Share News

Navya : నేరేడు పండ్ల పానకం

ABN , Publish Date - Jun 22 , 2024 | 01:47 AM

During times when apricot fruits are not available, tea can be brewed with apricot leaves in water

Navya : నేరేడు పండ్ల పానకం

నేరేడు ఆకులతో...

నేరేడు పండ్లు దొరకని కాలంలో నేరేడు ఆకుల్ని నీళ్లలో వేసి టీ కాచుకుని తాగవచ్చు. పండులోని గుణాలే ఆకులకూ ఉన్నాయి. షుగరు వ్యాధిలో తప్పనిసరిగా తీసుకోదగిన పానీయం ఇది. ఈ ఆకుల్లో షుగరు స్థాయి రక్తంలో తగ్గించే ఆల్కలాయిడ్స్‌ ఉన్నాయి.

ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచేందుకు ఇవి సాయపడతాయి.

జీర్ణశక్తిని పెంచి స్థూలకాయాన్ని తగ్గించగలుగుతాయి. నేరేడు ఆకుల కషాయం పుక్కిలిస్తే నోటి పూత, గొంతులో పుండు (సోర్‌ థ్రోట్‌) తగ్గుతాయి. కీళ్లవాతంలో వాపులు త్వరగా తగ్గుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు విషహర లక్షణాలను కలిగి ఉంటాయి.

దీన్ని రోజూ ఒక కప్పు చొప్పున రెండు పూటలా తీసుకోవచ్చు. దీనివల్ల మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. చర్మానికి పోషణ ఇస్తుంది.

జంబూ ఫలంత్వ స్థివివర్జితం హి సుమర్దితం శర్కరాయా అంబునాళమ్‌!

సువాసితం వాల్లిజభృంగపత్రె రుచిం వివర్తె విరుచౌ జనానామ్‌!

క్షేమశర్మ తన ‘క్షేమ కుతూహలం’ గ్రంథంలో నేరేడు పండు పానకాన్ని ఎలా తయారు చేసుకోవాలో, ఎందుకు తీసుకోవాలో చక్కగా వివరించాడు. నేరేడు ప్రాముఖ్యతని పట్టించుకోకపోవటం వల్ల ఎక్కువగా నష్టపోయేది మనమే.


పూజా సంకల్పంలో ‘జంబూ ద్వీపే... భరతవర్షే... భరత ఖండే’ అంటూ మన నివాస ప్రాంతాన్ని జంబూ ద్వీపంతో మొదలెడతారు. భారత ఉపఖండం యావత్తూ జంబూ ద్వీపమే! నేరేడు చెట్లు ఎక్కువగా పెరిగే ప్రాంతం ఇది. అనేక మొక్కలుండగా నేరేడునే ఎందుకు చెబుతున్నారంటే, ఆరోగ్యపరంగా దాని ప్రాధాన్యత అంతటిది కాబట్టి. రోడ్డు పక్కన పెరిగే మొక్కే ఇది. నేరేడు పేరుచెప్పగానే ఎవరికైనా షుగరు వ్యాధికి మందు అనే విషయం గుర్తుకొస్తుంది. తేలికగా దొరికే నేరేడు పండ్లు, ఆకులు, గింజల్ని షుగరు వ్యాధి నివారణ కోసం ఉపయోగించవచ్చు.

నేరేడు పండ్లు అతిమూత్రాన్ని అరికడతాయి. మూత్రంలో పచ్చదనాన్ని, వేడిని తగ్గిస్తాయి. వాంతిని ఆపుతాయి. తీసుకున్న ఆహారం వంటబట్టకపోవటం, జిగురు, నీళ్ల విరేచనాలను అదుపు చేస్తాయి. వేడిని, మంటల్ని తగ్గిస్తాయి. గొంతు నొప్పి తగ్గుతుంది. చిక్కిపోతున్నవారికి, కడుపులో నులి పురుగులున్న వారికి, దగ్గు, జలుబు ఆయాసాలు ఉన్నవారికి ఇవి మేలు చేస్తాయి. నోటికి రుచిని కలిగిస్తాయి. కీళ్లవాతంలో వాపుల్ని ఇది తగ్గిస్తుంది. జ్వరాల్లో కూడా ఇది పని చేస్తుంది. ఎక్కువ తింటే మలబద్ధకం కలుగుతుంది. నీరసం, నిస్సత్తువనీ తక్షణం తగ్గిస్తుంది.

తిన్నది వంటబట్టేలా చేస్తుంది. అన్నిటికన్నా చెప్పుకోదగింది... పుండును, ఇన్‌ఫెక్షన్లను త్వరగా తగ్గిస్తుంది. స్త్రీల సంబంధిత వ్యాధుల మీద పని చేసే పుష్యానుగ చూర్ణం, జంబూవాసవం, ఉసీరాసవం లాంటి ఔషధాల తయారీలో నేరేడు పండ్లు ఉపయోగపడతాయి. నేరేడు పండు వగరు, తీపి రుచులు కలిగి ఉంటుంది. దీని వగరు రుచే ఇన్ని ఔషధ గుణాలకు కారణం.


పానకం ఇలా...

మంచి నేరేడు పండ్లను శుభ్రంగా కడిగి, వాటి గుజ్జు, గింజలు వేరు చేయండి. ఈ గుజ్జుకి సమానంగా పంచదార, తగినన్ని నీళ్లు కలిపి చక్కగా చిలకండి. దీంట్లో బిర్యానీ ఆకు, గుంటకలగరాకులను వేస్తే పరిమళభరితంగా ఉంటుంది.

‘జంబూ ఫలభవం రుచ్యం పానకం కఫ నాశనమ్‌’... ఈ పానకం జీర్ణశక్తిని పెంచేందుకు ఉద్దేశించింది. జీర్ణకోశానికి సంబంధించిన అన్ని వ్యాధుల్లోనూ దీన్ని ఔషధంగా ఇవ్వచ్చు. ఇది అజీర్తిని, కఫాన్ని హరిస్తుంది. వగరు రుచి వాతాన్ని పెంచుతుంది కాబట్టి... నేరేడుని పానకం రూపంలో తీసుకోవాలి. షుగరు వ్యాధి ఉన్నవారు తీపి కలవకుండా... గింజలతో సహా నేరేడు పండుని నూరి, పంచదార లేకుండా పైన చెప్పిన పద్ధతిలో పానీయాన్ని తయారు చేసుకోవచ్చు. స్థూలకాయులకు కూడా ఇది ఉపయోగపడుతుంది.

ప్రకృతి వరప్రసాదం నేరేడు. ఈ చెట్టు, దాని ఆకులు, పూలు, చెక్క కూడా పండ్లతో సమానంగా పని చేస్తాయి. రోడ్డు పక్కన పెరిగే మొక్కే కాబట్టి ఎక్కువ మందికి ఇవి దొరికే అవకాశం ఉంది. దొరకని వారు పండ్లను వాడుకోవచ్చు. నేరేడు ఆకుల పొడి, నేరేడు+ వేపాకు పొడి, నేరేడు గింజల పొడి కూడా ఆన్‌లైన్‌లో లభిస్తున్నాయి... ప్రయత్నించండి.

-గంగరాజు అరుణాదేవి

Updated Date - Jun 22 , 2024 | 01:47 AM