Lioness Sita with Akbar: మగసింహం అక్బర్‌తో ఆడసింహం సీత... కోర్టుకెళ్లిన వీహెచ్‌పీ
ABN , Publish Date - Feb 17 , 2024 | 07:22 PM
కోల్‌కతా: త్రిపుర నుంచి బెంగాల్ సఫారీ పార్క్ కు తీసుకువచ్చిన ఆడసింహం పేరుపై వివాదం నెలకొంది. ఆడసింహాన్ని 'సీత'గా పిలుచుకుంటున్నారని, వెంటనే పేరు మార్చాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది.
న్యూఢిల్లీ: త్రిపుర నుంచి బెంగాల్ సఫారీ పార్క్ (Bengal Safari park)కు తీసుకువచ్చిన ఆడసింహం (Lioness) పేరుపై వివాదం నెలకొంది. ఆడసింహాన్ని 'సీత'గా పిలుచుకుంటున్నారని, వెంటనే పేరు మార్చాలని విశ్వహిందూ పరిషత్ (VHP) డిమాండ్ చేసింది. జంతులకు ఇలాంటి పేర్లు పెట్టడం మతపరమైన సెంటిమెంట్లను దెబ్బతీయడమేనంటూ కోల్‌కతా హైకోర్టు జల్‌పాయ్‌గురి సర్క్యూట్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేసింది. ఆడసింహం (Sita)తో పాటు వచ్చిన సింహం పేరు 'అక్బర్' (Akbar) అని కోర్టుకు విన్నవించింది. భవిష్యత్తుల్లో జూలోని ఏ జంతువుకు దేవీ, దేవతల పేర్లు పెట్టకుండా ఆదేశించాలని పిటిషన్‌లో వీహెచ్‌పీ కోరింది.
వీహెచ్‌పీ నార్త్ బెంగాల్ యూనిట్ దాఖలు చేసిన పిటిషన్ ఈనెల 20న విచారణకు రానున్నట్టు పిటిషనర్ల తరఫు న్యాయవాది సుభాంకర్ దత్తా తెలిపారు. కాగా, జంతువుల మార్పిడి ప్రోగ్రాం కింద ఫిబ్రవరి 12న ఈ రెండు సింహాలు పార్క్‌కు వచ్చాయని, వాటికి తామెలాంటి పేర్లు పెట్టలేదని సఫారీ పార్క్ అధికారులు తెలిపారు. అధికారికంగా పేర్లు పెట్టామంటూ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమని అన్నారు. సింహాల ఒంటిపై IL26, IL27 అనే గుర్తులు వేశామని, అవి కేవలం ఐండెంటిఫికేషన్ కోడ్స్ మాత్రమేనని, పేర్లు కాదని వివరించారు.