Share News

కల్లోల లంకలో కాంతిరేఖ

ABN , Publish Date - Sep 25 , 2024 | 11:27 PM

భావి పౌరుల్ని తీర్చిదిద్దే తరగతి గదిలో పాఠాల నుంచి... దేశ భవిష్యత్తుని మలచే చట్టసభల వరకూ సాగిన హరిణి అమరసూర్య ప్రయాణం... ఇప్పుడు శ్రీలంక ప్రధానిగా కొత్త మలుపు తీసుకుంది. హక్కుల కార్యకర్తగా, స్త్రీవాదిగా,

కల్లోల లంకలో కాంతిరేఖ

భావి పౌరుల్ని తీర్చిదిద్దే తరగతి గదిలో పాఠాల నుంచి... దేశ భవిష్యత్తుని మలచే చట్టసభల వరకూ సాగిన హరిణి అమరసూర్య ప్రయాణం... ఇప్పుడు శ్రీలంక ప్రధానిగా కొత్త మలుపు తీసుకుంది. హక్కుల కార్యకర్తగా, స్త్రీవాదిగా, సంస్కరణవాదిగా పేరుపొందిన హరిణి... ఢిల్లీ హిందూ కాలేజీ పూర్వ విద్యార్థి. కల్లోలాలతో సతమతమవుతున్న శ్రీలంకకు మూడో మహిళా ప్రధానిగా... తనదైన ముద్ర వెయ్యడానికి ఆమె సిద్ధమవుతున్నారు.

శ్రీలంక దక్షిణ ప్రాంతంలోని ఒక చిన్న గ్రామంలో, దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు హరిణి అమరసూర్య. ఆమె తండ్రి తేయాకు తోటలో ఉద్యోగి. ఆమెకు ఇద్దరు తోబుట్టువులు. వారిద్దరి తరువాత... చాలాకాలానికి హరిణి పుట్టడంతో కుటుంబంలో అందరూ ఆమెను ఎంతో ప్రేమగా చూసుకొనేవారు. సరదాగా సాగిపోతున్న ఆమె బాల్యంలో హఠాత్తుగా ఒక కుదుపు... 1970ల్లో శ్రీలంక సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. టీ ఎస్టేట్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనితో ఆమె తండ్రి ఉపాధి పోయింది. ఆ కుటుంబం కొలంబోకు వలస వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ ఒక పైవ్రేట్‌ గర్ల్స్‌ స్కూల్‌లో ఆమె చేరారు. దాన్ని క్రిస్టియన్‌ నన్స్‌ నిర్వహించేవారు. తన జీవితం మీద వారి ప్రభావం చాలా ఎక్కువగా ఉందనీ, తనలో ఫెమినిస్ట్‌ భావాలకు అక్కడే బీజం పడిందనీ ఆమె చెబుతారు. ‘‘శ్రీలంక ఘర్షణలకు, ముఖ్యంగా 1983లో చోటుచేసుకున్న జాతిపరమైన దాడులకు సంబంధించిన జ్ఞాపకాలు నాలో ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. మా పొరుగున ఎన్నో తమిళ కుటుంబాలవారు ఉండేవారు. అప్పుడు నాకు పదమూడేళ్ళు. వారిలో కొందరు హఠాత్తుగా మాయమైపోయేవారు. నా తమిళ మిత్రుల్లో చాలామంది తరగతులకు రాకపోవడం, టీచర్లలో ఎంతోమంది ఉద్యోగం మానెయ్యడం లాంటి సంఘటనలు నాలో గందరగోళాన్నీ, భయాన్నీ కలిగించేవి. మేము స్కూల్‌కు వెళ్ళడానికి ముందు మా నాన్న వీధిలోకి వచ్చి... రోడ్ల మీద పరిస్థితుల్ని గమనించేవారు. అంతా సజావుగా ఉందనుకుంటేనే మమ్మల్ని బడికి పంపించేవారు. అయితే మేము మెజారిటీ వర్గానికి చెందినవాళ్ళం కావడం, దక్షిణ ప్రాంతంలో నివసించడం అనేవి ఆ పరిస్థితుల ప్రభావం మా మీద లేకపోవడానికి కారణమని ఆ తరువాత గ్రహించాను. ఏది ఏమైనా మన చుట్టూ ఇటువంటివి జరుగుతున్నప్పుడు... ప్రపంచం పట్ల, సంస్కృతి పట్ల మన దృక్పథాన్ని అవి ప్రభావితం చేస్తాయి’’ అంటారు హరిణి. ఆ స్కూల్లో చదువుతున్నప్పుడే... స్టూడెంట్‌ ఎక్స్ఛేంజ్‌ ప్రోగ్రాం కింద ఆమె ఏడాది పాటు అమెరికా వెళ్ళారు. ‘‘అది 1988-89 మధ్యకాలం. శ్రీలంకలో అది అత్యంత హింసాత్మకమైన కాలం. దేశం ఉత్తర ప్రాంతంలో తీవ్రమైన యుద్ధం, దక్షిణ ప్రాంతంలో తిరుగుబాట్లు తలెత్తాయి. నేను అమెరికా నుంచి తిరిగి వచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు మూతపడ్డాయి. దాంతో... ఇండియాకు వచ్చి, ఢిల్లీ యూనివర్శిటీలోని హిందూ కాలేజీలో అండర్‌గ్రాడ్యుయేషన్‌ కోర్సులో చేరాను. ఆ నాలుగేళ్ళు చాలా ఆహ్లాదంగా గడిచాయి’’ అని చెబుతారామె.


Harini-Srilanka-PM-3f.jpg

అది నా కళ్ళు తెరిపించింది...

ఆ తరువాత ఆస్ట్రేలియాలో అప్లయిడ్‌ ఆంత్రోపాలజీలో మాస్టర్స్‌ చేశారు హరిణి. అనంతరం పిహెచ్‌డి కోసం స్కాట్లాండ్‌ వెళ్ళారు. ఆ సమయంలోనే పౌరహక్కులు, ఫెమినిజం గురించి అధ్యయనం చేశారు. రచనలు మొదలుపెట్టారు. స్వదేశానికి వచ్చిన తరువాత... శ్రీలంక ఓపెన్‌ యూనివర్సిటీలో సోషియాలజీ లెక్చరర్‌గా చేరారు. మరి ఎంతో ఇష్టమైన బోధనా వృత్తి నుంచి ఎన్నికల రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనే నిర్ణయం ఆమె ఎందుకు తీసుకున్నారు? ‘‘నా జీవితం మీద గొప్ప ప్రభావం చూపిన వాటిలో ఒకటి... స్థానిక ఎన్జీవో ఆధ్వర్యంలోని ఒక కమ్యూనిటీ మెంటల్‌ హెల్త్‌ సెంటర్‌లో పని చెయ్యడం. నిజానికి నేను చేసిన మొదటి ఉద్యోగం అదే. అక్కడ వేధింపులకు, వివక్షకు, నిర్బంధానికి గురైన మహిళల దుస్థితి నన్ను బాగా కదిలించింది. ఆ ఉద్యోగంలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించాను. అది ప్రపంచాన్ని నేను చూసే తీరును మార్చింది. మనం గమనించని ప్రదేశాల్లో ఏం జరుగుతోందనే సత్యాన్ని నా కళ్ళముందు నిలబెట్టింది. నా కళ్లు తెరిపించింది. ఆసుపత్రుల వ్యవస్థ, కుటుంబాలు, ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని మేం పోరాటం చేశాం. అలాగే యూనివర్సిటీలో ఉద్యోగానికి ఎంపికయినప్పుడు... ఇంకా జాబ్‌ ఆఫర్‌ లెటర్‌ తీసుకోకుండానే... ఉపాధ్యాయ సంఘంలో చేరాను. ఆ తరువాత... రాజ్‌ పక్స ప్రభుత్వం ప్రతిపక్షాల మీద ఉక్కుపాదం మోపినప్పుడు... అంతటా భయానకమైన వాతావరణం ఏర్పడింది. మేం మూడు నెలలపాటు సమ్మె చేశాం. శ్రీలంకలో హింస తారస్థాయిలో ఉన్న 1980-90ల మధ్య విద్యార్థి నాయకులుగా ఉన్నవారు ఈ సమ్మె కాలంలో సామాజిక, రాజకీయ కార్యకర్తలుగా మారారు. వాళ్ళు ఒక నెట్‌వర్క్‌ ఏర్పాటు చేశారు. నేను దానిలో భాగమయ్యాను. క్రమంగా... ‘జనతా విముక్తి పెరమున’ (జెవిపి) పార్టీతో సాన్నిహిత్యం ఏర్పడింది. విద్యారంగంలో మార్పుల పట్ల జెవిపికి ఉన్న అభిప్రాయాలు నాకు నచ్చాయి. పార్టీ విధాన రూపకల్పనలో కూడా పాల్గొన్నాను. మహిళలు, ట్రాన్స్‌జెండర్ల హక్కుల గురించి నా గళాన్ని గట్టిగా వినిపించాను’’ అని వివరించారు హరిణి.


నా రూపంమీద, జుట్టు మీద కామెంట్స్‌ చేశారు...

2019 శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ‘నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌’ కూటమిలో భాగమైన తమ పార్టీ అభ్యర్థి అనుర కుమార దిసనాయకే తరఫున ప్రచారం చేసిన ఆమె... 2020లో పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. మరోవైపు ‘ప్రోగ్రసివ్‌ ఉమెన్‌ కలెక్టివ్‌’ ప్రతినిధిగా... నాయకత్వ స్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగడానికి కృషి చేస్తున్నారు. ‘‘మహిళల పట్ల అణచివేత ఎన్నో రూపాల్లో సాగుతోంది. అదే సమయంలో... రాజకీయాలు అవినీతిమయం అయ్యాయనీ, కలుషిత మయ్యాయనీ, కాబట్టి గౌరవనీయులైన మహిళలకు ఇవి పనికిరావనీ శ్రీలంకలోని చాలామంది మహిళల్లో ఒక అభిప్రాయం ఉన్నట్టు నేను గమనించాను. అంతేకాదు... ప్రజాజీవితంలో ఉన్న మహిళల్లో ఏవైనా లోపాలు కనిపిస్తాయేమోనని రంధ్రాన్వేషణ చేసేవారు కూడా ఎక్కువయ్యారు. ‘‘మీరు ఎందుకు పెళ్ళి చేసుకోలేదు? స్త్రీ సహజమైన మాతృత్వాన్ని ఎందుకు వద్దనుకున్నారు? కుటుంబ వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏమిటి?’’... ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఎదురయ్యాయి. అంతేకాదు నా రూపం మీద, జుట్టు మీద, దుస్తుల మీద కూడా ఎన్నో కామెంట్స్‌ వచ్చాయి. పార్లమెంట్‌ సభ్యురాలుగా చీర కాకుండా సల్వార్‌ ధరిస్తున్నందుకు కూడా నన్ను కొందరు విమర్శించారు’’ అని గుర్తు చేసుకున్నారు హరిణి. తాజాగా శ్రీలంక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె.... విద్యారంగ సంస్కరణలు, బాలలకు, మహిళలకు రక్షణ, నిరుద్యోగ సమస్య పరిష్కారం, వివిధ వర్గాల హక్కుల పరిరక్షణ తన ధ్యేయాలని చెబుతున్నారు. ‘‘సిరిమావో బండారునాయకే, చంద్రికా కుమార తుంగ తరువాత... శ్రీలంక మూడో మహిళా ప్రధానిని కావడం గౌరవంగా భావిస్తున్నాను. కానీ అదే సమయంలో... మా పార్లమెంట్‌లో మహిళల ప్రాతినిధ్యం 5.33 శాతం మాత్రమే. ప్రపంచంలోనే అతి తక్కువ మహిళా ప్రాతినిధ్యాల్లో ఇదొకటి. ఈ పరిస్థితి మారడానికి, రాజకీయాల పట్ల మహిళలు ఆకర్షితులు కావడంతో పాటు... పార్టీలు వారికి మరిన్ని అవకాశాలు ఇచ్చే విధంగా మార్పు తేవడానికి కృషి చేస్తాను’’ అంటున్నారు హరిణి.

మీరు ఎందుకు పెళ్ళి చేసుకోలేదు? స్త్రీ సహజమైన మాతృత్వాన్ని ఎందుకు వద్దనుకున్నారు? కుటుంబ వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏమిటి?’’... ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఎదురయ్యాయి. అంతేకాదు నా రూపం మీద, జుట్టు మీద, దుస్తుల మీద కూడా ఎన్నో కామెంట్స్‌ వచ్చాయి.

Updated Date - Sep 25 , 2024 | 11:27 PM