Dermatomyositis: అసలేంటీ డెర్మాటోమయోసైటిస్.. ఈ వ్యాధి లక్షణాలు ఏంటి?
ABN , Publish Date - Feb 18 , 2024 | 03:33 PM
బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమా ‘దంగల్’లో ఆమిర్ ఖాన్ కూతురి(యంగ్ బబితా ఫోగట్)గా నటించిన సుహానీ భట్నాగర్ శుక్రవారం మృతిచెందిన విషయం తెలిసిందే. ‘డెర్మటోమయోసైటిస్’ అనే అరుదైన వ్యాధితో పోరాడుతూ.. 19 ఏళ్ల వయసులోనే ఆమె తనువు చాలించింది.
బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమా ‘దంగల్’లో ఆమిర్ ఖాన్ కూతురి(యంగ్ బబితా ఫోగట్)గా నటించిన సుహానీ భట్నాగర్ శుక్రవారం మృతిచెందిన విషయం తెలిసిందే. ‘డెర్మటోమయోసైటిస్’ అనే అరుదైన వ్యాధితో పోరాడుతూ.. 19 ఏళ్ల వయసులోనే ఆమె తనువు చాలించింది. రెండు నెలల క్రితం సుహానిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించగా.. పది రోజుల కిందటే ఆమె ఈ వ్యాధి బారిన పడినట్లు నిర్దారణ అయ్యింది. అయితే అప్పటికే ఆలస్యం అయిపోవడంతో.. ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఈ నేపథ్యంలోనే.. ‘డెర్మటోమయోసైటిస్’ అంటే ఏంటి? ఈ వ్యాధి లక్షణాలు ఏంటి? అనేది చర్చనీయాంశంగా మారింది. పదండి.. ఆ వివరాలేంటో ఈ వార్తలో తెలుసుకుందాం.
డెర్మాటోమయోసైటిస్
‘జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్’ అధికారిక పేజీ ప్రకారం.. డెర్మాటోమయోసైటిస్ అనేది వాపు, చర్మంపై దద్దుర్లు కలిగించే అరుదైన వ్యాధి. ఈ వ్యాధి వచ్చినప్పుడు మొదట్లో ఒక కండరాల సమూహం వాపుకు గురవుతుంది. ఈ అరుదైన వ్యాధి ఇతర కండరాల వ్యాధుల కన్నా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే.. ఇది చర్మ సంబంధిత సమస్యలను మాత్రమే కలిగిస్తుంది. ప్రైవేట్ రీసెర్చ్ విశ్వవిద్యాలయం నివేదిక ప్రకారం.. ఈ వ్యాధి ఏ వయస్సులోనైనా రావొచ్చని, తరచుగా 50-70 సంవత్సరాల వయస్సు ఉన్న పెద్దలనే ఎక్కువగా ప్రభావితం చేస్తుందని తెలిసింది. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు.. లూపస్ లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి బంధన కణజాల రుగ్మతను కలిగి ఉండే అవకాశం ఉంది.
రక్తనాళాల్లో వాపు, కండరాల వాపు వల్ల డెర్మటోమయోసైటిస్ లక్షణాలు వస్తాయని జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ నివేదిక పేర్కొంది. దీని లక్షణాల్లో భాగంగా చర్మంపై ఎరుపు లేదా ఊదారంగ దద్దుర్లు వస్తాయని.. వాటిపై సూర్యరశ్మి పడినప్పుడు చాలా బాధాకరంగానూ, దురదగానూ అనిపిస్తుందని తెలిపింది. పై కనురెప్పల్లో వాపు.. పిడికిలి, మోచేతులు, మోకాలు కాలి వేళ్లపై ఒకే విధమైన రంగు మచ్చలు.. చర్మం గరుకుగా మారడం.. జుట్టు పల్చబడటం, గట్టిపడటం వంటి మొదలైనవి ఈ వ్యాధి లక్షణాలని ఆ నివేదిక వెల్లడించింది. పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడతారని, లక్షణాలు సైతం రెండింతలు ఉంటాయని ఈ నివేదిక స్పష్టం చేసింది.
సుహాని తండ్రిదండ్రుల ఆవేదన
తన కూతురు సుహాని మృతిపై తండ్రి సుమిత్ భట్నాగర్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా కేవలం ఐదు నుండి ఆరు మంది మాత్రమే ఈ వ్యాధితో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఇన్ఫెక్షన్‌తో పాటు అదనపు ద్రవం చేరడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని.. ఆమెను వెంటిలేటర్‌పై ఉంచినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. అనంతరం తల్లి పూజ మాట్లాడుతూ.. రెండు నెలల క్రితం సుహాని చేతులపై ఎర్రటి మచ్చ ఏర్పడిందని, ఆ సమయంలోనే తాము వివిధ ఆసుపత్రుల్లోని వైద్యుల్ని సంప్రదించామని చెప్పారు. అయితే.. ఆ వ్యాధి ఏంటనేది నిర్ధారించలేకపోయారన్నారు.