Nutritious Remedy : చిక్కిపోయేవారికి చక్కని కొబ్బరి పాయసం
ABN , Publish Date - Dec 28 , 2024 | 04:27 AM
అంటాడు ‘భోజనకుతుహలం’ రచయిత రఘనాథ సూరి. ఈ శ్లోకం ప్రకారం- కొబ్బరి పాలతో పాయసం వాతపైత్యాల్ని తగ్గిస్తుంది.
‘‘నారికేళం తనూకృత్య ఛిన్నం పయసిః గో క్షిపేత్ సితాగవ్యాజ్య సంయుక్తం తత్సచేన్మృదువహ్నినా’’
అంటాడు ‘భోజనకుతుహలం’ రచయిత రఘనాథ సూరి. ఈ శ్లోకం ప్రకారం- కొబ్బరి పాలతో పాయసం వాతపైత్యాల్ని తగ్గిస్తుంది. ఈ పాయసాన్ని ఎలా తయారుచేయాలో కూడా ఈ శ్లోకం చెబుతుంది. ఈ శ్లోకంలో తనూకృత్యం అంటే కొబ్బరిని సన్నగా తరగటం. ఒకవేళ సన్నగా తురిమే సాధనం లేకపోతే దానిని ఛిన్నం కూడా చేయవచ్చని శాస్త్రకారుడు చెబుతాడు. ఇలా సన్నగా తరిగిన కొబ్బరిని చిక్కని ఆవుపాలలో కలిపి ఉడికించాలి. అలా ఉడికిన మిశ్రమంలో నెయ్యి వేసి దగ్గరపడేలా ఉడికించాలి. అలా ఉడికించిన తర్వాత దానిలో చిటికెడంత పచ్చకర్పూరం కలిపితే మంచి పరిమళంతో పాటుగా పవిత్ర భావం కూడా వస్తుందని రఘనాథ సూరి చెబుతాడు. ఇలా తయారు చేసిన కొబ్బరి పాయసం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరితో చేసిన పాయసం ఎక్కువ పుష్టిదాయకం. శరీరానికి పోషణ ఇస్తుంది. ఎదిగే పిల్లలకు మేలు చేస్తుంది. తక్కువగా తిన్నా ఎక్కువగా ఆకలి తీరుతుంది.
మంచి నిద్ర పట్టడానికి ఇదొక సాధనం. రక్తస్రావాలు అరికడుతుంది. వాత వ్యాధులు ఉన్నవారు దీనిని జాగ్రత్తగా ఆలోచించి సేవించాలి. దగ్గు, జలుబు, ఆయాసం మొదలైన వ్యాధులతో బాధపడేవారికి ఇది చెడు ఎక్కువ చేస్తుంది.
ఇది చర్మ సమస్యలకు మంచి మందులా పనిచేస్తుంది. చర్మానికి మంచి మెరుపునిస్తుంది.
అలసటను తగ్గిస్తుంది. వికారాన్ని, ఎక్కిళ్లను, ఇతర గ్యాసు సమస్యలను తొలగిస్తుంది.
సాధారణంగా ఎక్కువ మంది ముదురు కొబ్బరిని ఉపయోగిస్తారు. ముదురు కొబ్బరి కన్నా లేత కొబ్బరి ఎక్కువ ప్రయోజనకారి. అనేక రకాల శారీరక సమస్యలకు ఇది విరుగుడుగా పనిచేస్తుంది.
-గంగరాజు అరుణాదేవి