Scalp Health: నల్లని శిరోజాలకు జోజోబా నూనె
ABN , Publish Date - Dec 16 , 2024 | 03:25 AM
శిరోజాల సమస్యలను నివారించడంలో జోజోబా నూనె అద్భుతంగా పనిచేస్తుంది.
శిరోజాల సమస్యలను నివారించడంలో జోజోబా నూనె అద్భుతంగా పనిచేస్తుంది. ఈ నూనెలో బి, ఇ విటమిన్లు; జింక్, కాపర్ మినరల్స్; ఫాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. మాడు మీద ఈ నూనెతో మెల్లగా మర్దన చేస్తే వెంట్రుకల కుదుళ్లు గట్టిపడతాయి. తలమీద ఉన్న చర్మానికి రక్తప్రసరణ జరిగి శిరోజాలు నల్లగా ఒత్తుగా పెరుగుతాయి. మాడు మీద సెబమ్ ఉత్పత్తి నియంత్రణలో ఉండి వెంట్రుకలు జిడ్డుగా మారవు. జోజోబా నూనె అందించే మరికొన్ని ప్రయోజనాలు...
ఇ-విటమిన్‌తో: ఇ విటమిన్‌లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి శిరోజాలు ఆరోగ్యంగా పెరిగేందుకు దోహదం చేస్తాయి. రెండు ఇ విటమిన్ ట్యాబ్లెట్స్ నుంచి నూనెను తీసి ఒక చిన్న గిన్నెలో వేయాలి. దీనికి రెండు చెంచాల జోజోబా నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని అరచేతుల్లోకి తీసుకుని మాడు మీద గుండ్రంగా రాస్తూ మర్దన చేయాలి. అరగంట తరవాత గోరువెచ్చని నీళ్లు, గాఢత లేని షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తూ ఉంటే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది.
తేనెతో: తేనెలో అధికంగా తేమతోపాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి మాడుమీద చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒక గిన్నెలో రెండు చెంచాల జోజోబా నూనె, ఒక చెంచా తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలంతా పట్టించాలి. తరవాత షవర్ క్యాప్‌తో మూసివేయాలి. నలభై నిమిషాల తరవాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే చుండ్రు సమస్యలు రాకుండా ఉంటాయి. శిరోజాలు పొడవుగా పెరుగుతాయి.
కొబ్బరినూనెతో: ఒక గిన్నెలో రెండు చెంచాల జోజోబా నూనె, ఒక చెంచా కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. రాత్రి పడుకునేముందు ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. పది నిమిషాలు మాడు మీద మసాజ్ చేయాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తూ ఉంటే వెంట్రుకల కుదుళ్లకు రక్తప్రసరణ జరిగి అవి గట్టిపడతాయి. శిరోజాలు నల్లగా మెరుస్తుంటాయి. వెంట్రుకల చివర్లు పగలడం తగ్గుతుంది.
కలబంద గుజ్జుతో: కలబంద గుజ్జు మంచి ఆయుర్వేద ఔషధం. ఇది తలలో చుండ్రు, కురుపులు రాకుండా చేస్తుంది. ఒక గిన్నెలో రెండు చెంచాల కలబంద గుజ్జు, రెండు చెంచాల జోజోబా నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకల కుదుళ్లకు పట్టించాలి. అరగంట తరవాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తూ ఉంటే మాడు మీద పీహెచ్ స్థాయి తటస్థంగా మారుతుంది. వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. బట్టతల సమస్య తీరుతుంది. వెంట్రుకలు తెల్లబడకుండా ఉంటాయి.