Cancer Care : కేన్సర్ ఎవరికి?
ABN , Publish Date - Oct 29 , 2024 | 05:15 AM
పూర్వంతో పోల్చుకుంటే కేన్సర్ వచ్చే అవకాశాలు పెరిగాయి. ఆహారం, జీవనశైలిలో కాలక్రమేణా ఎన్నో మార్పులొచ్చాయి. వాతావరణంలో కాలుష్యం పెరిగింది. పుట్టి, పెరిగే ప్రదేశాలు మారిపోతున్నాయి. ఈ అంశాలన్నీ శరీరం మీద ప్రభావం చూపిస్తాయి.
కేన్సర్ కేర్
పూర్వంతో పోల్చుకుంటే కేన్సర్ వచ్చే అవకాశాలు పెరిగాయి. ఆహారం, జీవనశైలిలో కాలక్రమేణా ఎన్నో మార్పులొచ్చాయి. వాతావరణంలో కాలుష్యం పెరిగింది. పుట్టి, పెరిగే ప్రదేశాలు మారిపోతున్నాయి. ఈ అంశాలన్నీ శరీరం మీద ప్రభావం చూపిస్తాయి. వీటికి పైన చెప్పిన కారణాలు కూడా తోడైతే కేన్సర్ వచ్చే అవకాశాలు మరింత పెరుగుతాయి. కేన్సర్‌కు కారణాలు ప్రధానంగా నాలుగు. అవేంటంటే...
1. జన్యుపరమైన కారణాలు
(వంశపారంపర్యంగా సంక్రమించేవి)
2. కాలుష్యం, పర్యావరణం
3. జీవనశైలి
4. ఆహారపుటలవాట్లు ఎంతటి ఆరోగ్యకరమైన జీవనశైలి
ఆహారపుటలవాట్లతో పెరిగినా జన్యువుల్లో కేన్సర్ కారకం ఉంటే వంశపారంపర్యంగా కేన్సర్ సంక్రమించవచ్చు. అయితే ఈ రకమైన క్యాన్సర్లు 30 నుంచి 35 ఏళ్ల లోపే బయల్పడతాయి. అయితే కేన్సర్ కారకాల్లో వంశపారంపర్యంగా సంక్రమించే అవకాశాలను, పర్యావరణ మార్పుల వల్ల కేన్సర్ సంక్రమించే అవకాశాలను నియంత్రించలేకపోయినా, ఆహారపుటలవాట్లు, జీవనశైలిని ఆరోగ్యకరంగా మార్చుకునే వీలు మన చేతుల్లోనే ఉంది.
ఆహారపుటలవాట్లు, నియమాలు, శైలి
ఎప్పటికప్పుడు వేడిగా వండుకుని తినే అలవాటు కాలక్రమేణా అంతరించింది. 30, 40 ఏళ్ల క్రితం మధ్యాహ్నం వండుకున్న కూరలు మధ్యాహ్నానికే తినేసేవాళ్లం. రాత్రికి తిరిగి వేడిగా వండుకునేవాళ్లం. అలాగే మాంసాహారమైనా! కానీ ఇప్పుడు నాన్ వెజ్ తినాలనిపిస్తే ఖరీదైన రెస్టారెంట్లకు పరిగెడుతూ ఉంటాం. అక్కడ వడ్డించే పదార్థాల్లో వాడిన కోడి మాంసం ఎప్పటిదో వండేవాళ్లకే తెలియదు. ఇలా హోటళ్లలో, రెస్టారెంట్లలో, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో తయారయ్యే ప్రాసెస్‌డ్ ఫుడ్ వల్ల కేన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ప్రాసెస్ చేసిన మాంసం, పదార్థాలు, చక్కెరలు ఎక్కువగా, తాజా కూరగాయలు, పళ్లు తక్కువగా తినటం లాంటి అలవాట్లన్నీ కేన్సర్ కారకాలే! ఈ అలవాట్లకు తోడు శారీరక వ్యాయామం లోపించటం వల్ల శరీర బరువు పెరిగి కేన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి.
నివారణ మన చేతుల్లోనే!
అధిక బరువుతో సంబంధం ఉండే కేన్సర్లకు గురి కాకుండా ఉండాలంటే తీసుకునే ఆహారం పట్ల అప్రమత్తంగా ఉండాలి. దురలవాట్లను వదిలేసి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలి. ఇందుకోసం...
ఏడాదికి ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకుంటూ కేన్సర్‌ను ముందుగానే కనిపెడుతూ ఉండాలి.
తాజా కూరగాయలు, పళ్లు ఎక్కువగా తీసుకోవాలి.
ప్రాసెస్డ్ ఫుడ్, చక్కెరలు తగ్గించాలి.
శీతల పానీయాలు మానేయాలి.
ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
వంశపారంపర్యంగా కేన్సర్ సంక్రమించే అవకాశాలున్నవాళ్లు మరింత అప్రమత్తంగా ఉండాలి.
శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి.
ఏ అనారోగ్య లక్షణమైనా మూడు వారాలకు మించి తగ్గకపోతే కేన్సర్ అయి ఉండొచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి.
ఎంత త్వరగా కేన్సర్‌ను గుర్తిస్తే, చికిత్స అంత సులభతరం అవుతుంది. చికిత్సకయ్యే ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. అలాగే నివారణ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.