Share News

Princess Indira Devi Dhanrajgir : నాకు తెలిసిన కొత్త నిజాం

ABN , Publish Date - Sep 22 , 2024 | 05:15 AM

రాజులు.. రాజ్యాలు లేకపోయినా- రాజ కుటుంబ వారసత్వం కొనసాగుతూనే ఉంటుంది. లాస్ట్‌ నిజాంగా పేరుగాంచిన ముఖ్రం ఝా కుమారుడు అజ్మత్‌ ఝాది కూడా ఈ తరహా వారసత్వమే. తండ్రి మరణం తర్వాత తొమ్మిదో నిజాంగా వారసత్వ పదవిని పొందిన- అజ్మత్‌ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సినిమాటోగ్రాఫర్‌ అని..

Princess Indira Devi Dhanrajgir : నాకు తెలిసిన కొత్త నిజాం

  • అలనాటి కథ

రాజులు.. రాజ్యాలు లేకపోయినా- రాజ కుటుంబ వారసత్వం కొనసాగుతూనే ఉంటుంది. లాస్ట్‌ నిజాంగా పేరుగాంచిన ముఖ్రం ఝా కుమారుడు అజ్మత్‌ ఝాది కూడా ఈ తరహా వారసత్వమే. తండ్రి మరణం తర్వాత తొమ్మిదో నిజాంగా వారసత్వ పదవిని పొందిన- అజ్మత్‌ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సినిమాటోగ్రాఫర్‌ అని.. గాంధీ సినిమా తీసిన డేవిడ్‌ అటెన్‌బరోతోను.. ఒకప్పటి జేమ్స్‌ బాండ్‌ సిన్‌ కానరీతోను.. అనేక గొప్ప చిత్రాలు తీసిన స్టివెన్‌ స్పీల్‌బర్గ్‌తోను కలిసి పనిచేశాడని అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు!

అజ్మత్‌ నాకు చిన్ననాటి నుంచి తెలుసు. ప్రిన్సెస్‌ ఏస్రాతో నాకున్న స్నేహం వల్ల చిన్నప్పటి నుంచి నాకు తనంటే ప్రత్యేకమైన అభిమానమనే చెప్పాలి. ఒక రాజ కుటుంబం నుంచి వచ్చినా- ఆ వాసనలేమి కనబడని వ్యక్తి అజ్మత్‌. తన గురించి తలుచుకున్నప్పుడు అనేక జ్ఞాపకాలు నాకు గుర్తుకొస్తాయి. చౌమల్లా ప్యాలెస్‌కు పునర్‌వైభవాన్ని తీసుకురావటం కోసం మరమ్మత్తులు చేయిస్తున్న సమయంలో ప్రిన్సెస్‌ ఏస్రా ఐటీసీ కాకతీయ హోటల్‌లో ఉండేవారు. ఒక రోజు ప్రిన్సెస్‌ ఏస్రాను కలవటానికి హోటల్‌కు వెళ్లాను. అక్కడ అజ్మత్‌ కనిపించాడు. తన పుట్టిన రోజు వచ్చేస్తోందని గుర్తుకొచ్చింది. ‘‘పుట్టిన రోజు బహుమతిగా ఏం కావాలి?’’ అని అడిగాను. వెంటనే తడుముకోకుండా ‘‘బాల్‌ పెన్‌’’ అన్నాడు. నాకు ఆశ్చర్యమేసింది. ‘‘బాల్‌పెన్‌ చాలా?’’ అడిగా. ‘‘నాకు బాల్‌పెన్‌ చాలు’’ అన్నాడు. ఆ తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌ చేశాం. నేను లైబ్రరీకి వెళ్లాలని లేచాడు. ‘‘నువ్వు ఎలాంటి పుస్తకాలు చదువుతావు?’’ అని అడిగాను.

‘‘చరిత్ర గురించి..’’ అన్నాడు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే- సాధారణంగా ఈ తరం పిల్లలకు చరిత్ర పట్ల పెద్ద ఆసక్తి ఉండదు. ఫోటోగ్రఫిలాంటి కళల పట్ల అభిరుచి ఉన్నవారు కూడా అరుదుగా కనిపిస్తారు. అలాంటి వ్యక్తుల్లో అజ్మత్‌ ఒకడు. అమెరికాలోని లాంగ్‌ ఐలాండ్‌లో సినిమాటోగ్రఫి కోర్స్‌ చేశాడు. ఆ సమయంలోనే తనకు టర్కీకి చెందిన ప్రిన్సెస్‌ నాజ్‌ పరిచయమయింది. వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి వార్త తెలిసిన తర్వాత - ప్రిన్సెస్‌ ఏస్రాను - ‘‘పెళ్లికి ఏం బహుమతి ఇచ్చావు?’’ అని అడిగాను. ‘‘ఎమరాల్డ్‌ సెట్‌.. రూబీలు.. ముత్యాలు.. వజ్రాలు’’ అని సమాధానమిచ్చింది. బహుశా అవన్నీ చాలా అరుదైనవే అయిఉండాలి.


ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. సాధారణంగా రాజకుటుంబాల వారసులు వ్యాపారాలలోకి ప్రవేశిస్తారు. కొందరు రాజకీయ నాయకులు అవుతారు. ఈ రెండింటి ద్వారా తమ వారసత్వాన్ని కొనసాగించటానికి ప్రయత్నిస్తారు. సామాన్య మధ్యతరగతి ప్రొఫెషనల్స్‌ మాదిరిగా ఒకో మెట్టు ఎక్కి పైకి ఎదిగేవారు అతి తక్కువ మంది. అలాంటి వాళ్లలో అజ్మత్‌ ఒకడని కచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే అజ్మత్‌ తాను చదువుకున్న సమయంలో ఒక వీక్లీ న్యూస్‌పేపర్‌లో ఫోటోగ్రాఫర్‌గా పనిచేసేవాడు. ఫోటో గ్యాలరీలలో షోలు పెట్టేవాడు. ఆ సమయంలోనే తనకు ఫోటోగ్రఫి అంటే చాలా ఇష్టముందనే విషయాన్ని గ్రహించాడు. దానినే ఒక వృత్తిగా ఎంచుకున్నాడు. వృత్తిగా ఎంచుకోవటమే కాదు దానిలో అత్యున్నత స్థానానికి చేరుకోవటానికి ప్రయతిస్తున్నాడు.

ప్రిన్సెస్‌ ఏస్రా, ఆవిడ కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ వచ్చినప్పుడు జ్ఞాన్‌బాగ్‌కు వస్తూ ఉంటారు. నేను కూడా వాళ్లు ఉండే ఫలక్‌నామా ప్యాలెస్‌కు వెళ్తూ ఉంటా. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఫలక్‌నామా ప్యాలెస్‌ను తాజ్‌ గ్రూపుకు లీజ్‌కు ఇచ్చిన తర్వాత- ప్రిన్సెస్‌ ఏస్రా ఆ ఆవరణలోనే ఒక చిన్న అందమైన భవంతిని కట్టుకుంది. నిజాం వారసత్వ వైభవమంతా ఆ భవంతిలో మనం చూడవచ్చు. ప్రిన్సెస్‌ ఏస్రా కుటుంబ సభ్యులు ఎప్పుడూ హైదరాబాద్‌కు వచ్చినా అక్కడే నివసిస్తూ ఉంటారు. అజ్మత్‌ కూడా హైదరాబాద్‌కు వచ్చినప్పుడు అక్కడే నివసిస్తాడు. నిజాం కుటుంబం సంప్రదాయాలను, ఆచారాలను కొనసాగిస్తూ ఉంటాడు. ఈ ఆధునిక కాలంలో గత కాలపు నిజాం వారసత్వాన్ని కొనసాగించటం అంత సులభం కాదు. అజ్మత్‌ ఆ విషయంలో విజయం సాధించాడనే చెప్పాలి.

- రాజకుమారి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్‌

Updated Date - Sep 22 , 2024 | 05:15 AM