Indraganti : మన హీరో దైవాంశసంభూతుడు
ABN , Publish Date - Nov 17 , 2024 | 12:45 AM
మనకున్న అచ్చమైన తెలుగు దర్శకులు అతి కొద్ది మందే! వారిలో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు. ‘అష్టాచెమ్మా’, ‘సమ్మోహనం’, ‘వి’ లాంటి హిట్ చిత్రాలకు మోహనకృష్ణ దర్శకత్వం వహించారు. ఆయన రూపొందించిన ‘సారంగపాణి జాతకం’ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఆయన ‘నవ్య’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
సండే సెలబ్రిటీ
మనకున్న అచ్చమైన తెలుగు దర్శకులు అతి కొద్ది మందే! వారిలో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు. ‘అష్టాచెమ్మా’, ‘సమ్మోహనం’, ‘వి’ లాంటి హిట్ చిత్రాలకు మోహనకృష్ణ దర్శకత్వం వహించారు. ఆయన రూపొందించిన ‘సారంగపాణి జాతకం’ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఆయన ‘నవ్య’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
చాలాకాలం తర్వాత మళ్లీ హాస్య సినిమాతో ముందుకు వస్తున్నారు... కారణమేమిటి?
నా దృష్టిలో పూర్తి హాస్యం పండించే సినిమాను తీయటం చాలా కష్టం. చాలామంది హాస్యం పండించటం సులభమనుకుంటారు. కానీ కమల్‌హాసన్‌గారు అన్నట్లు- ‘కామెడీ ఈజ్ సీరియస్ బిజినెస్’. నేను నా కెరీర్‌లో మొత్తం 12 సినిమాలు చేశాను. దానిలో ‘అష్టాచెమ్మా’ ‘అమీతుమీ... ఈ రెండూ పూర్తి హాస్యరస ప్రధానమైనవి. ఇవి తీసి చాలాకాలం అయిపోయింది కాబట్టి- ఏదైనా ఒక హాస్యరస ప్రధాన సినిమా తీయాలని అనుకున్నా. ‘సారంగపాణి జాతకం’ కథ ఎంతోకాలంగా నా మనస్సులో నలుగుతోంది. ఈ మధ్య నేను దర్శకత్వం వహించిన ‘ఆ అమ్మాయి గురించి చెప్పాలి’ అనేది సీరియస్ డ్రామా. అది పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఈ కథ బయటకు వచ్చింది. దీనితో పాటు- ‘శ్రీదేవి మూవీస్’ కృష్ణప్రసాద్ గారు కూడా- ‘‘మనం ‘‘సమ్మోహనం’ తర్వాత కలిసి పని చేయలేదు. ఏదైనా చేద్దాం’’ అని కొద్ది కాలంగా అంటున్నారు. ‘సారంగపాణి జాతకం’ కథ చెబితే ఆయనకు వెంటనే నచ్చేసింది. ఇలా ఈ సినిమా మొదలైంది.
ఈ మధ్యకాలంలో పూర్తి హాస్యరస ప్రధాన సినిమాలు రావటం లేదు.. కారణమేమిటి?
ఒకప్పుడు హాస్యరస ప్రధాన సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించేవారు. జంథ్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ- ఇలా అనేకమందికి హాస్య దర్శకులుగా ముద్ర ఉండేది. కానీ క్రమేణ యాక్షన్ సినిమాల జోరు పెరిగింది. థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలంటే అది రూ. 500 కోట్ల సినిమా అయి ఉండాలని కూడా కొందరు ప్రేక్షకులు భావిస్తున్నారు. దీనితో హాస్య సినిమాల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అయితే మరో వైపు మన జీవితాల్లో హాస్యం తగ్గిపోలేదు. రీల్స్, మీమ్స్, ట్రోల్స్‌ను కోట్ల మంది చూస్తున్నారు. ఆస్వాదిస్తున్నారు. అంటే ప్రేక్షకుల జీవితాల్లో హాస్యానికి ప్రాధాన్యత ఉన్నట్లే కదా!
నేటితరం ప్రేక్షకులకు నిజమైన హాస్యం తెలియదా?
ఈ ప్రశ్నకు అనేక కోణాలున్నాయి. ఒకప్పుడు సాహితీ పోకడలున్న హాస్యాన్ని ఆస్వాదించేవారు. ముళ్లపూడి, జంథ్యాల లాంటి వారి సినిమాలు అందుకే హిట్ అయ్యాయి. వీరు మన జీవితంలోని అనేక అసందర్భాలను తీసుకొని.. వాటిని హాస్యంగా మలచేవారు. ఊరి పేర్లను చదివే ఒక వ్యక్తి, నడకంటే ఇష్టమున్న వ్యక్తి, వంటరాకపోయినా వంట చేసి ఇబ్బంది పెట్టే గృహిణి... ఇలాంటి పాత్రలెన్నో అప్పుడు వచ్చేవి. తరం మారింది. ఇప్పటి తరం వారిలో తెలుగు సాహిత్యాన్ని చదివేవారు అతి తక్కువ మంది. వారిలో కూడా పాపులర్ సాహిత్యం అంటే యండమూరి, మల్లాది, యద్దనపూడి లాంటి వారే ఎక్కువ మందికి తెలుసు. మునిమాణిక్యం రచనల లాంటి గత వైభవాలు వారికి తెలియదు. ఉదాహరణకు ఒక చోట జంఽథ్యాల- ‘పాండవుల సంపాదనంతా కౌరవుల తద్దినాలకే సరిపోయిందన్నట్లు’ అని రాస్తారు. ఇలాంటి హాస్యం ఈ తరంలో వారికి ఎలా అర్థమవుతుంది? వీరికి తెలిసింది- రిఫరెన్స్ హ్యూమర్. అంటే ఏదో ఒక జోకు తీసుకొని, దానిమీద ఒక రీల్ చేయటం. ఒక పాపులర్ సీన్‌ను తీసుకొని స్ఫూప్ చేయటం. హాస్యరసభరిత సినిమాలు రాకపోవటానికి ఇది ఒక కారణం. ఇది కేవలం తెలుగులోనే కాదు. బాలీవుడ్‌లో కూడా పూర్తిగా హాస్యభరిత సినిమాలు రావటం లేదు.
మంచి కథలను అందించే రచయితలు లేరనే వాదన వినిపిస్తూ ఉంటుంది...
పూర్తిగా కనుమరుగయ్యారంటే ఒప్పుకోను. హాస్యరస ప్రధానంగా తీయగలిగిన వారు అతి కొద్దిమంది మాత్రమే ఉన్నారు. చాలామంది దర్శకులు సినిమాలో కొన్ని సన్నివేశాల్లో హాస్యాన్ని పెట్టి పండించగలుగుతున్నారు. ఈ మధ్యకాలంలో ‘సామజవరగమన’, ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ లాంటి సినిమాల్లో మంచి హాస్యమే ఉంది. అయితే హాస్యం- ఒక పెద్ద సినిమాలో చిన్న ప్లాట్‌గా మారిపోయింది. హాస్యం మాత్రమే కాదు. రొమాన్స్, పాటలు కూడా తగ్గిపోయాయి. ఎటు చూసినా యాక్షన్... యాక్షన్... యాక్షన్. అంతే కాకుండా సినిమా అంతా హీరో సెంట్రిక్‌గా మారిపోయింది.
కానీ తెలుగు సినిమాలు మొదటి నుంచి హీరోపై ఆధారపడినవే కదా..
ఒకప్పుడు కథానాయకుడు సామాన్యుడిగా ప్రారంభమై, కష్టాలు అధిగమించి నిజమైన హీరోగా అయ్యేవాడు. కానీ ప్రస్తుతం ఒరవడి మారిపోయింది. ప్రస్తుతం సినిమాల్లో కథానాయకుడు మొదటి నుంచి మహానుభావుడు, దైవాంశసంభూతుడు. కొన్ని సినిమాల్లో దైవాంశసంభూతుడి నుంచి దేవుడిగా కూడా మారిపోతున్నాడు. అతను అన్ని పనులు చేయగలడు. కొన్ని వందలమందిని ఒంటి చేత్తో చంపేయగలడు. ఇంగ్లీషులో చెప్పాలంటే మనది హీరో సెలబ్రేషన్. నిజానికి మన తెలుగులో ఉన్న స్టార్స్ అందరూ మంచి నటులు. వారికి ఉన్న నటనా సామర్థ్యంలో మనం పదిశాతం మాత్రమే వాడుకుంటున్నాం. సంక్లిష్టమైన పాత్రలను మనం వారికి ఇవ్వటం లేదు.
కథకు ప్రాధాన్యత ఇచ్చే మీలాంటి దర్శకుల పరిస్థితి ఏమిటి?
ఇబ్బందిగానే ఉంటుంది. ‘మాస్‌గా తీయగలడా.. హీరో ఎలివేషన్ ఇవ్వగలడా..’ లాంటి చర్చలు జరుగుతూనే ఉంటాయి. అందరూ హాయిగా కలిసి కూర్చుని చూసే సినిమాలు తీయాలనేది నా లక్ష్యం. చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయమిది. నా ఉద్దేశంలో ప్రేక్షకులు అందరికన్నా తెలివైన వారు. మంచి కథతో కూడిన సినిమా వచ్చినప్పుడు తప్పనిసరిగా చూస్తారు. ఈ మధ్యకాలంలో కొన్ని చిన్న సినిమాలు కూడా విజయవంతమయ్యాయి కదా! నా ఉద్దేశంలో సామాన్య ప్రేక్షకుడికి జీవితానుభవం ఉంటుంది. జీవిత సత్యాలు చెప్పేది కూడా వాళ్లే! మీకో రెండు ఉదాహరణలు చెబుతా. ఒకసారి కొవ్వూరులో ఒక రిక్షా అతన్ని- ‘‘ఫలానా చోటికి వస్తావా? ఇక్కడి నుంచి ఎంత దూరం?’’ అని అడిగా. నేను అడిగిన ప్రాంతం దగ్గరే! కానీ అతనికి బేరం పోగొట్టుకోవటం ఇష్టం లేదు. వెంటనే అతను- ‘‘కళ్లకు దగ్గర... కాళ్లకు దూరం’’ అన్నాడు. ఎంత చక్కని మాట! దీన్ని ‘అష్టాచెమ్మా’లో ఒక చోట వాడా. ఇలాగే మరోసారి రాజోలు నుంచి కారులో వెళ్తున్నాం. డ్రైవర్ ఘంటసాల పాత పాటలు పెడుతున్నాడు. ‘‘మీకు ఘంటసాల అంటే ఇష్టమా?’’ అని అడిగా. అప్పుడతను- ‘‘అవును సార్! మనిషి జీవితంలో పాడాల్సిన పాటలన్నీ ఘంటసాల పాడేశాడు’’ అన్నాడు. ఇది కూడా ఎంత గొప్ప మాట! నా ఉద్దేశంలో నిజమైన మాస్ కల్చర్ వేరు. ప్రస్తుతం మనం చూస్తున్నది- సినిమా వాళ్లు సృష్టించిన మాస్ కల్చర్. దానిని కూడా ప్రేక్షకులు చూస్తారు. కానీ వారి జీవితాల నుంచి వచ్చిన కథలను కూడా ఆదరిస్తారు.
మరి అలాంటి కథలెందుకు రావటం లేదు?
రచయితలు తగ్గిపోయారు. దీనికి కారణం- సాహిత్యాన్ని చదవకపోవటం. సమకాలీన అంశాలపై విశ్లేషణ సామర్థ్యం లేకపోవటం. ప్రస్తుత తరానికి బోలెడంత సమాచారం అందుబాటులో ఉంది. కానీ విశ్లేషణ లేదు. దీనికి కారణం- 1990వ దశకం నుంచి ఎక్కువ మంది సైన్స్, ఐటీ డిగ్రీలపై దృష్టి పెట్టడం మొదలుపెట్టారు. సామాజిక శాస్త్రాలను చదివేవారే తగ్గిపోయారు. దీనితో ఎక్కువ మందికి సమకాలీన సమాజంపై అవగాహన లేదు. 2000 సంవత్సరం తర్వాత మరిన్ని మార్పులు వచ్చాయి. ప్రస్తుత తరం వారికి డబ్బులు ఉన్నాయి. కొనుగోలు శక్తి ఉంది. ఆకాంక్షలు కూడా ఉన్నాయి. కానీ తమ చుట్టూ ఉన్న సమాజంపై అవగాహన లేదు. అలాంటప్పుడు కొత్త కథలు ఎక్కడి నుంచి వస్తాయి?
మరి మళయాళం, తమిళ పరిశ్రమలలో సాంస్కృతిక మూలాలున్న కథలెందుకు తీస్తున్నారు?
వారు సమాజానికి, వారి సంస్కృతికి దూరంగా జరిగిపోలేదు. తమిళంలో వెట్రిమారన్ తీసే సినిమాలు చూడండి. మనకు తెలియని సంస్కృతిని పరిచయం చేస్తాయి. కన్నడ సినిమా ‘కాంతార’లో కూడామూలాలు తెలుస్తాయి. ‘మోర్ లోకల్.. మోర్ యూనివర్సల్’ అనే సూత్రాన్ని వారు పాటిస్తున్నారు.నా ఉద్దేశంలో మొదటి నుంచి తెలుగు ప్రేక్షకులకు- ‘సినిమాకు జీవితానికి సంబంధం లేదు’ అనే స్పష్టత ఉందనిపిస్తుంది. అందుకే తెలుగు సినిమాల్లో హీరో సెలబ్రేషన్ చాలా ఎక్కువ.
మరి ఈ పరిస్థితి మారదా?
మారుతుంది. ఇదంతా డ్రగ్స్ వల్ల కలిగే ప్రభావం లాంటిది. సామాన్య ప్రజలకు వ్యవస్థ అంటే భయం కాబట్టి- దాన్ని ఎదిరించేవాణ్ణి ఆదరిస్తారు. కానీ అది వ్యక్తి పూజ కాకూడదు. మన జీవితంలో చేయలేని, సమాజంలో ఆచరించలేని పనులను హీరో చేస్తుంటే ఆరాధన కలగవచ్చు. కానీ ‘థియేటర్ నుంచి వాస్తవ ప్రపంచానికి వచ్చిన తర్వాత మనం బతకాల్సింది ఈ సమాజంలోనే’ అనే విషయం తెలిస్తే దుఖం కలుగుతుంది. అంటే దాని ప్రభావం తగ్గిపోతుంది. దీనిని ఇంకో కోణం నుంచి కూడా చూడచ్చు. కొత్తగా విడుదలయిన సినిమా హాలులో చూడండి... స్ర్కీన్ మీద సినిమా ప్రారంభమయిన వెంటనే వందల ఫోన్లు పైకి లేస్తాయి. స్ర్కీన్ షాట్‌లను సోషల్‌మీడియాలో వెంటనే పెట్టేస్తారు. దాని ద్వారా ప్రపంచానికి తాము ఒక సినిమా చూస్తున్నామని చెప్పటానికి ప్రయత్నిస్తారు. ఎక్కువమందికి సినిమా కన్నా సెల్‌ఫోన్‌లో వచ్చే రీల్స్‌పైనో, మెసేజ్‌లపైనో దృష్టి చెదురుతూ ఉంటుంది. ప్రేక్షకులు సెల్‌ఫోన్లు చూడకుండా ఏం చేయాలనేది దర్శకులకు పెద్ద సవాలుగా మారింది. దాంతో వారు సినిమాలో కొత్త కొత్త మలుపులు పెట్టేస్తున్నారు. ప్రతి సీన్‌నొ ఒక క్లైమాక్స్‌గా మార్చటానికి ప్రయత్నిస్తున్నారు. ఒకటి పెట్టాల్సిన చోట పది, పది పెట్టాల్సిన చోట వంద- ఇలా ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ‘యాక్షన్, గ్లోబల్, స్కేల్, రీచ్’ అని పరిగెడుతున్నారు. ప్రేక్షకులు ఒక సినిమాలో ఎన్ని క్లైమాక్స్‌లు చూడగలరు? నెమ్మదిగా ప్రేక్షకులకు ఇలాంటి సినిమాలు చూసి చూసి అలసట కలుగుతోంది. అన్నీ సినిమాలు ఇలాగే వస్తుంటే- ప్రేక్షకులు వీటిని చూడటం మానేసి కథాబలం ఉన్న సినిమాలను చూస్తారు. ఆ రోజు తప్పకుండా వస్తుంది.
- సివిఎల్‌ఎన్ ప్రసాద్