200 సీట్లైనా గెలవండి.. చూద్దాం
ABN , Publish Date - Apr 01 , 2024 | 04:13 AM
లోక్‌సభ ఎన్నికల్లో 400లకు పైగా సీట్లు గెలుస్తామని చెబుతున్న బీజేపీ కనీసం 200 సీట్లైనా గెలిచి చూపాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ సవాల్ విసిరారు.
బీజేపీకి మమతాబెనర్జీ సవాల్
కృష్ణానగర్(పశ్చిమ బెంగాల్), మార్చి 31: లోక్‌సభ ఎన్నికల్లో 400లకు పైగా సీట్లు గెలుస్తామని చెబుతున్న బీజేపీ కనీసం 200 సీట్లైనా గెలిచి చూపాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ సవాల్ విసిరారు. ఆదివారం కృష్ణానగర్ ప్రాంతంలో టీఎంసీ అభ్యర్థి మహువా మొయిత్రా తరఫున ఆమె ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. బీజేపీని జుమ్లా పార్టీ అని అన్నారు. ‘‘2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ 200 సీట్లు గెలుస్తామని బీజేపీ గొప్పలు చెప్పుకుంది. కానీ 77 సీట్లకే పరిమితమయ్యింది’’ అని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలును అనుమతించబోమని మమతాబెనర్జీ స్పష్టం చేశారు. సీఏఏకు దరఖాస్తు చేసుకుంటే 5 ఏళ్లు విదేశీయులుగా మారుతారని, కాబట్టి ఎవరూ దరఖాస్తు చేసుకోవద్దని ఆమె కోరారు. రాష్ట్రంలో సీపీఐ(ఎం), కాంగ్రె్‌సలు బీజేపీ కోసం పనిచేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో వామపక్ష-కాంగ్రె్‌స-ఐఎ్‌సఎఫ్ కూటమి అభ్యర్థులకు ఓటు వెయ్యొద్దని, వారికి ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని మమతాబెనర్జీ చెప్పారు.