Share News

రేషన్‌ డీలర్లకు మార్జిన్‌ పెంచే యోచన లేదు

ABN , Publish Date - Nov 28 , 2024 | 04:40 AM

ప్రజాపంపిణీ(పీడీఎస్‌) కార్యక్రమంలో రేషన్‌ డీలర్లకు మార్జిన్‌ పెంచే ఆలోచనేదీ కేంద్రం దృష్టిలో లేదని కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి బుధవారం లోక్‌సభలో స్పష్టం చేశారు.

రేషన్‌ డీలర్లకు మార్జిన్‌ పెంచే యోచన లేదు

లోక్‌సభలో స్పష్టం చేసిన కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి

న్యూఢిల్లీ, నవంబరు 27: ప్రజాపంపిణీ(పీడీఎస్‌) కార్యక్రమంలో రేషన్‌ డీలర్లకు మార్జిన్‌ పెంచే ఆలోచనేదీ కేంద్రం దృష్టిలో లేదని కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి బుధవారం లోక్‌సభలో స్పష్టం చేశారు. అయితే కేంద్రం నిర్ణయించిన మార్జిన్ల కంటే పెంచి ఇచ్చేందుకు రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉందని ఈ అంశంపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2022 ఏప్రిల్‌లో సవరించిన ఆహార భద్రత నిబంధనల మేరకు డీలర్లకు క్వింటాల్‌కు ఇచ్చే మార్జిన్‌ రూ.90. జనరల్‌ కేటగిరీ రాష్ట్రాల్లో ఈ మొత్తానికి మరో రూ.21 కలిపి ఇస్తారు. అదే ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాల్లో క్వింటాల్‌కు రూ.180తోపాటు అదనంగా మరో రూ.26 కలిపి ఇస్తారు. కాగా రేషన్‌ షాపులకు లైసెన్సులు ఇవ్వడం, వాటి పర్యవేక్షణ నిర్వహణ బాధ్యతలు పూర్తిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలపైనే ఉన్నాయని కేంద్రమంత్రి గుర్తుచేశారు. డీలర్లకు ఇచ్చే వాస్తవ మార్జిన్‌, కమిషన్‌ని నిర్ణయించడంలో కేంద్రానికి ఎటువంటి పాత్రా లేదని స్పష్టం చేశారు.

కాగా ప్రయాణికుల విమానాలకు ఈ ఏడాది మొత్తం 994 ఉత్తుత్తి బెదిరింపు కాల్స్‌ వచ్చాయని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్‌ మహోల్‌ బుధవారం పార్లమెంటులో తెలిపారు. ఈ బెదిరింపు కాల్స్‌ తీవ్రతను అంచనా వేసి పటిష్ట చర్యలు తీసుకొనేందుకు పౌర విమానయాన భద్రత బ్యూరో(బీసీఏఎస్‌) పటిష్ట భద్రతా ప్రణాళికను రూపొందించిందని ఆయన వివరించారు. అందులో భాగంగా దేశంలో ప్రతి విమానాశ్రయానికి ఒక ప్రత్యేక బాంబు బెదిరింపు తీవ్రత అంచనా కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాగా సామాజిక మాధ్యమాల్లో అసభ్య సమాచారాన్ని(కంటెంట్‌) నివారించేందుకు ఇప్పుడున్న చట్టాలను మరింత కఠినతరం చేయాల్సి ఉందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ బుధవారం లోక్‌సభలో చెప్పారు.

Updated Date - Nov 28 , 2024 | 04:40 AM