Share News

Chandipura Virus: విజృంభిస్తున్న చండీపురా వైరస్.. లక్షణాలు, చికిత్స ఏంటి?

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:10 PM

దేశవ్యాప్తంగా చండీపురా వైరస్(Chandipura Virus) విజృంభిస్తోంది. ఇటీవలే గుజరాత్‌లో పదుల సంఖ్యలో వైరస్ కేసులు బయట పడగా.. తాజాగా నాలుగేళ్ల బాలిక మృతి చెందినట్లు పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) ధ్రువీకరించింది.

Chandipura Virus: విజృంభిస్తున్న చండీపురా వైరస్.. లక్షణాలు, చికిత్స ఏంటి?

ఢిల్లీ: దేశవ్యాప్తంగా చండీపురా వైరస్(Chandipura Virus) విజృంభిస్తోంది. ఇటీవలే గుజరాత్‌లో పదుల సంఖ్యలో వైరస్ కేసులు బయట పడగా.. తాజాగా నాలుగేళ్ల బాలిక మృతి చెందినట్లు పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) ధ్రువీకరించింది. బాలికతో నేరుగా కాంటాక్ట్ అయిన15 మందిని అధికారులు క్వారంటైన్‌లో ఉంచారు.

ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 జిల్లాల్లో 29 కేసులు నమోదయ్యాయి. ఇందులో గుజరాత్‌లో 26, రాజస్థాన్‌లో రెండు, మధ్యప్రదేశ్‌లో ఒకటి చొప్పున ఉన్నాయి. చండీపురా (CHPV) వైరస్ తొలిసారిగా మహారాష్ట్రలోని చండీపురా గ్రామంలో కనుగొన్నారు. ఈ వైరస్ గుజరాత్‌తో సహా దేశంలోని వివిధ రాష్ట్రాలను ప్రభావితం చేసింది. ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా పిల్లల్లో ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెచ్చరించింది.


చండీపురా వైరస్ అంటే ఏమిటి?

మహారాష్ట్ర(Maharashtra) నాగ్‌పూర్‌లోని చండీపురా గ్రామంలో 1966లో 15 ఏళ్లలోపు పిల్లలు చనిపోతున్నారు. వైరస్ కారణంగానే ఈ మరణాలు సంభవించాయని వైద్యులు వెల్లడించారు. అలా దీనికి చండీపురా వైరస్ అని పేరు పెట్టారు. ఆ తరువాత 2004, 2006, 2019లలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఈ వైరస్ వ్యాప్తి చెందింది.

ఆ సమయంలో 56-75 శాతం మరణాలు సంభవించాయి. చండీపురా వైరస్ అనేది ఆర్‌ఎన్‌ఏ వైరస్. ఇది ఎక్కువగా ఆడ ఫ్లెబోటోమైన్ ఫ్లై ద్వారా వ్యాపిస్తుంది. ఈడిస్ దోమ దీని వ్యాప్తికి కారణం. 2024 జూన్ ప్రారంభం నుంచి గుజరాత్‌లో 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో వైరస్ కేసులు నమోదయ్యాయి.


పెరుగుతున్న కేసులు

ఈ కేసుల వ్యాప్తిపై విచారణ అవసరమని గుజరాత్ అధికారులు అన్నారు. ఇందుకు రాష్ట్రానికి సహకరించేందుకు కేంద్ర బృందం రంగంలోకి దిగింది. వైరస్ సంక్రమణ దృష్ట్యా, ఆరోగ్య శాఖ బృందాలు మొత్తం 17,248 ఇళ్లలోని 1,21,826 మందిని పరీక్షించాయి.

లక్షణాలు

చండీపురా వైరస్ కారణంగా రోగికి ప్రాథమికంగా జ్వరం, విరేచనాలు వస్తాయి. ఫ్లూ లక్షణాలతోపాటు తీవ్రమైన మెదడువాపు వ్యాధిని కలిగి ఉంటారు. ఈ వైరస్ దోమలు, ఈగలు, కీటకాల ద్వారా వ్యాపిస్తుంది. అనేక రకాల వైరస్‌లు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, రసాయనాలు/టాక్సిన్‌లు మొదలైన వాటి వల్ల చండీపురా వ్యాధి ఏర్పడుతుంది. వర్షాకాలంలో ఇది ఎక్కువగా వ్యాపిస్తుంది.


వ్యాక్సిన్ ఉందా..

ప్రస్తుతం చండీపురా వైరస్‌కు యాంటీవైరల్ చికిత్స లేదా వ్యాక్సిన్ లేదు. రోగాన్ని సకాలంలో గుర్తించి అత్యవసర చికిత్స అందించాలి. వ్యాధి తీవ్రమైన వారికి ఆక్సిజన్ థెరపీ, వెంటిలేషన్ ద్వారా చికిత్స అందిస్తారు.

ప్రభుత్వం అప్రమత్తం..

వ్యాధి నివారణకు వీధుల్లో మలాథియాన్ పౌడర్‌ను పిచికారీ చేసేలా ప్రచారం నిర్వహించాలని గుజరాత్ సీఎం భూపేంద్రబాయ్ పటేల్ అధికారులను ఆదేశించారు. రోగులకు జ్వరం వచ్చిన వెంటనే ఐసీయూలో చికిత్స అందించాలని అధికారులను కోరారు. ఈ మహమ్మారిని నివారించడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముందుకు సాగాలని గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి హృషికేష్ పటేల్ సూచించారు.

For Latest News and National News click here

Updated Date - Jul 27 , 2024 | 12:10 PM