Share News

ఆమెకు పుస్తకాలే పిల్లలు

ABN , Publish Date - Sep 05 , 2024 | 04:03 AM

‘‘జీవితం ఎప్పుడూ మనం అనుకున్నట్టు సాగదు. ఎత్తుపల్లాలు... ఆటుపోట్లు... అన్నిటినీ తట్టుకొని ముందుకు సాగితేనే అనుకున్నది సాధించగలం. ఇది నాకు అనుభవం నేర్పిన పాఠం. ఉత్తరాఖండ్‌ తెహ్రీ గఢవాల్‌ జిల్లాలోని బౌన్సారా గ్రామం మాది. మా నాన్న...

ఆమెకు పుస్తకాలే పిల్లలు

అభిరుచి

ప్రొఫెసర్‌గా తరగతి గదిలో పాఠాలే కాదు...

చక్కని రచనలతో గ్రంథకర్తగానూ పేరు గడించారు.

పుస్తకాలే తన పిల్లలుగా... సాహిత్యమే తన లోకంగా

జీవిస్తున్న డాక్టర్‌ కవితా భట్‌ కథ ఇది.

‘‘జీవితం ఎప్పుడూ మనం అనుకున్నట్టు సాగదు. ఎత్తుపల్లాలు... ఆటుపోట్లు... అన్నిటినీ తట్టుకొని ముందుకు సాగితేనే అనుకున్నది సాధించగలం. ఇది నాకు అనుభవం నేర్పిన పాఠం. ఉత్తరాఖండ్‌ తెహ్రీ గఢవాల్‌ జిల్లాలోని బౌన్సారా గ్రామం మాది. మా నాన్న బంకేలాల్‌ రతూరీ ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పని చేసేవారు. ఆయన జీతంతో ఇల్లు గడవడమే కష్టంగా ఉండేది. ఆర్థిక ఇబ్బందులకు తోడు కుటుంబ పరిస్థితులూ అంతంతమాత్రమే. సంతానంలో నేనే పెద్ద. మా కోసం నాన్న పడుతున్న ఆవేదన, ఆందోళన నాకు అర్థమయ్యేది. నేనూ ఆయన కష్టాన్ని పంచుకోగలిగితే బాగుండని చిన్నప్పుడు ఎన్నో సందర్భాల్లో అనుకునేదాన్ని. వీటి నుంచి గట్టెక్కాలంటే చదువు ఒక్కటే మార్గమని భావించాను. బీఎస్సీ పూర్తయిన తరువాత ఫిలాసఫీ, యోగా, ఇంగ్లీష్‌, సోషల్‌వర్క్‌ సబ్జెక్టుల్లో మొత్తం నాలుగు మాస్టర్స్‌ డిగ్రీలు సాధించాను. లక్ష్యం వైపు పయనించాలంటే బలమైన పునాదులు ఉండాలి కదా. అందుకే ఇవన్నీ చదివాను. అంతేకాదు... సామాజిక అంశాలపై మరింత లోతైన అవగాహన కోసం ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ తదితర డిప్లమో కోర్సులతోపాటు పీహెచ్‌డీ కూడా చేశాను.


కఠిన పరీక్షలకు నిలిచి...

ఫిలాసఫీ, యోగా సబ్జెక్టుల్లో యూజీసీ-నెట్‌ పరీక్ష రాస్తే, అందులో అర్హత సాధించాను. ‘ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫిలాసఫికల్‌ రీసెర్చ్‌’ నుంచి జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌, జనరల్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌. దాంతోపాటు యూజీసీ నుంచి పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌ అందుకున్నాను. మా కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో... వేరొకరిపై ఆధారపడకుండా స్వశక్తితో ఎదిగిన ఒక మహిళగా నాలాంటివారికి ఆదర్శంగా నిలవాలనుకున్నాను. అందుకే ఎన్ని కఠిన పరీక్షలు ఎదురైనా తట్టుకొని చదువు కొనసాగించాను. ఆత్మస్థైర్యంతో అడుగులు వేసి ఇక్కడి వరకు రాగలిగాను. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌ ‘హేమవతీ నందన్‌ బహుగుణ గఢవాల్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ’ ఫిలాసఫీ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నా.

ఎన్నో రచనలు...

ఒక పక్క విద్యా బోధన... మరోవైపు పుస్తక రచన చేస్తున్నా. సాహిత్య ప్రపంచంలో నాకంటూ కొన్ని పేజీలు ఉండాలనే తపన. ఇప్పటికి 27 పుస్తకాలు రాశాను. యోగిక్‌ స్టడీస్‌, సత్కర్మాస్‌, భారతీయ సాహిత్యం తదితర అంశాలకు సంబంధించిన పుస్తకాలు అందులో ఉన్నాయి. అయితే నాకు బాగా పేరు తెచ్చిన రచనలు ‘గీతా దర్శన్‌’, ‘భారతీయ సాహిత్య మే జీవన్‌ మూల్య’. వీటికి ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి పురస్కారాలు, సత్కారాలు అందుకున్నాను. యూపీలోని ‘పటేల్‌ ప్రతినిధి సభ’ వారు ‘శైల్‌పుత్రి’ బిరుదుతో గౌరవించారు. 2019లో మధ్యప్రదేశ్‌ సాహిత్య అకాడమీ ‘అఖిల్‌ భారతీయ ఆచార్య రామచంద్ర శుక్లా’ పురస్కారంతో కలిపి ఇప్పటికి ముప్ఫైకి పైగా అవార్డులు అందుకున్నాను. ఇవి సాహిత్యం, సంస్కృతికి అందించిన సేవలకు నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.


అక్షరంపై ప్రేమతో...

కొన్ని కారణాల వల్ల నేను తల్లిని కాలేకపోయాను. మాతృత్వపు మాధుర్యానికి నోచుకోనందుకు కొన్నాళ్లు బాధపడ్డాను. కానీ త్వరగానే దాని నుంచి కోలుకున్నాను. సాహిత్య లోకంలో విహరించడం ప్రారంభించాను. ఇప్పుడు నాకు పిల్లలు లేరన్న బాధ లేదు. ఎందుకంటే నా పుస్తకాలే నా పిల్లలు. నవ మాసాలు మోసి, బిడ్డను ప్రసవించడానికి ఎంత వేదన పడుతుందో... ఒక అంశాన్ని ఎంచుకొని, దానికి అక్షర రూపం ఇచ్చి, పుస్తకంగా బయటకు తేవడానికి నేనూ అంతగా శ్రమిస్తాను. రచనలో మునిగిపోతాను. అంతే ప్రేమతో ప్రతి పుస్తకానికీ రూపం ఇస్తాను. ఎవరైనా నా రచనలను ప్రశంసిస్తే... అది నా బిడ్డకు దక్కిన అభినందన. ఒక తల్లిగా సంతోషిస్తాను.

సమాజం కోసం...

బోధన, సాహిత్యంలో ఎంతగా మునిగినా... ఈ సమాజంలో ఒక వ్యక్తిగా నావంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను. పోటీ పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాను. వారానికి రెండు రోజులు దీనికి కేటాయించాను. అలాగే అణగారిన వర్గాల పిల్లలకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌, అవసరమైన స్టడీ మెటీరియల్‌ అందిస్తున్నాను. మధ్యలో చదువు మానేసిన చిన్నారులను బడి బాట పట్టించేందుకు కృషి చేస్తున్నాను. ఎందుకంటే వారి జీవితాలను మార్చగలిగేది చదువు మాత్రమే. దానికి నన్నే ప్రత్యక్ష ఉదాహరణగా చూపిస్తూ, వారిలో స్ఫూర్తి నింపుతున్నాను.’’

Updated Date - Sep 05 , 2024 | 04:03 AM