Share News

Jharkhand : హేమంత్‌- కల్పన జయకేతన.. జంట!

ABN , Publish Date - Nov 24 , 2024 | 04:10 AM

ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని అంటారు. ఝార్ఖండ్‌లో జేఎంఎం అప్రతిహత విజయం వెనుక, మరీ ముఖ్యంగా సీఎం హేమంత్‌ సోరెన్‌ గెలుపు వెనుక

Jharkhand : హేమంత్‌- కల్పన  జయకేతన.. జంట!

  • భర్తకు బాసటగా భార్య..

  • బీజేపీ నుంచి అవమానాలు..

  • బంటీ-బబ్లీ అంటూ విమర్శలు

  • అన్నీ భరించి మరీ ప్రచారం

  • ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజల మధ్యే కల్పనా సోరెన్‌

  • సెంటిమెంటు సహా పథకాలపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం

  • అనేక ప్రతికూలతలు ఎదిరించి సక్సెస్‌ అయిన భార్యాభర్తలు

ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని అంటారు. ఝార్ఖండ్‌లో జేఎంఎం అప్రతిహత విజయం వెనుక, మరీ ముఖ్యంగా సీఎం హేమంత్‌ సోరెన్‌ గెలుపు వెనుక ఆయన సతీమణి కల్పనా సోరెన్‌ నిర్వహించిన పాత్ర ఎనలేనిదనడంలో సందేహం లేదు. గిరిజన మహిళలను తమవైపు తిప్పుకోవడంలో ఈ జంట పడిన కష్టం ఓట్ల రూపంలో ఫలితాన్నిచ్చింది. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ నుంచి సూటి పోటి మాటలు తూటాల్లా తగిలినా, బంటీ-బబ్లీ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించినా, ‘హెలికాప్టర్‌ మేడమ్‌’ అని కమలనాథులు ఎద్దేవా చేసినా కల్పనా సోరెన్‌.. తన భర్తను మరోసారి సీఎంగా చూడాలన్న పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడారు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ రాగానే ప్రచార బాట పట్టారు. ఉదయం 6నుంచి రాత్రి 10 గంటల దాకా ప్రజల మధ్యే ఉన్నారు. తన భర్తను ఈడీ అరెస్టు చేసిన విధానం, జైల్లో పెట్టిన తీరు గురించి ప్రజలకు వివరించి, సానుభూతిని ప్రోది చేశారు. గిరిజనులకు ప్రభు త్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను, మరోసారి హేమంత్‌ సీఎం అయితే.. ఒనగూరే ప్రయోజనాలను వివరించారు. వారి ఓట్లను అ నుకూలంగా మార్చుకోవడంలో సఫలీకృతులయ్యారు.


అరెస్టు తర్వాత..

మనీ లాండరింగ్‌ కేసులో సీఎం హేమంత్‌ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఈ ఏడాది జనవరి 31న అరెస్టు చేసింది. అప్పటి వరకూ ఇంటి పట్టునే ఉన్న ఆయన సతీమణి కల్పనా సోరెన్‌.. బయటికొచ్చి రాజకీయాల బాటపట్టారు. తన భర్తను అన్యాయంగా అరెస్టు చేశారని, అక్రమ కేసులు బనాయించారని అప్పటి నుంచే ప్రజలకు వివరించడం ప్రారంభించారు. సీబీఐ, ఈడీ కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారాయని.. బీజేపీని వ్యతిరేకించే పార్టీలపై వాటిని ప్రయోగిస్తున్నారని.. నిప్పులు చెరిగారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన వెంటనే ఆమె కూడా రంగంలోకి దిగి.. మొత్తం 200కు పైగా ప్రచార సభల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ముఖ్యంగా గిరిజనుల ఆత్మగౌరవ నినాదాన్ని ఎక్కువగా వినిపించారు. హేమంత్‌, కల్పనలు ఇరువురూ అలుపెరుగని ప్రచారం చేశారు. ప్రస్తుతం అమలు చేస్తున్న మెయ్యా సమ్మాన్‌ యోజన, ఆదివాసీ అస్మిత పథకాలను దంపతులు ఎక్కువగా ప్రచారం చేశారు. ఈ పథకం కింద 18-50 ఏళ్ల వయసున్న మహిళలకు ప్రతి నెలా రూ.1000 ఇస్తున్నారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే ఈ మొత్తాన్ని రూ.2500కు పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ ప్రచారం గిరిజన మహిళలను, యువతులను భారీ ఎత్తున ఆకర్షించింది.


ఒకరు పథకాలు-మరొకరు సెంటిమెంటు

హేమంత్‌-కల్పన సోరెన్‌ జంట తమ ప్రచార పర్వంలో వినూత్న పంథాను ఎంచుకున్నారు. హేమంత్‌ సోరెన్‌ బీజేపీని టార్గెట్‌ చేయగా, కల్పన తన భర్తను అన్యాయంగా జైలుకు పంపించారని, గిరిజనులపై కేంద్రం కక్షసాధింపు చర్యలు చేపడుతోందని సెంటిమెంటును రగిలించారు. ఇక, హేమంత్‌ సోరెన్‌ బీజేపీపై ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. అక్రమంగా తనను జైల్లో పెట్టారని, అసత్య ప్రచారాలు చేసేందుకు, కేసులు కట్టేందుకు బీజేపీ రూ.500 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పుకొచ్చారు. వీరివురి వాగ్ధాటి, సెంటిమెంటు ముందు బీజేపీ నిలబడలేక పోయింది. వెరసి హేమంత్‌-కల్పనలు ఝార్ఖండ్‌ విజయంలో శక్తిమంతమైన జంటగా నిలిచారు.


ఎన్నో ప్రతికూలతలు!

భర్తకు బాసటగా నిలిచిన కల్పనా సోరెన్‌కు ప్రచార పర్వంలో ఎన్నో ప్రతికూలతలు ఎదురయ్యాయి. ప్రతిపక్షం బీజేపీ సంధించిన ప్రశ్నలు, చేసిన విమర్శలు అగ్నిపరీక్షగా మారాయి. హేమంత్‌ జైలుకు వెళ్లిన తర్వాత పార్టీ విధేయుడిగా ఉన్న చంపయి సోరెన్‌ను సీఎంను చేశారు. హైకోర్టు బెయిల్‌ ఇవ్వడంతో జూన్‌ 28న హేమంత్‌ జైలునుంచి బయటకొచ్చారు. అనంతరం చంపయితో రాజీనామా చేయించి తిరిగి సీఎం పీఠం ఎక్కారు. ఈ విషయాన్ని బీజేపీ హైలెట్‌ చేస్తూ గిరిజనుడైన చంపయిని హేమంత్‌ అవమానించారంటూ విస్తృతంగా ప్రచారం చేసింది. అదేసమయంలో చొరబాటు దారుల పట్ల హేమంత్‌ ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరిస్తోందనీ ఆరోపించింది. మరోవైపు హేమంత్‌ సోదరుడి భార్య సీతా సోరెన్‌ బీజేపీకి అనుకూలంగా మారిపోయారు. చంపయి సోరెన్‌ కూడా కమలం గూటికి చేరిపోయారు. ఇక, సోరెన్‌ల కుటుంబానికి అత్యం త విధేయుడిగా పేరున్న లోబిన్‌ హెమ్‌బ్రామ్‌ కూడా బీజేపీకి అనుకూలంగా మారారు. వీరు కూడా హేమంత్‌, కల్పన దంపతులను టార్గెట్‌ చేసుకున్నారు. అయినా.. కల్పన, హేమంత్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

Updated Date - Nov 24 , 2024 | 08:18 AM