ముద్దు.. ముచ్చట!
ABN , Publish Date - Aug 07 , 2024 | 04:09 AM
పారిస్ ఒలింపిక్స్‌లో ఆటలతో పాటు మరో ‘చిత్రం’ కూడా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. విశ్వక్రీడల ప్రారంభోత్సవంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మానుయల్ మాక్రాన్, ఆ దేశపు క్రీడల మంత్రి అమేలీ ఔడియా కాస్టెరాల ముద్దు ఫొటో ఫ్రాన్స్‌లోనే కాదు...ప్రపంచమంతా ‘హాట్’ టాపిక్ అయింది.
ఒలిం‘పిక్స్’
పారిస్ ఒలింపిక్స్‌లో ఆటలతో పాటు మరో ‘చిత్రం’ కూడా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. విశ్వక్రీడల ప్రారంభోత్సవంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మానుయల్ మాక్రాన్, ఆ దేశపు క్రీడల మంత్రి అమేలీ ఔడియా కాస్టెరాల ముద్దు ఫొటో ఫ్రాన్స్‌లోనే కాదు... ప్రపంచమంతా ‘హాట్’ టాపిక్ అయింది. లక్షల్లో కామెంట్స్... కోట్లల్లో వ్యూస్... అంతకుమించిన షేర్స్‌తో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది ఈ ఫొటో. పాశ్చాత్య సంస్కృతిలో హగ్... కిస్... వింతేమీ కాదు. అలాంటప్పుడు వారి ముద్దు ముచ్చటపై ఎందుకంత చర్చ? ఎందుకంటే... ఆ చిత్రంలో కనిపించిన గాఢతే అంటున్నారు నెటిజన్లు. మాక్రాన్‌ను హత్తుకుని, ఒక చేత్తో మెడను చుట్టేసి, మరో చేయిని ఆయన చేతిలో వేసి, అమేలీ ముద్దు పెట్టిన తీరు అభ్యంతరకరంగా ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఆ సమయంలో పక్కనే ఉన్న ఫ్రెంచ్ ప్రధాని గాబ్రియల్ అట్టాల్ తన చూపును పక్కకు తిప్పుకున్నారు. ‘మర్యాదపూర్వకమైన పెక్ హద్దులు దాటింది’ అని సొంత దేశస్తులే విమర్శలు కురిపిస్తున్నారు.
వాగ్దానం నిలబెట్టుకోవాలని...
ఫ్రెంచ్ పారిశ్రామికవేత్త అయిన 46 ఏళ్ల అమేలీ ఒకప్పుడు ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారిణి కూడా. క్రీడలు, ఒలింపిక్, పారాఒలింపిక్ గేమ్స్ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. గతంలో మాక్రాన్ ఆమెకు క్రీడలతో పాటు విద్యా శాఖ బాధ్యతలు అప్పగించారు. టీచర్లు లేరన్న కారణంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న తన కూతుర్ని తీసుకువెళ్లి ప్రైవేటు విద్యా సంస్థలో చేర్చడంతో దుమారం రేగింది. దాంతో విద్యా శాఖా మంత్రిగా అమేలీని బాధ్యతల నుంచి తప్పించాల్సి వచ్చింది. ఇదిలావుంటే ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి వేదిక అయిన సీన్ నది కాలుష్యమయమైందని, అందులో ఇ-కొలీ ప్రమాదకర స్థాయికి చేరిందని ప్రపంచ మీడియా వరుస కథనాలు రాసింది. ఇది వేదిక సురక్షితమైనది కాదని పేర్కొంది. ‘ఆ కథనాల్లో వాస్తవం లేదని నిరూపించ డానికి గేమ్స్‌కు ముందు ఆ నదిలో ఈత కొడతా’నని అమేలీ నాడు ఉద్ఘాటించారు. చెప్పినట్టుగానే ఒలింపిక్స్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ఆమె సీన్ నదిలో మునిగి చూపించారు. ‘మేము మా వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాం’ అంటూ బలమైన సందేశం పంపించారు.