Sushmita Musunuru : స్పందించే హృదయం
ABN , Publish Date - Nov 11 , 2024 | 02:54 AM
ఎప్పుడూ సమాజం నుంచి ఆశించడమేనా? సమాజానికి మనం తిరిగి ఏమిస్తున్నాం? ఈ ప్రశ్న బాల్యంలోనే ఆమెను ప్రభావితం చేసింది. అది మొదలు... బడుగు జీవుల బతుకు బాగుకు... మహిళా సాధికారతకే కాదు... కాలుష్యం లేని ప్రకృతి కోసం...
ఎప్పుడూ సమాజం నుంచి ఆశించడమేనా? సమాజానికి మనం తిరిగి ఏమిస్తున్నాం? ఈ ప్రశ్న బాల్యంలోనే ఆమెను ప్రభావితం చేసింది. అది మొదలు... బడుగు జీవుల బతుకు బాగుకు... మహిళా సాధికారతకే కాదు... కాలుష్యం లేని ప్రకృతి కోసం... సహజ ఇంధన వనరులను భావితరాలకు అందించడం కోసం... నిరంతరం శ్రమిస్తున్నారు. నిస్వార్థ సేవలకు గానూ ఇటీవలే ‘సరోజినీనాయుడు అంతర్జాతీయ అవార్డు’ అందుకున్న సామాజిక కార్యకర్త, పర్యావరణవేత్త, అమెరికాలో తెలుగు పారిశ్రామికవేత్త... సుస్మిత ముసునూరు అంతరంగం ఇది.
‘‘చుట్టూ ఉన్న మనుషులు, వాళ్ల స్థితిగతులు... ఊహ తెలిసినప్పటి నుంచీ సామాజిక అంశాలతోనే ముడిపడింది నా జీవితం. వయోధికులకు చదువు చెప్పడం, ఎయిడ్స్ బాధితులకు అండగా నిలవడం, మహిళలకు వృత్తి విద్యలు నేర్పడం... ఇలా వారి అభ్యున్నతికి తోడ్పాటునిచ్చేందుకు నావంతు కర్తవ్యం నిర్వర్తిస్తున్నాను. పర్యావరణ పరిరక్షణలో భాగమయ్యాను. దశాబ్దాలుగా సాగుతోంది ఈ ప్రయాణం. వీటన్నిటికీ గుర్తింపుగా ఇటీవల ప్రతిష్ఠాత్మక ‘డాక్టర్ సరోజినీనాయుడు అంతర్జాతీయ అవార్డు’ అందుకున్నాను. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో అత్యున్నత సేవలు అందించిన మహిళలకు ఏటా ఈ పురస్కారం ఇస్తారు. ‘చాంబర్ ఆఫ్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ర్టీ, ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఫిలిమ్ ఫోరమ్, ఏఏఎ్‌ఫటీ యూనివర్సిటీ’ సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నాయి.
అది ఉంటే చాలు...
నేనూ అందరిలాంటి అమ్మాయినే. కాకపోతే మన చుట్టూ ఉన్నవారు బాధలు పడుతుంటే మనకెందుకులే అని వదిలేయలేను. నాలో ‘నేను’ అనే ఆలోచన తక్కువ. ‘మనం’ అనే భావన కొంచెం ఎక్కువ. స్పందించే హృదయం ఉంటే చాలు... ఎవరైనా ఈమాత్రం సాయం చేయగలరనేది నా అభిప్రాయం. అయితే ఇవాళ చాలామందిలో ‘నేను, నా కుటుంబం బాగుంటే చాలు’ అనే ధోరణి గమనించాను. నా ఈ అవార్డు అలాంటివారిలో కొంతైనా మార్పు తీసుకురాగలిగితే... సమాజానికి మేలు జరిగినట్టే.
అప్పుడే మొదలైంది...
నాలో ఈ సేవా దృక్పథం రావడానికి కారణం... నేను పెరిగిన నేపథ్యం. మా అమ్మమ్మావాళ్లది గుంటూరు. అక్కడే పుట్టాను. అయితే పెరిగిందంతా హైదరాబాద్‌లో. మా పెద్దమ్మ, పిన్నీవాళ్లు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, వయోజన విద్య విభాగాల్లో పని చేసేవారు. ఆ వాతావరణంలో పెరిగాను కదా... నాకు ఎనిమిదేళ్లు వచ్చేసరికి మా చుట్టుపక్కల ఉన్న పెద్దవారికి చదువు చెప్పేదాన్ని. కాలేజీకి వచ్చేసరికి వయోజన విద్య తదితర ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగమయ్యాను. డిగ్రీలో ఉండగా ఎయిడ్స్ బాధితుల కోసం పని చేశాను. అప్పట్లో ఒక కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతడిని చూసేందుకు ఆసుపత్రికి వెళితే... ఒకే డిస్పోజబుల్ ఇంజక్షన్ సూదిని చాలామందికి ఉపయోగించడం కనిపించింది. ప్రభుత్వం ఇచ్చిన డిస్పోజబుల్ నీడిల్స్ స్టాక్‌ను బయట అమ్మేసుకుంటున్నారు. ఎయిడ్స్ లాంటి వైర్‌సల వ్యాప్తికి ఇలాంటి దారుణాలే కారణం. తమకు వైరస్ ఎలా సోకిందో తెలుసుకోకుండా చాలామంది ఆత్మహత్యలు చేసుకునేవారు. దీనిపై సరైన అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో పలు కార్యక్రమాలు తలపెట్టాను. ఆశ్చర్యమేమంటే... మా లెక్చరర్లు నిరుత్సాహపరిచినా, మా తరగతిలో అమ్మాయిలందరూ ముందుకు వచ్చారు. ఎప్పుడైతే ఆడపిల్లలు కదిలారో... అప్పటి నుంచి అబ్బాయిలు కూడా మాతో జత కలిశారు.
అమెరికా వెళ్లినా...
డిగ్రీ అవ్వగానే ఎంబీఏ కోసం అమెరికా వెళ్లాను. తరువాత అక్కడే స్థిరపడ్డాను. మావారిది ఐటీ రంగం. దాదాపు పాతికేళ్లుగా యూఎ్‌సలోనే నా నివాసం. అయితే తరచూ భారత్‌కు వచ్చి వెళుతుంటాను. అక్కడ సంపాదించినదాంట్లో అత్యధిక భాగం ఇక్కడి సేవా కార్యక్రమాల కోసమే ఖర్చు చేస్తున్నా. అమెరికాలో ప్రస్తుతం నాకు ‘మిడ్‌వెస్ట్ గ్రీన్‌టెక్’ కంపెనీ ఉంది. సౌర, పవన విద్యుత్ ఉపకరణాలకు సంబంధించిన సంస్థ ఇది. 2001లో ఐటీ సంస్థగా ప్రారంభమైన మా కంపెనీ, కాలక్రమంలో ఇలా మారింది.
భావితరాల కోసం...
నేను ఈ రంగంలోకి రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. నాకు మొదటి నుంచీ పర్యావరణంపై ప్రేమ ఎక్కువ. భారత్‌లో కొన్ని గ్రామాలు దత్తత తీసుకుని, వాటిల్లో వేల మొక్కలు నాటాను. చెట్ల వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూనే, అవి లేకపోతే సంభవించే దుష్పరిణామాలపై స్థానికులకు అవగాహన కల్పిస్తున్నాను. పెట్రోల్, బొగ్గు వంటి శిలాజ ఇంధనాలను భవిష్యత్ తరాలకు లేకుండా మనం విచ్చలవిడిగా వాడేస్తున్నాం. జల, వాయు, సౌర తదితర ప్రత్యామ్నాయ ఇంధనాలు మనకు విస్తారంగా అందుబాటులో ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకొని, శిలాజ ఇంధనాలను పొదుపు చేస్తే భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడతాయి. ఈ ఆలోచనతోనే నేను ‘మిడ్‌వెస్ట్ గ్రీన్‌టెక్’ కంపెనీ నెలకొల్పాను.
ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు...
నా లక్ష్యం గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడం. ఇప్పటికే చూస్తున్నాం... ఢిల్లీ కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. భూగోళాన్ని నాశనం చేస్తున్నది ఎవరో కాదు... మానవులు మాత్రమే. మన విధ్వంసంతో మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. భవిష్యత్తు తరాలకు మనం ఆస్తులు ఇవ్వకపోయినా పరవాలేదు... కానీ ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని ఇవ్వగలగాలి. అదే వారికి పెద్ద వరం అవుతుంది. దాని కోసమే నేను సోలార్, విండ్, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్‌కు ప్రాధాన్యమిస్తున్నా. అమెరికాతో పాటు భారత్‌లో కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్నా.
మహిళా సాధికారత...
ఏ ఆధారం లేని పిల్లలకు విద్య, అట్టడుగు వర్గాల మహిళల సాధికారతకు నిరంతరం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. వీధుల్లో, రైల్లే స్టేషన్ల దగ్గర కాగితాలు ఏరుకొంటూ, బిచ్చమెత్తుతూ కనిపించిన చిన్నారులకు రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి ఏర్పాటు చేశాం. తల్లితండ్రులు లేని కొందరు పిల్లలను దత్తత తీసుకున్నాను. వాళ్లకు నేనే అమ్మను. ‘మాకూ అమ్మ ఉంది’ అని నన్ను చూసినప్పుడు వాళ్ల ముఖంలో కనిపించే ఆనందం వెల కట్టలేనిది. నాతో ఎంతో ఆప్యాయంగా ఉంటారు. అలాగే మహిళలకు కుట్టు పనిలాంటివి కాకుండా డిమాండ్ ఉన్న మగ్గం వర్క్ నేర్పించాను. దానివల్ల ఒక చీరను నాలుగైదు రోజుల్లో తయారు చేయవచ్చు. ఆర్థిక స్థోమత లేని చాలామంది అమ్మాయిలను కాలేజీల్లో చేర్పించాను. పైచదువుల కోసం కొందరిని విదేశీ వర్సిటీలకు పంపించాను. వీటన్నిటికీ నా సొంత డబ్బు ఖర్చు చేశాను. ఎవరి నుంచీ చందాలు తీసుకోలేదు. అంతేకాదు... నేను హెర్బల్ రీసెర్చ్ అవీ చేస్తుంటాను. కరోనా సమయంలో నానో టెక్నాలజీతో అభివృద్ధి చేసిన మెడిసిన్‌ను వ్యాపార కోణంలో కాకుండా... ఇక్కడ ఉచితంగా ఇచ్చాను. దీని కోసం మూడేళ్లు పూర్తిగా భారత్‌లోనే ఉన్నాను.
నాలానే మా అమ్మాయి...
నిజానికి నాకు పిల్లలు వద్దనుకున్నాను. ఎందుకంటే ఎంతోమంది అనాథ పిల్లలను చేరదీస్తున్నా. వారంతా నా పిల్లలే కదా. ‘ఇంతమందిని దత్తత తీసుకొనే అవకాశం ఉన్నప్పుడు మళ్లీ నేను పిల్లల గురించి ఎందుకు ఆలోచించాలి’ అనుకున్నాను. కానీ మా అమ్మానాన్నలు, పెద్దలు ‘నీకు అక్కర్లేకపోతే మాకు ఇవ్వు. మాకూ మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకోవాలని ఉంటుంది కదా’ అన్నారు. అలా మా అమ్మాయి దీక్ష పుట్టింది. విశేషమేమంటే ఇప్పటివరకు మా అమ్మాయిని బడికి పంపలేదు. ఒకవేళ స్కూలుకు వెళ్లివుంటే తనను వదిలేసి నేను ఇలా తరచూ భారత్‌కు వచ్చి వెళ్లగలిగేదాన్ని కాదు. దీక్షది కూడా నాలానే... స్పందించే హృదయం. వండర్ కిడ్‌గా ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందింది. ఎనిమిదేళ్లకే టెన్త్ పరీక్షలు రాసింది. ప్రస్తుతం తనకు పన్నెండేళ్లు. ఇంటర్ చదువుతోంది. సేవ చేసే అవకాశం నాకు దొరికిన ఒక మంచి అవకాశం అయితే... దీక్ష పుట్టడం దేవుడు ఇచ్చిన వరం.’’
-హనుమా
చంపుతామని బెదిరించినా...
అప్పట్లో యాదగిరిగుట్ట ప్రాంతంలో చిన్నారులను బలవంతంగా వేశ్య వృత్తిలోకి దించుతున్న వారిపై పోరాడాను. అక్కడికి వెళ్లి, వీడియోలు తీసి, వాటిని పోలీసులు, సంబంధిత అధికారులకు ఇచ్చేదాన్ని. కళాశాలల విద్యార్థులను కలుపుకొని, మానవహారాలు, ధర్నాలవంటివి నిర్వహించాం. నన్ను చంపుతామని బెదిరింపులు, హెచ్చరికలు చాలా వచ్చాయి. వేటికీ బెదరలేదు. చిన్న పిల్లలు... ఎక్కడికీ వెళ్లలేక, తమ ముఖం ఎవరికీ చూపించలేక వేదన అనుభవించేవారు. అవన్నీ తలుచుకొంటే నాకు ఇప్పటికీ నిద్ర పట్టదు. మొత్తంమీద మా ప్రయత్నం ఫలితాన్నిచ్చింది. కొన్నిటిని కోర్టు సుమోటోగా తీసుకుంది. పోలీసులు, అధికారులు, కోర్టుల సహకారంతో చాలామంది బాలికలకు విముక్తి లభించింది.