Beauty Secrets : నుదిటి మీద మొటిమలు వస్తున్నాయా!
ABN , Publish Date - Nov 04 , 2024 | 04:47 AM
చలికాలంలో నుదిటిమీద ఎక్కువగా మొటిమలు వస్తుంటాయి. ఇవి చిన్నగా ఉన్నప్పటికీ విపరీతమైన నొప్పిని కలిగిస్తాయి. హార్మోన్ల అసమతుల్యత, జన్యువుల తీరు..
Beauty Secrets :
చలికాలంలో నుదిటిమీద ఎక్కువగా మొటిమలు వస్తుంటాయి. ఇవి చిన్నగా ఉన్నప్పటికీ విపరీతమైన నొప్పిని కలిగిస్తాయి. హార్మోన్ల అసమతుల్యత, జన్యువుల తీరు, పరిశుభ్రత పాటించకపోవడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయి ఈ రకం మొటిమలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని నివారించే మార్గాలు తెలుసుకుందాం!
శీతాకాలంలో అందరికీ తలలో చుండ్రు ఉంటుంది. ఇది నుదిటి భాగంపై రాలినపుడు అందులోని బ్యాక్టీరియా చర్మ రంధ్రాల్లోకి చేరి వాటిని మూసివేయడం వల్ల మొటిమలు ఏర్పడతాయి. అందుకే తలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చుండ్రు, పేలు వంటివి ఉంటే వాటి నివారణకు చికిత్స చేయించుకోవాలి.
శరీరంలో హార్మోన్ల పనితీరు సరిగా లేనప్పుడు చర్మ రంధ్రాల నుంచి అధికంగా నూనె ఉత్పత్తవుతుంది. ఇది చర్మం మీద ఉన్న మృత కణాలు, చెమట, ఇతర బ్యాక్టీరియాలతో కలసి చర్మ రంధ్రాలు మూసుకుపోయేలా చేస్తుంది. అప్పుడు కూడా మొటిమలు వస్తాయి. జిడ్డు చర్మం ఉన్నవారికి ఈ సమస్య అధికంగా ఉంటుంది. వీలైనన్నిసార్లు ముఖాన్ని కడుక్కోవడం, దిండు గలీబులను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నుదిటిని చేతితో తాకకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే మొటిమలు తగ్గుముఖం పడతాయి.
ఒక గిన్నెలో రెండు చెంచాల జోజోబా ఆయిల్ లేదా కొబ్బరి నూనె వేసి దానికి రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్ కలిపి ఆ మిశ్రమాన్ని కాటన్ బాల్ సహాయంతో నుదుటి మీద రాస్తే మొటిమల్లోని సూక్ష్మజీవులు నశించిపోతాయి. రెండు చెంచాల పసుపుకు తగినంత తేనె కలిపి ఆ మిశ్రమాన్ని మొటిమల మీద రాసినాకూడా మంచి ఫలితముంటుంది. ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్‌కు మూడు చెంచాల నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని నుదుటికి పట్టించి రాత్రంతా అలాగే ఉంచుకొని ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లతో కడగాలి. ఇలా రెండు రోజులకోసారి చేయడం వల్ల మొటిమలు పెరగకుండా ఉంటాయి.