Share News

'RJ Karishma' : వన్‌ ఉమన్‌ ఆర్మీ

ABN , Publish Date - Oct 28 , 2024 | 05:21 AM

‘‘నవ్వులపాలు కావడం సులువే. కానీ నవ్వించడం అంత సులభం కాదు. నవ్వులపాలు కాకుండా నవ్వించడమే నేను రోజూ ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్‌’’ అంటారు కరిష్మా గంగ్వాల్‌.

'RJ Karishma' : వన్‌ ఉమన్‌ ఆర్మీ

‘‘నవ్వులపాలు కావడం సులువే. కానీ నవ్వించడం అంత సులభం కాదు. నవ్వులపాలు కాకుండా నవ్వించడమే నేను రోజూ ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్‌’’ అంటారు కరిష్మా గంగ్వాల్‌. ‘ఆర్జే కరిష్మా’గా ప్రసిద్ధురాలైన ఈ 31 ఏళ్ళ జమ్మూ మహిళ భారతీయ కుటుంబాలకు అద్దంపట్టే రీల్స్‌తో కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఈ ఏడాది ‘కేన్స్‌ ఫిలిమ్‌ ఫెస్టివల్‌’లో రెడ్‌ కార్పెట్‌పై మెరిశారు. పారిస్‌ ఒలింపిక్స్‌కు ‘యూట్యూబ్‌’ తరఫున హాజరైన మొదటి ఇండియన్‌ కంటెంట్‌ క్రియేటర్‌గా చరిత్రకెక్కారు.

నిరంతరం కోడల్ని సతాయించే అత్తగారు. నేర్పుగా పరిస్థితుల్ని ఎదుర్కొనే కోడలు, దారితప్పిన కొడుకు, అతిగా ఆలోచించే తండ్రి, ఎప్పుడూ ఉచిత సలహాలిచ్చే బామ్మ. అణకువగా ఉండే మేనత్త... భారతీయ కుటుంబాల్లోని ఈ పాత్రలన్నిటినీ ఏకకాలంలో అభినయించి నవ్విస్తారు కరిష్మా గంగ్వాల్‌. అనేక పాత్రలను పోషించడం మాత్రమే కాదు, స్ర్కిప్ట్‌ రాయడం, ఎడిట్‌ చెయ్యడం లాంటి బాధ్యతలు కూడా ఆమెవే. ‘‘ఇవన్నీ ఎలా కుదురుతున్నాయ్‌?’’ అనే ప్రశ్నకు... ‘‘నేను వన్‌ ఉమన్‌ ఆర్మీ’’ అంటారామె చిరునవ్వుతో. ‘‘నాకు చిన్నవయసు నుంచి పరిశీలనా శక్తి ఎక్కువ. ఎవరినైనా సులువుగా అనుకరించేదాన్ని. నా తోటి పిల్లలందరూ బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే నేను మా అమ్మ దుస్తులు ధరించి, అద్దం ముందు నటించేదాన్ని. నటనను కెరీర్‌గా చేసుకోవాలనే ఆలోచన ఎప్పుడూ లేదు’’ అంటారు కరిష్మా.

  • ట్రోలింగ్‌ ఎదుర్కొన్నా...

కరిష్మా స్వస్థలం జమ్ము. అయిదేళ్ళ వయసులోనే ఆమె తండ్రి చనిపోయారు. కరిష్మాను, ఆమె అక్క నేహాను తల్లే పెంచి పెద్ద చేశారు. ‘‘మాది దిగువ మధ్య తరగతి కుటుంబం. స్థిరమైన ఉద్యోగం చేస్తే తప్ప కుటుంబం సజావుగా గడవదనే సంగతి తెలుసు. అయితే కళలు, సృజనాత్మకత అంటే నాకు ఇష్టం. అందుకే ఇండోర్‌లో మాస్‌ కమ్యూనికేషన్స్‌ డిగ్రీ చేశాను. 2015లో ‘మై ఎఫ్‌ఎం’లో రేడియో జాకీ (ఆర్జే)గా చేరాను. కొన్నాళ్ళ తరువాత ‘రెడ్‌ ఎఫ్‌ఎం’లో ఆఫర్‌ వచ్చింది. సాధారణంగా నేను లేట్‌నైట్‌ షోలు చేసేదాన్ని.


ప్రేమ, అనుబంధాలు లాంటి వాటి గురించి ఎక్కువగా మాట్లాడేదాన్ని’’ అని గుర్తు చేసుకున్నారు కరిష్మా. రొటీన్‌గా సాగిపోతున్న ఆమె జీవితం కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో కొత్త మలుపు తిరిగింది. ‘‘ఇంటి నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో నాకు ఏమీ తోచేది కాదు. పుస్తకాలు చదివినా, సినిమాలు చూసినా ఇంకా ఏదో వెలితిగానే అనిపించేది. క్రియేటివ్‌గా ఏదైనా చేద్దామనుకున్నాను.

అత్తా కోడళ్ళ సంభాషణతో ఒక షార్ట్‌ రీల్‌ తీశాను. దాన్ని మా అక్కకు చూపించాను. ‘‘దీన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చెయ్యొచ్చుగా’’ అంది. ‘‘నేను సరదాగా చేశాను. దాన్ని పోస్ట్‌ చెయ్యాలనుకోవట్లేదు’’ అన్నాను. ‘‘నువ్వు చెయ్యకపోతే నేనే చేస్తాను’’ అనడంతో, చివరికి అయిష్టంగానే పోస్ట్‌ చేశాను. ‘దీన్నెవరు పట్టించుకుంటార్లే’ అనుకున్నాను. కానీ మూడు రోజుల్లో ముప్ఫై లక్షల వ్యూస్‌ వచ్చాయి.

ప్రశంసలతో పాటు ‘ఈ రోజుల్లో అత్తా కోడళ్ళు ఇలా ఉన్నారా? కాలంతో పాటు మీరు మారరా?’ అనే విమర్శలు కూడా వచ్చాయి. ట్రోలింగ్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది. దాంతో ‘ఇక మీదట కొనసాగిద్దామా? లేదా?’ అనే సందిగ్ధంలో ఉండగా... ఒక అమ్మాయి నుంచి మెసేజ్‌ వచ్చింది. ‘‘పది రోజుల తరువాత మొదటిసారిగా నవ్వాను. మీకు థ్యాంక్స్‌ చెబుదామని ఈ మెసేజ్‌ చేస్తున్నాను’’ అని! తన సోదరుడు కొవిడ్‌తో మరణించాడనీ, ఆ విషాదంలో ఉన్న తనకు నా రీల్‌ కాస్త ఊరట కలిగించిందనీ ఆమె తెలిపింది. నా చిన్న ప్రయత్నం మరొకరికి సంతోషం కలిగించిందని తెలిశాక... ఇక తగ్గేదిలే! అనుకున్నాను. ఆ తరువాత వెనుతిరిగి చూడలేదు’’ అని చెబుతారు కరిష్మా.


  • వారి ఆశీస్సులే అమ్మను బతికించాయి...

ఈలోగా ఆమె తల్లి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కేన్సర్‌ ఉన్నట్టు వైద్య పరీక్షల్లో తేలింది. తల్లి సంరక్షణ కోసం ఎవరో ఒకరు పక్కనే ఉండాల్సి వచ్చింది. ‘‘ఆ సమయంలో మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా నేనూ, మా అక్కా బాగా కుంగిపోయాం. ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నా ఇల్లు గడపడం, మా అమ్మ వైద్య ఖర్చులు భరించడం కష్టమైపోయింది. నాన్నను చిన్నప్పుడే పోగొట్టుకున్నాం. అమ్మయినా దక్కుతుందో లేదో అనుకున్నాం. సరిగ్గా ఆ సమయంలోనే నా కంటెంట్‌కు పాపులారిటీ పెరిగింది. ప్రమోషన్లు, ప్రకటనలు, బ్రాండ్లతో భాగస్వామ్యాలు వెతుక్కుంటూ వచ్చాయి... వాటితో పాటే డబ్బు కూడా. అమ్మకు వైద్యం చేయించగలిగాం. అమ్మ ఇప్పుడు జీవించి ఉందంటే... వీక్షకులు నామీద చూపించిన ప్రేమే కారణం. ‘‘మీ వీడియోలతో మమ్మల్ని ఎంతగానో నవ్విస్తున్నారు. మీరు ఎప్పుడూ బాధ పడకూడదు’’ అని ఎంతోమంది కోరుకున్నారు. వారందరి ఆశీస్సులే అమ్మను బతికించాయి’’ అంటారు కరిష్మా ఉద్వేగంగా.


  • నా జీవితంలో అద్భుతాలు జరిగాయి...

ఈ ఏడాది జూలై-ఆగస్ట్‌ మధ్య ప్యారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌కు తమ తరఫున అతిథిగా ‘యూట్యూబ్‌’ ఆమెను ఎంపిక చేసింది. ఈ గౌరవం దక్కిన మొదటి భారతీయ కంటెంట్‌ క్రియేటర్‌ కరిష్మా. ప్రస్తుతం ఆమెకు పదిహేను లక్షల మందికి పైగా సబ్‌స్ర్కైబర్స్‌ ఉన్నారు. ‘ఫోర్బ్స్‌ ఇండియా- టాప్‌ 100 డిజిటల్‌ స్టార్స్‌- 2024’ లో ఆమెది పద్ధెనిమిదో స్థానం. ఆమె పోస్ట్‌ చేసే ప్రతి వీడియోను కొన్ని లక్షల మంది చూస్తూ ఉంటారు. ‘‘నాలుగేళ్ళ క్రితం ‘‘మనిషి జీవితంలో అద్భుతాలు జరుగుతాయా?’’ అని నన్ను ఎవరైనా అడిగితే... ‘మీకేమైనా పిచ్చా?’ అన్నట్టు చూసేదాన్నేమో! కానీ నా జీవితంలోనే అద్భుతాలు జరిగాయి. చిత్తశుద్ధితో, అంకితభావంతో నచ్చిన పని చేస్తే... విజయం సాధించగలమనడానికి నేనే ఉదాహరణ’’ అంటున్న కరిష్మా... ప్రస్తుతం ఒక టీవీ షో కోసం స్ర్కిప్ట్‌ రాసే పనిలో ఉన్నారు. ‘‘ప్రధాన పాత్రలో కలిపించాలన్నది ప్రస్తుతం నాకున్న పెద్ద కల. అది త్వరలోనే నెరవేర్చుకోబోతున్నాను’’ అని చెబుతున్నారామె.


  • ‘‘నీకు ఆ అవసరం రాదు’’ అన్నారు...

ఏడాది గడిచేసరికి ఉద్యోగాన్నీ, కంటెంట్‌ క్రియేషన్‌నూ బ్యాలెన్స్‌ చేసుకోవడం ఆమెకు కష్టమయింది. ఆర్జే ఉద్యోగానికి రాజీనామా చేశారు. ‘‘ఆ సమయంలో... ‘‘నా ఆదాయం తగ్గిపోతే... మళ్ళీ ఉద్యోగం ఇస్తారా?’’ అని మా సీఈఓను అడిగాను. ‘‘నీకు ఆ అవసరం రాదు’’ అన్నారాయన. ఆ మాటే నిజమయింది. నా వీడియోలకు వ్యూస్‌ పెరిగాయి, సబ్‌స్ర్కైబర్స్‌ పెరిగారు. రణబీర్‌ కపూర్‌, విద్యా బాలన్‌ తదితర బాలీవుడ్‌ నటులతో, సచిన్‌ టెండుల్కర్‌, హార్దిక్‌ పాండ్యా లాంటి క్రీడాకారులతో కలిసి పని చేసే అవకాశం దక్కింది. అంతేకాదు... ఈ ఏడాది మే నెలలో జరిగిన ‘కేన్స్‌ ఫిలిమ్‌ ఫెస్టివల్‌’లో... రెడ్‌ కార్పెట్‌పై నడిచాను. ఒక అంతర్జాతీయ స్థాయి వేడుకలో పాల్గొనడం, ఎంతోమంది చలనచిత్ర రంగ ప్రముఖులతో వేదిక పంచుకోవడం అదే తొలిసారి. దాన్ని జీవితాతం ఒక మధురమైన జ్ఞాపకంగా నా గుండెల్లో దాచుకుంటాను అని చెప్పారు కరిష్మా.

Updated Date - Oct 28 , 2024 | 05:27 AM