పార్లమెంటు ఆవరణలో బాహాబాహీ!
ABN , Publish Date - Dec 20 , 2024 | 04:02 AM
భారతదేశ పార్లమెంటు చరిత్రలోనే ఎన్నడూ కనీవినీ ఎరుగని దృశ్యం గురువారం ఆవిష్కృతమైంది. అధికార, విపక్షాల మధ్య ఇప్పటివరకూ జరుగుతున్న మాటల యుద్ధం గురువారం భౌతిక దాడులకు దారితీసింది.
చరిత్రలో ఎన్నడూ చూడని దృశ్యం
మలుపు తిరిగిన అంబేడ్కర్‌పై షా వ్యాఖ్యల వివాదం
ఇండియా, ఎన్‌డీఏ ఎంపీల పోటాపోటీ నిరసనలు
మకరద్వారం వద్ద తోపులాట
ముఖేశ్ రాజ్‌పుత్‌ను
రాహుల్ బలంగా తోసేశారు
ఆయన ప్రతాప్ సారంగిపై పడ్డారు
మా ఎంపీలకు గాయాలయ్యాయి
హత్యాయత్నం జరిగింది: బీజేపీ
బీజేపీ వాళ్లే అడ్డుకొని నన్ను, ఖర్గేను తోసివేశారు: రాహుల్ గాంధీ
నా మోకాలికి గాయమైంది: ఖర్గే
ఠాణాలో ఇరుపక్షాల ఫిర్యాదులు.. రాహుల్‌పై ఎఫ్‌ఐఆర్
న్యూఢిల్లీ, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): భారతదేశ పార్లమెంటు చరిత్రలోనే ఎన్నడూ కనీవినీ ఎరుగని దృశ్యం గురువారం ఆవిష్కృతమైంది. అధికార, విపక్షాల మధ్య ఇప్పటివరకూ జరుగుతున్న మాటల యుద్ధం గురువారం భౌతిక దాడులకు దారితీసింది. బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవమానించారని ఆరోపిస్తూ ప్రతిపక్ష సభ్యులు ఒకవైపు.. కాంగ్రెస్ పార్టీ అమిత్ షా మాటల్ని వక్రీకరించటమే కాక వారి హయాంలో అంబేడ్కర్‌ను అవమానించారని పేర్కొంటూ అధికార పక్ష సభ్యులు మరోవైపు.. పార్లమెంట్ ప్రాంగణంలో పోటాపోటీగా నిరసనలు చేపట్టారు. ఆ నిరసనలు తోపులాటకు దారితీసి ఉద్రిక్తత ఏర్పడింది. బీజేపీకి చెందిన ఇద్దరు ఎంపీలు గాయపడి ఆస్పత్రి పాలు కాగా, ఆ పార్టీకే చెందిన ఓ మహిళా ఎంపీ తన పట్ల రాహుల్‌గాంధీ అనుచితంగా వ్యవహరించారని ఆరోపించారు. రాహుల్ గాంధీ తోసేయడం వల్లే తమ ఎంపీలు గాయపడ్డారని బీజేపీ ఆరోపించగా.. తొలుత వాళ్లే తనను నెట్టివేశారని, తమ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా తోసివేస్తే ఆయన మోకాలికి గాయమైందని రాహుల్ గాంధీ అన్నారు. తమ సభ్యులపై హత్యాయత్నం జరిగిందని బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్, బాన్సురీ స్వరాజ్ రాహుల్‌గాంఽధీపై పార్లమెంట్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. 84 ఏళ్ల ఖర్గే పట్ల బీజేపీ ఎంపీలు అనుచితంగా ప్రవర్తించారంటూ కాంగ్రెస్ ఎంపీలు దిగ్విజయ్ సింగ్, ముకుల్ వాస్నిక్ తదితరులు అదే స్టేషన్‌లో ఫిర్యాదు చేశా రు. రెండు పార్టీల నేతలు పరస్పరం నిందించుకుంటూ, జరిగిన ఘటనపై దర్యాప్తు జరిపించాలంటూ ఉభయ సభల అధ్యక్షులకు లేఖలు రాశాయి. ఇరు వర్గాలూ తమ కథనాల ను సమర్థించుకుంటూ వీడియోలు విడుదల చేశాయి. ఈ మొత్తం ఉదంతం ఉభయ సభలను కుదిపివేయడంతో గందరగోళం, నినాదాల మధ్య ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకుండా శుక్రవారానికి వాయిదా పడ్డాయి.
మకరద్వారం వద్ద ఉద్రిక్తత
గురువారం ఉదయం పార్లమెంటు కార్యకలాపాలు ప్రారంభం కావటానికి ముందే ఎన్‌డీఏ, ఇండియా ఎంపీలు పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగారు. అమిత్ షా వ్యా ఖ్యలను వ్యతిరేకిస్తూ అంబేడ్కర్ విగ్రహం ఎదుట ఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, సుప్రియా సూలేతో పాటు కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, ఎస్పీ, ఎన్సీపీ (శరద్‌పవార్), వామపక్షాలు తదితర పార్టీల సభ్యులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అంబేడ్కర్‌కు సంకేతంగా పలువురు ఎంపీలు నీలి రంగు టీషర్టులు ధరించారు. నిరసన అనంతరం ఊరేగింపు గా.. పార్లమెంటులోకి ఎంపీల ప్రవేశద్వారమైన మకర ద్వారం నుంచి లోపలికి వెళ్లేందుకు అక్కడికి చేరుకున్నారు. అయితే, ఆ సమయంలో మకరద్వారం వద్ద అధికారపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో అంబేడ్కర్‌కు అవమానం జరిగిందని, దానికి ఆ పార్టీ క్షమాపణ చెప్పాలంటూ వారు నినాదాలిచ్చారు. ప్రతిపక్ష ఎంపీలు అటువైపు రావటంతో.. ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదా లు చేయటం ప్రారంభించాయి. దీనితో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ సభ్యులు కర్రలతో కూడిన ప్లకార్డులను పట్టుకొని, ఆ కర్రలతో తమ మీద దాడి చేశారని, తాము పార్లమెంట్ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారని రాహుల్‌గాంధీ ఆరోపించారు. రాహు లే తమ మీద దాడి చేసి తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలను గాయపర్చారని బీజేపీ సభ్యులు ఆరోపించారు. ముఖేశ్ రాజ్‌పుత్ అనే ఎంపీని రాహుల్ బలంగా తోసివేశారని, ఆయన ప్రతాప్ సారంగి అనే మరో ఎంపీపై పడ్డారని, ఇరువురూ గాయపడటంతో వారిని ఆస్పత్రికి తరలించాల్సి వచ్చిందని తెలిపారు.
రాహుల్ కారణంగానే తాను గాయపడ్డానని 69 ఏళ్ల ప్రతాప్ సారంగి ఆరోపించారు. తనను రాహుల్ తోసి వేశారని ముఖేశ్ చెప్పారు. కాగా, ఇతర ఎంపీలను కొట్టేందుకే మీరు కరాటే, కుంగ్‌ఫూ నేర్చుకున్నారా అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజూ.. రాహుల్‌ను ప్ర శ్నించారు. కాగా, తానెవరినీ తోసేయలేదని రాహుల్ గాంధీ చెప్పారు. తాను పార్లమెంట్ లోపలికి వెళ్తుండగా బీజేపీ ఎంపీలే తనను బెదిరించి తోసేశారని ఆరోపించారు. తమ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా తోసేశారని చెప్పారు. దీనిపై ఖర్గే కూడా స్పందించారు. బీజేపీ ఎంపీలు తనను నెట్టివేస్తే కూలబడ్డానని, తన మోకాలికి గాయమైందని, కుంటుకుంటూ సభలోకి వెళ్లానని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఈ దాడిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. రాహుల్‌గాంధీ పార్లమెంటులోకి రాకుండా బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారని కాంగ్రెస్ ఎంపీలు ఓం బిర్లాను కలిసి ఫిర్యాదు చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను అమిత్‌షా అవమానించారని పేర్కొంటూ, ఆయన మీద రాజ్యసభ చైర్మన్‌కు ప్రతిపక్ష నేత ఖర్గే సభాహక్కుల ఉల్లంఘన నోటీసు సమర్పించారు. మరోవైపు.. తాము ఊరేగింపుగా వెళ్తుండగా బీజేపీ ఎంపీలే అడ్డుకున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఓ వీడియో విడుదల చేయగా.. బీజేపీ మరో వీడియో విడుదల చేసింది. గాయపడి నేల మీద కూర్చున్న బీజేపీ ఎంపీ సారంగి వద్దకు రాహుల్ రావటం, రాహుల్‌ను ఉద్దేశించి ‘మీకు సిగ్గు లేదా! మీరు గుండాలా వ్యవహరిస్తున్నారు’ అని మరో బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే వ్యాఖ్యానించటం ఆ వీడియోలో కనిపించింది. సారంగే తనను తోసివేశారని రాహుల్ అంటున్నట్లుగా ఆ వీడియోలో ఉన్నది.
గేట్ల వద్ద ఆందోళనలు చేయొద్దు: స్వీకర్
పార్లమెంట్ ప్రాంగణంలో తోపులాట నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్‌కు సంబంధించిన గేట్ల వద్ద ఆందోళనలు, నిరసనలు చేపట్టవద్దని ఎంపీలకు సూచించారు. అన్ని ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.
ప్రథమ చికిత్స చేసిన బైరెడ్డి శబరి
తలకు గాయమైన ప్రతాప్ సారంగికి టీడీపీ ఎంపీ, స్వయంగా డాక్టరైన బైరెడ్డి శబరి వెంటనే ప్రథమ చికిత్స చేస్తే మరో టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పల్నాయుడు దగ్గరుండి ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాహుల్‌గాంధీ వ్యవహరించిన తీరు సరైంది కాదని శబరి వ్యాఖ్యానించారు. 69 ఏళ్ల వృద్ధుడని చూడకుండా రాహుల్ గాంధీ తోసేశారని, రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నదంటున్నవారు ఇలాగేనా ప్రవర్తించేది అని ఆమె ప్రశ్నించారు.
ఎంపీలకు మోదీ పరామర్శ
తోపులాటలో ఒడిసాలోని బాలాసోర్ ఎంపీ ప్రతాప్ సారంగి (69), యూపీలోని ఫరూఖాబాద్ ఎంపీ ముఖేశ్‌లోధా రాజపుత్ (56)లకు గాయాలు తగలడంతో చికిత్స కోసం వారిని రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ఇరువురికీ తలకు గాయాలయ్యాయని ఆస్పత్రి సూపరింటిండెంట్ అజయ్ శుక్లా చెప్పారు. సారంగి తలకు లోతుగా గాయమైందని.. కుట్లు వేయాల్సి వచ్చిందన్నారు. కాగా ప్రధాని మోదీ ఇద్దరు ఎంపీల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, శివరాజ్ సింగ్ చౌహన్, ధర్మేంద్ర ప్రధాన్ ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు. కాగా, కాంగ్రెస్, బీజేపీలు పార్లమెంటుస్ట్రీట్‌లోని పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. తమ పార్టీ ఎంపీ ప్రతాప్ సారంగి మీద రాహుల్ దాడి చేశారంటూ బీజేపీ ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాహుల్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.