంఎస్‌ఎంఈల యాజమాన్యాల్లో ఆందోళన! కేంద్రంలో సంకీర్ణ సర్కారును నడపాల్సిన రాజకీయ అనివార్యత! ఇందులో భాగంగానే బిహార్ నుంచి ఒకదాని
అందులో అప్పులు 14 లక్షల కోట్లు
మొత్తం బడ్జెట్ 48,20,512 కోట్లు
యువత నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాలు లక్ష్యంగా బడ్జెట్
బీజేపీ మిత్రపక్షాల రాష్ట్రాలకు నిధుల్లో పెద్దపీట
బిహార్‌కు రూ.26 వేల కోట్లతో రోడ్లు, వంతెనలు
విద్యుత్తు ప్లాంటు, ఎయిర్‌పోర్టులు, వైద్య కాలేజీలూ
యువతకు రూ.2 లక్షల కోట్లతో పీఎం ప్యాకేజీ
కొత్త ఉద్యోగులకు తొలి జీతం ప్రభుత్వం నుంచే..
రూ.15 వేల వరకు 3 విడతల్లో చెల్లింపు
ఐదేళ్లలో 5 పథకాల కింద 4.1 కోట్ల యువతకు లబ్ధి
20 లక్షల మందికి శిక్షణ, కోటిమందికి ఇంటర్న్‌షిప్
ముద్రా రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంపు
మహిళలకు స్టాంపు డ్యూటీ తగ్గించే వెసులుబాటు
వర్కింగ్ విమెన్‌కు హాస్టల్స్.. కార్మికులకు డార్మిటరీలు
రూ.10 లక్షల కోట్లతో పట్టణ పేదలకు కోటి ఇళ్లు
ఎంఎ్‌సఎంఈలకు వరాలు.. పారిశ్రామిక కారిడార్లు
రైల్వేలు, పెట్టుబడుల ఉపసంహరణపై ప్రస్తావన నో
సెంట్రల్ డెస్క్ : ఉరుముతున్న నిరుద్యోగ భూతం! పన్నులు కడుతున్నా మాకేమీ లేదంటూ వేతన జీవుల్లో తీవ్ర అసంతృప్తి! సంక్షోభంలో చిక్కుకున్న ఎంఎస్‌ఎంఈల యాజమాన్యాల్లో ఆందోళన! కేంద్రంలో సంకీర్ణ సర్కారును నడపాల్సిన రాజకీయ అనివార్యత! ఇందులో భాగంగానే బిహార్ నుంచి ఒకదాని తర్వాత మరొకటిగా డిమాండ్లు! లోక్‌సభ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలిన నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కొత్త ఓటర్లను ఆకర్షించాల్సిన పరిస్థితి! వీటన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూనే సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాల్సిన సంకట స్థితి! అందుకే.. ‘మోదీ ఎవరి మాటా వినరనే గత వైఖరికి భిన్నంగా’.. ఈసారి బడ్జెట్లో సంకీర్ణ అనివార్యతకు రాజీ పడుతూనే సంస్కరణ పథాన్ని కొనసాగించారు! సంకీర్ణ మిత్రులను సంతృప్తిపరుస్తూనే ‘యూత్ మంత్ర’ం పఠించారు! ఎప్పట్లాగే మౌలిక వసతులకు పెద్దపీట వేశారు. జనాకర్షణ జోలికి వెళ్లలేదు.
ప్రస్తుత బడ్జెట్ నూతన మధ్యతరగతికి మరింత సాధికారత అందిస్తుంది. యువతకు అపార అవకాశాలు కల్పిస్తుంది. ఉద్యోగ ఆధారిత ప్రోత్సాహక పథకం దేశంలో మరిన్ని ఉద్యోగ అవకాశాల కల్పనకు దోహద పడుతుంది.
- ప్రధాని నరేంద్ర మోదీ
ఇది బుజ్జగింపుల బడ్జెట్. అధికారాన్ని కాపాడుకునే బడ్జెట్. కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను కాపీ కొట్టి ఈ బడ్జెట్‌ను రూపొందించారు. సంపన్న వర్గాలకు మేళ్లు చేస్తూ.. సాధారణ పౌరుల సంక్షేమాన్ని పణంగా పెట్టారు.
- ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ
యువతను, మిత్ర పక్షాలను సంతృప్తిపరిచేలా బడ్జెట్
యువతకు ఉపాధి, శిక్షణ.. కొంతమంది ఉద్యోగులకు ఊరట.. మిత్రులకు నిధులు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తన పూర్తిస్థాయి బడ్జెట్‌ను మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరిలో తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పుడు రూ.48.21 లక్షల కోట్లతో పూర్తిస్థాయి పద్దును సమర్పించారు. తొమ్మిది రంగాలు, నాలుగు అంశాలపై ప్రధానంగా దృష్టిసారించారు. గతానికి భిన్నంగా ఎటువంటి సూక్తులు, సుత్తి లేకుండా నేరుగా బడ్జెట్ ప్రసంగం కొనసాగించారు. భారత్‌లో నిరుద్యోగం 9.2 శాతానికి చేరిందని, వికసిత భారత్‌కు, ఆర్థిక వృద్ధికి ఇది ప్రధాన అవరోధంగా మారిందన్న ఆందోళనల నేపథ్యంలో యువతకు ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణపై ప్రత్యేక దృష్టిసారించారు. ‘పీఎం ప్యాకేజీ’ కింద రాబోయే ఐదేళ్లలో 4.1కోట్ల యువతకు లబ్ధి చేకూరేలా రూ.2లక్షల కోట్లతో ఐదు పథకాలను ప్రకటించారు. కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి ఒక నెల వేతనాన్ని (గరిష్ఠంగా రూ.15 వేలు) బోన్‌సగా ఇవ్వడం.. ఈపీఎ్‌ఫవో చెల్లింపుల ఆధారంగా ఉద్యోగికి, యజమాన్యానికి ప్రోత్సాహకాలు ఇవ్వడం.. అదనపు ఉద్యోగాలు కల్పించే సంస్థలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం ఇందులో భాగంగా ఉన్నాయి. అంటే, కొత్త ఉద్యోగులకు సంస్థలు చెల్లించే ఈపీఎ్‌ఫవో వాటాను నెలకు రూ.3000 చొప్పున రెండేళ్లపాటు తిరిగి రీయింబర్స్ చేయనుంది. ఈ మూడు పథకాలకు దాదాపు లక్ష కోట్లను ఖర్చు చేయనుంది. యువతలో సగం మందికి మాత్రమే ఉద్యోగ నైపుణ్యాలు ఉన్నాయని ఆర్థిక సర్వే కూడా ఘోషించిన నేపథ్యంలో రాబోయే ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. దేశంలోని 500 అగ్రశ్రేణి కంపెనీల్లో కోటి మందికి ఇంటెర్న్‌షి్‌పను కల్పించనుంది. యువతకు ఉపాధి పెంచేందుకు ముద్రా రుణాల పరిమితిని రూ.10లక్షల నుంచి రూ.20లక్షలకు పెంచింది. విద్యార్థులకు రూ.10లక్షల వరకూ విద్యా రుణాలు ఇవ్వాలని సంకల్పించింది. వాటిపై 3 శాతం వడ్డీ రాయితీ ఇస్తామని ప్రకటించింది. మహిళలపైనా కొన్ని వరాలను కురిపించింది. మహిళల పేరిట ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై స్టాంపు డ్యూటీని తగ్గించాలని ప్రతిపాదించింది.మహిళలు, బాలికల అభివృద్ధికి రూ.3లక్షల కోట్లను కేటాయించింది. ఉద్యోగాలు చేసే మహిళల కోసం ప్రత్యేకంగా హాస్టళ్లను నిర్మించనుంది.
...మిత్రో!
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పూర్తిస్థాయి మెజారిటీ రాకపోవడంతో ఎన్డీయే మిత్రులపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఇప్పటికే బిహార్ సీఎం నితీశ్ కుమార్ తమకు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ కావాలని డిమాండ్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, బడ్జెట్లో మిత్రులకు పెద్దపీట వేశారు. సర్కారు ఏర్పాటులో కీలకంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌పై వరాలు కురిపించారు. ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు.. ఏపీ రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్లు ఇస్తామని చెబుతూనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని సంకల్పం చెప్పుకొన్నారు. విశాఖపట్నం- చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని కొప్పర్తి నోడ్; హైదరాబాద్- బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లోని ఓర్వకల్లు నోడ్‌కు నిధులిస్తామని ప్రకటించింది. వెనకబడిన జిల్లాలకు గ్రాంట్లు ఇస్తామని తెలిపింది. బిహార్‌కు రూ.26వేల కోట్లతో రోడ్లు, వంతెనలు;రూ.21వేల కోట్లతో అణు విద్యుత్తు ప్లాంట్, విమానాశ్రయాలు, మెడికల్ కాలేజీలు తదితర వరాలు ప్రకటించింది. బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి ‘పూర్వోదయ’ పథకాన్ని ప్రకటించింది. బిహార్ సహా 5 వరద బాధిత రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు ఇస్తామని తెలిపింది. ఏకంగా ఎనిమిది మంది ఎంపీలను గెలిపించినా తెలంగాణకు మొండిచెయ్యే చూపింది. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని అడిగినా పట్టించుకోలేదు. కొత్తగా ఎటువంటి వరాలూ ప్రకటించలేదు.
ఈసారి వాటి ఊసేదీ..!?
బడ్జెట్‌లో రైల్వేకు కేటాయింపులు తప్పనిసరి. అలాగే, ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వె్‌స్టమెంట్) ఉంటూ ఉంటుంది. కానీ, మధ్యంతర బడ్జెట్‌లో కేటాయింపులు తప్పితే ఈసారి బడ్జెట్లో రైల్వే, డిజిన్వె్‌స్టమెంట్‌కు సంబంధించి ఎటువంటి ప్రకటనా లేదు. నదుల అనుసంధానాన్ని మాట మాత్రంగా కూడా ప్రస్తావించలేదు. అదే సమయంలో, ఎప్పట్లాగే, మౌలిక సదుపాయాలు(ఇన్ర్ఫా), ఇండస్ట్రియల్ పార్కులు, కారిడార్లకు నిధులు కేటాయించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రాలకు 1.5 లక్షల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రకటించారు. మధ్యంతర బడ్జెట్లో ప్రకటించిన రూ.11.11లక్షల కోట్లనే మూలధన వ్యయం (క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్)గా చూపారు. కాకపోతే, సంక్షోభంలో ఉన్న ఎంఎ్‌సఎంఈలను ఆదుకోవడానికి బడ్జెట్లో కొన్ని పథకాలను ప్రకటించారు. వాటికి క్రెడిట్ గ్యారెంటీ పథకాలతోపాటు త్వరలో రూ.100కోట్ల రుణాలు ఇచ్చే పథకాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు. తనఖాలు, గ్యారెంటీలు లేకుండా యంత్ర పరికరాల కొనుగోలుకు టర్మ్ రుణాలు ఇస్తామని తెలిపారు. ఎంఎ్‌సఎంఈ క్లస్టర్లు, సిడ్బీ బ్రాంచిలు ఏర్పాటు చేస్తామని, వంద నగరాల్లో పారిశ్రామిక పార్కులు, 12పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రూ.లక్ష కోట్లతో ప్రైవేటు రంగంలో ఇన్నోవేషన్, పరిశోధన సంస్థలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్మికుల కోసం డార్మిటరీ తరహాలో ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. ఇక,వ్యవసాయ రంగానికి రూ.1.52లక్షల కోట్లను కేటాయించింది. ప్రకృతి వ్యవసాయంలోకి మరో కోటి మంది రైతులను తీసుకొస్తామని, కూరగాయల ఉత్పత్తికి క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. 5కోట్ల మంది గిరిజనులకు లబ్ధి చేకూర్చేందుకు జన తాంత్రియ యోజన అమలు చేస్తామని వెల్లడించింది. ఈ బడ్జెట్లో ధనిక, పేద తారతమ్యాన్ని తగ్గించేందుకు ఎటువంటి చర్యలూ ప్రకటించలేదు. మధ్యంతర బడ్జెట్లో ప్రాధాన్యంగా తీసుకున్న ‘నిరుపేదలు’ అనే అంశం.. ఈసారి లేకపోవడం గమనార్హం!!
రాయితీలకు మంగళం
ఎప్పట్నుంచో అమల్లో ఉన్న ఆదాయ పన్ను విధానంలో ఇంటి నిర్మాణం, పిల్లల ఫీజులు, పొదుపు తదితరాలకు రాయితీలు ఉంటాయి. బీజేపీ సర్కారు గతంలో తెరపైకి తెచ్చిన కొత్త విధానంలో వీటికి మంగళం పలికింది. ఈ నేపథ్యంలోనే తమకు మరిన్ని రాయితీలు ఇవ్వాలని వేతనజీవులు పదే పదే కోరుతున్నారు. కానీ, ఎప్పట్లాగే, ఈసారి కూడా బడ్జెట్లో కొత్త విధానానికే కేంద్రం పెద్దపీట వేసింది. స్టాండర్డ్ డిడక్షన్‌తోపాటు శ్లాబులను కూడా కొత్త విధానంలోనే మార్చింది. తద్వారా, పాత విధానానికి పూర్తిస్థాయిలో పాతర వేసింది. అంతేనా.. వచ్చే ఏడాది నుంచి పాత విధానానికి పూర్తిస్థాయిలో మంగళం పాడతారన్న ఊహాగానాలూ వెలువడుతు న్నాయి. ఇక, బడ్జెట్లో బంగారం, వెండితోపాటు సెల్‌ఫోన్లు, లెదర్ ఉత్పత్తులు, ఎక్స్‌రే మిషన్లు, సోలార్ ఉత్పత్తులు, మూడు క్యాన్సర్ మందులపై కస్టమ్ డ్యూటీని తగ్గించారు. ఫలితంగా, వాటి ధరలు తగ్గనున్నాయి. ఈ ప్రకటనతో ఒక్క మంగళవారంనాడే బంగారం గ్రాముకు రూ.4000 వరకూ తగ్గడం గమనార్హం. ఎప్పట్లాగే, ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకు పెద్దపీట వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 కోట్ల ఇళ్లు నిర్మించనున్నారు. పట్టణ పేదలకు రూ.10లక్షల కోట్ల పెట్టుబడితో కోటి ఇళ్లను నిర్మించాలని ఈ బడ్జెట్లో పెట్టారు. ఇందులో రూ.2.2 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వమే ఖర్చు చేయనుంది.
సమయం మారింది
తొలిరోజుల్లో సాయంత్రం 5గంటలకు బడ్జెట్ సమర్పించడం ఆనవాయితీగా ఉండేది. బ్రిటిషర్ల పాలనలో భారత్, లండన్ కాలమానాలు కలిసొచ్చే విధంగా ఈ సమయాన్ని ఎంచుకున్నారు. అయితే 1999లో యశ్వంత్ సిన్హా కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో బడ్జెట్ సమర్పించే సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్చారు. అప్పటినుంచి అదే సమయం కొనసాగుతోంది.
‘చివరి తేదీ’కి స్వస్తి
సాధారణంగా ఫిబ్రవరి చివరి రోజున కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. దీనివల్ల కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం (ఏప్రిల్ 1) నాటికి నిధులు అందుబాటులోకి రావడంలో జాప్యం చోటుచేసుకునేది. 2017లో ఈ సంప్రదాయానికి స్వస్తి చెబుతూ నాటి కేంద్ర మంత్రి జైట్లీ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టడం ప్రారంభించారు.
భద్రంగా బడ్జెట్ పత్రాలు
1950లో ఆర్థిక మంత్రి జాన్ మత్తాయ్ హయాంలో బడ్జెట్ పత్రాలు లీక్ అయిన తర్వాత వీటి ముద్రణను రాష్ట్రపతి భవన్ నుంచి మింటో రోడ్‌కు మార్చారు. 1980లో ఆర్థిక శాఖ కేంద్రంగా ఉన్న నార్త్ బ్లాక్‌లో ప్రభుత్వ ప్రెస్‌ను ఏర్పాటు చేసి, అక్కడే బడ్జెట్‌ను ముద్రిస్తున్నారు. లీకేజీలను నిరోధించడానికి ఫోన్ ట్యాపింగ్, నిఘా, ఎలకా్ట్రనిక్ స్వీప్ వంటి పటిష్ఠమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.
18,650 పదాలతో బడ్జెట్
1991లో పీవీ నరసింహారావు ప్రభుత్వంలో నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ 18,650 పదాలతో బడ్జెట్ ప్రసంగం చేశారు. పదాల పరంగా ఇదే అతి సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం. ఎక్కువగా ఆర్థిక సరళీకరణ విధానాలను ఈ బడ్జెట్‌లో ప్రస్తావించారు. 2018లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రసంగం 18,604 పదాలతో రెండో స్థానంలో నిలిచింది. అప్పట్లో జైట్లీ 1 గంట 49 నిమిషాలపాటు మాట్లాడారు. ఇక 1977లో అప్పటి ఆర్థిక మంత్రి హీరూభాయ్ ముల్జీభాయ్ పటేల్ కేవలం 800 పదాలతో బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. ఇప్పటి వరకూ ఇదే అతి చిన్న బడ్జెట్ ప్రసంగంగా నిలిచింది.