Share News

దాన ఫలం

ABN , Publish Date - Sep 04 , 2024 | 04:00 AM

అవంతీపురాన్ని పరిపాలించే రాజుప్రసేనుడికి తన గురువు ఆనందుడు అంటే అమితమైన భక్తి, గౌరవం. తనకు పాలనలో ముఖ్యమైన సలహాలనిచ్చి, తనకు సాయం చేసినందుకు కృతజ్ఞతగా గురువుకు ఒకరోజు మంచి పట్టు బట్టలు కానుకగా...

దాన ఫలం

అవంతీపురాన్ని పరిపాలించే రాజుప్రసేనుడికి తన గురువు ఆనందుడు అంటే అమితమైన భక్తి, గౌరవం. తనకు పాలనలో ముఖ్యమైన సలహాలనిచ్చి, తనకు సాయం చేసినందుకు కృతజ్ఞతగా గురువుకు ఒకరోజు మంచి పట్టు బట్టలు కానుకగా సమర్పించాడు రాజు. గురువుగారు తన ఆశ్రమానికి తిరిగి వెళుతూ ఆ బట్టలనుదారిలో చలికి వణికిపోతున్న ఒక బిచ్చగాడికి ఇచ్చేసాడు. తాను గురువు గారికి కానుక ఇచ్చిన కొత్త పట్టు బట్టలు ఒక బిచ్చగాడి వద్ద ఉన్నట్టు భటుల ద్వారా తెలుసుకున్న రాజుకు చాలా కోపం వచ్చింది. తన గురువు తనను అవమానించాడని భావించి, వెంటనే గురువు గారికి ఎందుకిలా చేసారని ప్రశ్నిస్తూ, ఒక లేఖ పంపాడు. ఆ లేఖ చదువుకుని రాజు ఆగ్రహాన్ని అర్థం చేసుకున్న ఆనందుడు ఇలా ప్రత్యుత్తరం పంపాడు. ‘రాజా.. ఒకరికి మనం ఏదైనా ఇచ్చాము అంటే దాని మీద హక్కును పూర్తిగా వదులుకున్నట్టే, అది ఇకపై మనది కాదు. పట్టుబట్టల విషయం మీరు ఇంకా గుర్తుంచుకుని నన్ను అడుగుతున్నారంటే, ఇంకా మీరు వాటిని మీవిగా భావిస్తూనే ఉన్నారు అన్నమాట.


వాటి మీద హక్కును కలిగి ఉంటూ మీరు ఎన్ని దానాలు చేసినా మీకు దాన ఫలం రాదు, తృప్తి కూడా కలగదు.. ఆ పట్టు బట్టల అవసరం ఆ సమయానికి నాకంటే ఆ బిచ్చగాడికే ఎక్కువ ఉందని నేను అతనికి ఇచ్చేసాను మీరొకసారి నాకు ఇచ్చివేసాక నేను వాటిని ఎలా ఉపయోగించుకుంటాను అనేది పూర్తిగా నా ఇష్టం కదా’ అని. గురువు గారి ప్రత్యుత్తరం చదువుకున్న రాజు అందులో ఉన్న పాఠం అర్థం చేసుకున్నాడు మరెపుడూ ఎవరికి ఏమి దానమిచ్చినా మనస్ఫూర్తిగా ఇచ్చివేసి, మరల దానీ గురించిన ఆలోచనే మరచిపోయాడు.

Updated Date - Sep 04 , 2024 | 04:00 AM