Good life : ఈ స్లీప్ హైజీన్ సూపర్
ABN , Publish Date - Sep 17 , 2024 | 04:53 AM
సాయంత్రం ఐదున్నరకు చివరి భోజనం చేసి, పెందలాడే నిద్రపోవడం అలవాటు చేసుకున్న తర్వాత, తాను రెట్టింపు హుషారుగా ఉండగలుగుతానని చెప్పి, బాలీవుడ్ నటి
సాయంత్రం ఐదున్నరకు చివరి భోజనం చేసి, పెందలాడే నిద్రపోవడం అలవాటు చేసుకున్న తర్వాత, తాను రెట్టింపు హుషారుగా ఉండగలుగుతానని చెప్పి, బాలీవుడ్ నటి అనూష్క శర్మ, కొత్త తల్లులందర్నీ ఆలోచనలో పడేసింది. నిజానికి ఇది అద్భుతమైన ఆరోగ్యకరమైన అలవాటనీ, కొద్దిపాటి అవగాహనతో పిల్లల తల్లులందరికీ ఈ అలవాటు సాధ్యపడుతుందనీ వైద్యులు కూడా అంటున్నారు.
చిన్నపిల్లల తల్లులకు కంటి నిండా నిద్ర తప్పనిసరి. కానీ సాధారణంగా తల్లులు, పిల్లలను నిద్రపుచ్చి, అప్పుడు పనులకు పూనుకుంటూ ఉంటారు. టివి చూడడం, ఫోన్లు మాట్లాడడం, వ్యాపకాలకు పూనుకోవడం, వంటగది సర్దుకోవడం, ఇంటి పనులు చేసుకోవడం లాంటివి చేస్తూ ఏ అర్థరాత్రికో నిద్రకు ఉపక్రమిస్తూ ఉంటారు. కానీ కంటి నిండా నిద్ర పోలేకపోతే, శరీరంలో సత్తువ సన్నగిల్లుతుంది. రోగనిరోధకశక్తి కుంటుపడి తేలికగా ఇన్‌ఫెక్షన్లకు గురవుతారు. బ్రెయిన్ ఫాగ్ రోజంతా వేధిస్తుంది. పిల్లల పనులు రెట్టింపు భారంగా మారతాయి. కానీ చంటి పిల్లలతో సాయంత్రం పెందలాడే నిద్రపోవడం ఎలా సాధ్యపడుతుంది? అని అనుకోవచ్చు. నిజానికి దైనందిన జీవితంలో చిన్నపాటి మార్పులతో ఈ అలవాటు సాధ్యపడుతుంది. అదెలాగంటే....
స్ర్కీన్ టైమ్ తగ్గించుకోవడం, నిద్రకు ముందు చురుకైన పనుల్లో పాల్గొనడం, అవసరానికి మించి కెఫీన్ తీసుకోవడం, ఆలస్యంగా తినడం... ఇవన్నీ నిద్రకు దూరం చేసే అలవాట్లే! ఉదయాన్నే పరిపూర్ణమైన హుషారుతో నిద్రలేవాలనుకుంటే, రాత్రి భోజనం సాయంత్రమే ముగించేసి, పెందలాడే నిద్రపోవాలి.
పిల్లల నిద్రవేళలను అనుసరించాలి. పిల్లలూ, తల్లులూ ఒకే నిద్రవేళలను క్రమం తప్పక పాటించేలా చూసుకోవాలి. పిల్లల నిద్రవేళల్లో తల్లులూ నిద్రకు ఉపక్రమిస్తే, ఇద్దరూ ఆరోగ్యంగా, హుషారుగా ఉంటారు. పెందలాడే నిద్రపోవడానికి పడగ్గది వాతావరణాన్ని అందుకు అనువుగా మార్చుకోవాలి. కంటి నిండా నిద్ర పట్టడం కోసం పడగ్గది కిటికీలకు ముదురు రంగు కర్టెన్లు కట్టుకోవాలి. నిద్రాభంగం కలిగించే శబ్దాలు పడగ్గదిలోకి చొరబడకుండా చూసుకోవాలి.
కమ్మని నిద్ర పట్టాలంటే పగటివేళ శరీరానికి ఎండ సోకేలా చూసుకోవాలి. కాబట్టి ఉదయం వేళ తక్కువ తాపమానాల్లో పసికందులతో పాటు ఆరుబయట కొన్ని నిమిషాలు గడపడం అలవాటు చేసుకోవాలి.