Share News

Ice Bath : ఐస్‌ బాత్‌ మంచిదేనా?

ABN , Publish Date - Sep 24 , 2024 | 04:26 AM

అథ్లెట్లు, ఫిట్‌నెస్‌ నిపుణులు, ప్రముఖులు, ఆరోగ్య ప్రయోజనాలను పొందడం కోసం గడ్డకట్టిన నీళ్లలో స్నానం చేస్తున్న సందర్భాలను చూస్తూ ఉంటాం. అయితే ఈ ఐస్‌ బాత్‌ నిజంగానే ఆరోగ్యానికి ప్రయోజనం కలిగిస్తుందా?

 Ice Bath : ఐస్‌ బాత్‌ మంచిదేనా?

అవగాహన

అథ్లెట్లు, ఫిట్‌నెస్‌ నిపుణులు, ప్రముఖులు, ఆరోగ్య ప్రయోజనాలను పొందడం కోసం గడ్డకట్టిన నీళ్లలో స్నానం చేస్తున్న సందర్భాలను చూస్తూ ఉంటాం. అయితే ఈ ఐస్‌ బాత్‌ నిజంగానే ఆరోగ్యానికి ప్రయోజనం కలిగిస్తుందా?

  • ఏం జరుగుతుంది:

చల్లనీళ్లలో మునగడం వల్ల అకస్మాత్తుగా క్షీణించిన నీటి తాపమానం వల్ల మన రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దాంతో శరీర తాపమానాన్ని నిలకడగా ఉంచడం కోసం, ప్రధాన అంతర్గత అవయవాలను కాపాడుకోవడం కోసం, అవయవాల్లోని రక్తం మొత్తం కోర్‌ దగ్గరకు పరుగులు పెడుతుంది.

  • నొప్పుల తగ్గుదల:

అథ్లెట్లు ఐస్‌ బాత్స్‌ తీసుకోడానికి ప్రధాన కారణం ఇదే! ఐస్‌ బాత్‌తో కండరాల నొప్పులు తగ్గుతాయి. దెబ్బతిన్న కణజాలం తాపమానం తగ్గి రక్తనాళాలు కుంచించుకుపోయి, కండరాల నొప్పులు, వాపులు తగ్గుతాయి. దాంతో తీవ్రమైన వ్యాయామాలు చేసేవాళ్లు, తదనంతర కండర నొప్పుల నుంచి ఉపశమనం పొందడం కోసం ఐస్‌ బాత్‌ను ఆశ్రయించవచ్చు.

  • కోలుకోవచ్చు:

వ్యాయామ సమయంలో శరీరంలో పేరుకుపోయే లాక్కిట్‌ యాసిడ్‌ శరీరం నుంచి బయటకు వెళ్లిపోతుంది. చల్ల నీళ్లలో మునిగి, బయటకు రావడం వల్ల కుంచించుకుపోయి, తిరిగి వ్యాకోచించే రక్తనాళాల ఫలితంగా ఈ ఫ్లషింగ్‌ మెకానిజం ప్రేరేపితమవుతుంది. దీంతో మెటబాలిక్‌ వేస్ట్‌ బయటకు వెళ్లిపోయి కండరాలు త్వరగా కోలుకుంటాయి.

  • వ్యాధినిరోధకశక్తి:

క్రమం తప్పకుండా ఐస్‌బాత్‌ చేస్తూ ఉంటే, లింఫ్‌ వ్యవస్థ ప్రేరేపితమై, శరీరంలోని వ్యర్థాలు, విషాలు బయటకు వెళ్లిపోతాయి. చల్లనీళ్లలో మునిగి, బయటకు రావడం వల్ల సంకోచ, వ్యాకోచాలకు గురయ్యే కండరాలతో లింఫ్‌ ద్రవాలు శరీరమంతా ప్రసరించి, తెల్ల రక్తకణాల ఉత్పత్తిని పెంచుతాయి. ఫలితంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది.

  • రక్తప్రసరణ:

ప్రారంభంలో రక్తనాళాలు సంకోచించినా, నీళ్లలో నుంచి బయటకు రాగానే అవి వ్యాకోచిస్తాయి. ఈ ప్రక్రియ, మారిపోయే తాపమానాలకు అలవాటు పడేలా శరీరాన్ని ప్రోత్సహించి, తద్వారా రక్తప్రసరణను పెంచుతుంది. రక్తప్రసరణ మెరుగవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.

  • మానసిక ఆరోగ్యం:

చల్లనీళ్లతో శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. శరీర సహజసిద్ధ నొప్పి నివారిణులు, మూడ్‌ ఎలివేటర్లు అయిన ఈ ఎండార్ఫిన్లు విడుదలవడంతో నొప్పులు తగ్గి, మనసు తేలికపడుతుంది.

  • జాగ్రత్తలు:

ఐస్‌ బాత్స్‌తో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నప్పటికీ, చల్లనీటి స్నానాలతో కొన్ని దుష్ప్రయోజనాలు కూడా పొంచి ఉంటాయి. కాబట్టి చల్లనీళ్లలో పరిమిత సమయమే గడుపుతూ, శరీర కోర్‌ తాపమానం క్షీణించకుండా చూసుకోవాలి. చల్లనీళ్ల ప్రయోజనాలు పొందడం కోసం 10 నుంచి 15 నిమిషాలు చల్లనీళ్లలో మునిగి ఉంటే సరిపోతుంది. చల్లనీళ్లు రక్తపోటును పెంచుతాయి కాబట్టి గుండె జబ్బులున్నవాళ్లు వైద్యుల సలహా మేరకు నడుచుకోవాలి.

Updated Date - Sep 24 , 2024 | 04:26 AM