Manmohan Singh: తానో మౌన ముని అన్న విమర్శపై మన్మోహన్ సింగ్ స్పందన ఏంటంటే..
ABN , Publish Date - Dec 27 , 2024 | 02:06 PM
ఆర్థికవేత్తగా, ప్రధానిగా అపార ప్రతిభాపాటవాలు కనబరిచిన మౌన మునిగా కూడా కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. అనేక సందర్భాల్లో ఆయన మౌనంగా ఉండిపోవడంపై ప్రతిపక్షాలు అనేక సార్లు ఆయన్ను టార్గెట్ చేసుకునేవి. దీనికి ఆయన 2018లో దీటైన సమాధానం ఇచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్తమయంతో యావత్ దేశం శోకసంద్రంలో కూరుకుపోయింది. విచారంలో ఉన్న దేశవాసులు అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. ఆర్థికవేత్తగా, ప్రధానిగా అపార ప్రతిభాపాటవాలు కనబరిచిన ఆయన మౌన ముని అన్న విమర్శను కూడా ఎదుర్కొన్నారు. అనేక సందర్భాల్లో ఆయన మౌనంగా ఉండిపోవడంపై ప్రతిపక్షాలు ఆయన్ను టార్గెట్ చేసుకునేవి. దీనికి ఆయన 2018లో దీటైన సమాధానం ఇచ్చారు (Manmohan Singh).
ఆర్థికవేత్తగా, ప్రధానిగా మన్మోహన్ సింగ్ తన ప్రయాణంలోని కీలక ఘట్టాలతో కూడిన ఆరు పుస్తకాలను ఛేజింగ్ ఇండియా పేరిట విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తనపై ఎదుర్కొన్న విమర్శలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Viral: డా.మన్మోహన్ సింగ్ రెజ్యూమే నిజంగా స్ఫూర్తివంతం.. ప్రముఖ కమెడియన్ ప్రశంస
‘‘నేను మౌన ప్రధాని అని విమర్శించేవారు. కానీ నేను ఏమిటన్నది ఈ పుస్తకాల్లో స్పష్టంగా తెలుస్తుంది. నేనేమీ పత్రికా సమావేశాలకు భయపడేవాడిని కాదు. విలేకరులను నిత్యం కలుస్తుండేవాణ్ణి. విదేశీ పర్యటనలు ముగించుకొచ్చిన ప్రతిసారీ పత్రికా సమావేశం నిర్వహించేవాడిని. నాటి పత్రికా సమావేశాల తాలుకు చర్చల సారాంశాలు అనేకం ఈ పుస్తకాల్లో ఉన్నాయి’’ అని ఆయన పేర్కొన్నారు.
భారత దేశం గర్వించదగ్గ ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న నేటి పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో గల గాహ్ గ్రామంలో జన్మించారు. విద్యుత్ సౌకర్యం లేని చోట పుట్టిన ఆయన చిన్నతనం నుంచే చదువుల్లో అపార ప్రతిభాపాటవాలు కనబరిచారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఫస్ట్ క్లాస్‌లో ఎకనామిక్స్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డీఫిల్ పట్టా పొందారు. పంజాబ్ యూనివర్సిటీలో ఉపాధ్యాయుడిగా తన వృత్తి జీవితం ప్రారంభించిన మన్మోహన్ సింగ్ ఆ తరువాత ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో కూడా విధులు నిర్వర్తించారు. అనంతరం ప్రజాజీవితంలోకి ప్రవేశించారు.
Manmohan Singh: ఆర్థిక మార్గదర్శి అస్తమయం
1991లో మన్మోహన్ సింగ్‌ను ఆర్థికమంత్రిగా అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు నియమించడం దేశ చరిత్రలో ఓ కీలక మైలురాయి అని చరిత్రకారులు అభివర్ణిస్తారు. దేశం ఆర్థికంగా కుప్పకూలే స్థితిలో ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ పగ్గాలు చేపట్టిన మన్మోహన్ సింగ్ భారీ స్థాయిలో సరళీకరణ విధానాలు ప్రవేశపెట్టారు. ఒకప్పటి లైసెన్స్ రాజ్‌కు ముగింపు పలుకుతూ ప్రైవేటు రంగానికి కొత్త ఊపిరులూదారు. ఈ సంస్కరణల ఫలితంగా మళ్లీ నిలదొక్కుకున్న భారత్.. కుదవుపెట్టుకున్న బంగారు నిల్వలను మళ్లీ వెనక్కు తెచ్చుకోగలిగింది. తన సంస్కరణలతో దేశాన్ని గాడిలో పెట్టిన ఆయన ఆధునిక భారత రూపశిల్పిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.
Read More National News and Latest Telugu News