Share News

ఆకర్షణ లోపిస్తే..?

ABN , Publish Date - Sep 05 , 2024 | 03:56 AM

సన్నిహిత సమయాల్లో దాపరికం లేకుండా మెలగడం, ఒకరి స్పర్శనూ, దగ్గరితనాన్నీ మరొకరు మనస్ఫూర్తిగా ఆస్వాదించడం అవసరం. లైంగిక సాన్నిహిత్యం దంపతుల మధ్య దూరాలు తగ్గించాలి. అంతేతప్ప, అసౌకర్యాలకూ, ఇబ్బందులకూ, మనస్పర్థలకూ కారణం కాకూడదు...

ఆకర్షణ లోపిస్తే..?

కౌన్సెలింగ్‌

డాక్టర్‌! నాదొక చిత్రమైన అనుమానం. దంపతుల మధ్య కాలక్రమేణా లైంగిక ఆకర్షణ తగ్గడం సహజం. ఇలాంటప్పుడు ఇద్దరి మధ్యా అనుబంధం బలహీనపడే ప్రమాదం ఉంటుంది కదా? అలాంటప్పుడు దంపతులను కలిపి ఉంచే అంశం ఏముంటుంది?

ఓ సోదరి, హైదరాబాద్‌.

సన్నిహిత సమయాల్లో దాపరికం లేకుండా మెలగడం, ఒకరి స్పర్శనూ, దగ్గరితనాన్నీ మరొకరు మనస్ఫూర్తిగా ఆస్వాదించడం అవసరం. లైంగిక సాన్నిహిత్యం దంపతుల మధ్య దూరాలు తగ్గించాలి. అంతేతప్ప, అసౌకర్యాలకూ, ఇబ్బందులకూ, మనస్పర్థలకూ కారణం కాకూడదు. ఒత్తిడి, ఆందోళనలు సాన్నిహిత్యానికి ప్రధాన శత్రువులు. పెళ్లైన మొదట్లో శారీరక ఆకర్షణలు సహజం. కానీ కాలక్రమేణా అవి మసకబారే అవకాశాలుంటాయి. అయితే కేవలం శారీరక ఆకర్షణే దంపతుల్ని కలిపి ఉంచుతుందనుకుంటే పొరపాటు. అంతకు మించి ఒకరి ఉనికిని మరొకరు ఆనందించడం, ఒకరి అభిప్రాయాలను వేరొకరు గౌరవించడం, సమస్యలను కలిసికట్టుగా పరిష్కరించుకోవడం, చర్చలు, సంప్రతింపులు లాంటివన్నీ దంపతులను కలిపి ఉంచుతాయి.


ఎంతటి అభిప్రాయభేదాలొచ్చినా, ఎన్ని గొడవలు జరిగినా రాత్రి పడుకునే ముందు వాటి గురించి, పరిష్కరించుకుని, మనసులు తేలిక పరుచుకుని, ప్రేమగా హత్తుకుని, మునుపటి సాన్నిహిత్యాన్ని కొనసాగించాలి. దంపతుల మధ్య అహంభావాలు, పొగరు లాంటివి పనికి రావు. అలాగని అలకలు, బుజ్జగింపులు ఉండకూడదని అనడానికి వీల్లేదు. అవి కూడా ఉండి తీరాలి. అయితే అంతిమంగా చివరివరకూ జీవితాన్ని అన్యోన్యంగా కొనసాగించడమే ధ్యేయంగా నడుచుకోవాలి.

డాక్టర్‌ రమ,

గైనకాలజిస్ట్‌, హైదరాబాద్‌

Updated Date - Sep 05 , 2024 | 03:56 AM