Puja Khedkar: మనోరమా కేడ్కర్ తుపాకీతో హల్‌చల్.. వీడియో వైరల్
ABN , Publish Date - Jul 12 , 2024 | 01:39 PM
పుణె ట్రైనీ ఐఏఎస్ పూజా కేడ్కర్ అధికార దుర్వినియోగం నేపథ్యంలో ఆమెపై మహారాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆమె తల్లి మనోరమా కేడ్కర్ రైతులను తుపాకీతో బెదిరిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరలవుతోంది.
పుణె, జులై 12: పుణె ట్రైనీ ఐఏఎస్ పూజా కేడ్కర్ అధికార దుర్వినియోగం నేపథ్యంలో ఆమెపై మహారాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆమె తల్లి మనోరమా కేడ్కర్ రైతులను తుపాకీతో బెదిరిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరలవుతోంది. పుణెలోని ముల్షీ తాశీల్‌లో 25 ఎకరాల భూమిని కేడ్కర్ కుటుంబం కొనుగోలు చేసింది. ఆ క్రమంలో పక్కనున్న రైతుల భూమి సైతం ఆ భూమిలో కలిసింది. దీంతో ఆ భూమి యజమాని అయిన రైతు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో బౌన్సర్‌ని వెంటపెట్టుకుని మనోరమా కేడ్కర్.. వ్యవసాయ భూమి వద్దకు చేరుకున్నారు.
ఈ సందర్బంగా తుపాకీ చూపిస్తూ రైతును ఆమె బెదిరించింది. అయితే ఈ వ్యవహారం కోర్టులో ఉందని మనోరమకు రైతు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ భూమి నిజమైన యజమానివి నివేనా? కానీ ఈ స్థలం తన పేరు మీద ఉందని అతడికి స్పష్టం చేసింది. అయినా ఈ వ్యవహారం కోర్టులో ఉంటే ఏమిటి? నేను ఎవరికీ భయపడనంటూ అతడికి సమాధానం ఇచ్చింది. దీంతో కోర్టు నిర్ణయం ఇప్పడప్పుడే రాదని రైతు పేర్కొనగా.. అయితే ఈ భూమికి అసలు యజమానిని నేనేనంటూ మనోరమ పేర్కొంది. ఈ ఘటన గతేడాది అంటే.. 2023లో జరిగిందని సమాచారం. నాటి వీడియో.. నేడు వైరల్ అవుతుంది. ఇక కేడ్కర్ ఫ్యామిలీకి మహారాష్ట్రలో భారీగా ఆస్తులున్నట్లు ఓ ప్రచారం సైతం సాగుతుంది.
మరోవైపు అధికార దుర్వినియోగానికి పాల్పడిన పుణె ట్రైనీ కలెక్టర్ పూజా కేడ్కర్‌ను వాషిమ్‌కు బదిలీ చేసింది. ఆమె తండ్రి దిలీప్ కేడ్కర్ సైతం రిటైర్డ్ సివిల్ సర్వెంట్ అధికారి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా ఆయన పోటీ చేశారు. తన ఆస్తి రూ. 40 కోట్లు ఉందంటూ తన ఎన్నికల అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. అయితే పూజా కేడ్కర్ ఓబీసీ రిజర్వేషన్‌తోపాటు అంధత్వం, మానసికి వైకల్యం కోటాలో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. అదీకాక పుణె ట్రైనీ కలెకర్ట్ పూజా కేడ్కర్ గొంతెమ్మ కోర్కెలు కోరడం.. వాటిని అమలు చేయాలంటూ పుణె జిల్లా కలెక్టర్‌పై ఆమె తండ్రి దిలీప్ కేడ్కర్ ఒత్తిడి తీసుకురావడం జరిగేది.
ఇక పూజా కేడర్క్ అధికార దుర్వినియోగం ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో.. ఆ కుటుంబంలోని వ్యక్తుల ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తొలుత పూజా కేడ్కర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అనంతరం ఆమె తండ్రి దిలీప్ కేడ్కర్ వ్యవహరం బయటకు వచ్చింది. తాజాగా ఆమె తల్లి మనోరమా సైతం రైతుకు తుపాకీతో బెదిరిస్తున్న వీడియో అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంకో వైపు ట్రైనీ ఐఏఎస్ పూజా కేడ్కర్‌పై ఆరోపణలు వెల్లువెత్తడంతో.. కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆమె వ్యవహారంపై విచారణ జరిపేందుకు ఏక సభ్య కమిటిని నియమించింది. ఈ అంశంపై రెండు వారాల్లో నివేదిక అందజేయాలని సదరు కమిటీని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News