పనికిరాని ఆలోచన
ABN , Publish Date - Mar 25 , 2024 | 11:17 PM
ఒక అడవిలో ఓ కుందేలు ఉండేది. ఆ కుందేలుకు తనే గొప్ప కావాలనే ఆలోచన ఉండేది. తనకంటే అందరూ తక్కువ. తనను చూసి అందరూ భయపడాలని అనుకునేది. కుందేలు పట్టాలని ఓ వేటగాడు వల పన్నాడు. కుందేలు రోజులానే తన ఆహారానికి వెళ్తోంటే.. అది చూసి ఓ కొంగ జాలిపడింది. ‘అటు వైపు వెళ్లకు అని సలహా’ ఇచ్చింది. కుందేలు
ఒక అడవిలో ఓ కుందేలు ఉండేది. ఆ కుందేలుకు తనే గొప్ప కావాలనే ఆలోచన ఉండేది. తనకంటే అందరూ తక్కువ. తనను చూసి అందరూ భయపడాలని అనుకునేది. కుందేలు పట్టాలని ఓ వేటగాడు వల పన్నాడు. కుందేలు రోజులానే తన ఆహారానికి వెళ్తోంటే.. అది చూసి ఓ కొంగ జాలిపడింది. ‘అటు వైపు వెళ్లకు అని సలహా’ ఇచ్చింది. కుందేలు అక్కడే ఆగిపోయింది. వేటగాడు పన్నిన ఆ ఉచ్చులో అడవి పంది పడింది. దీంతో కుందేలు హమ్మయ్య అనుకుంది. ఆ కొంగతో స్నేహం కొనసాగించింది.
కొంగ దగ్గరకు పోయి కుందేలు రోజూ బీరాలు పలికేది. కొంగ అవన్నీ పట్టించుకునేది కాదు. ఒక రోజు కొంగతో కుందేలు ఇలా అన్నది. ‘ఓ నక్క ఉన్నది. దాన్ని భయపెట్టాలి’ అన్నది. ‘అది నీవల్ల కాదేమో’ అన్నది కొంగ. ‘నాకు దంతాలు బావున్నాయా?’ అనడిగింది కుందేలు. ‘చక్కగా ఉన్నాయి’ అన్నది. ‘నాకు కోర పండ్లు కావాలి. అమరుస్తావా?’ అన్నది. ‘నీకెందుకు కోర పండ్లు’ అనడిగింది. ‘నన్ను చూసిన తర్వాత ఆ నక్క భయపడాలి’ అంటూ ఊగిపోయింది. చేసేది ఏమీలేక.. ఆ కుందేలుకు రెండు కోర పండ్లను అమర్చింది కొంగ.
ఆ కోరపండ్లను చూసి ఇతర జంతువులన్నీ భయపడతాయనేది కుందేలు ఆలోచన. అడవిలోని ఓ కొలను దగ్గరకు వెళ్లి తన దంతాలను చూసుకుంది. ‘నక్కలేమి కర్మ. పులులూ భయపడాల్సిందే’ అనుకుంది మనసులో. ఆ కుందేలును చూసి తోటి కుందేళ్లు భయపడి పరిగెత్తాయి. కుందేలుకు మరింత ఉత్సాహం వచ్చింది. నక్క ఉండే చోటకు కుందేలు నడిచింది. ఓ నక్క పొదలచాటున ఉంది. దాని దగ్గరకు కుందేలు పోబోయింది. నక్క పోతుందనేది కుందేలు ఆలోచన. కుందేలు దగ్గరకు వచ్చిన తర్వాత క్షణాలు నక్క దూకింది. కుందేలు క్షణాల్లో తప్పించుకుని పరిగెత్తింది. బాధతో కుందేలు తన మిత్రుడు దగ్గరకు చేరింది. అసలు ఈ దంతాలతో ఎవరూ భయపడలేదన్నది.
‘మార్చాల్సినది దంతాలు కాదు. అయినా కోర పండ్లు ఉంటే ఎందుకు భయపడాలి?నువ్వు కుందేలువే కదా’ అన్నది. ‘అవును’ అన్నది కుందేలు. ‘మారాల్సింది నీ భయం. నీ పిరికిగుండెతో ఎన్ని కోరపండ్లు ధరించినా ఏం లాభం? ఏ వేషం వేసినా ఉపయోగమేమీ’ అన్నది కొంగ. ‘అంతేనంటావా?’ అనడిగింది. ‘అవును ఈ పనికిరాని ఆలోచలను పక్కనబెట్టేసి నీ బతుకు నువ్వు బతుకు’ అన్నది. =