ఫుట్‌బాల్ మ్యాచ్ రణరంగం
ABN , Publish Date - Dec 03 , 2024 | 04:30 AM
పశ్చిమాఫ్రికా దేశం గినీలో ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
గినీలో 100 మంది మృతి.. వీధులు రక్తసిక్తం
తీవ్ర వివాదానికి దారితీసిన రిఫరీ నిర్ణయం
ఇరు వర్గాల ఘర్షణ.. పలువురికి గాయాలు
జెరెకొరె, డిసెంబరు 2: పశ్చిమాఫ్రికా దేశం గినీలో ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అభిమానులు పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో దాదాపు వంద మంది వరకు మృతి చెందగా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. గినీ మిలటరీ జుంటా నేత మమాడీ దౌమబోయా గౌరవార్థం దేశంలోని రెండో అతిపెద్ద నగరం జెరెకొరెలో ఫుట్‌బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ మధ్యలో రిఫరీ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమైంది. దీన్ని వ్యతిరేకించిన ఓ జట్టు అభిమానులు మైదానంలోకి దూసుకెళ్లారు. దీంతో అవతలి జట్టు అభిమానులు వీరిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఘర్షణ చెలరేగింది. వేలాది మంది అభిమానులు వీధులోకి వచ్చి పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.